పీపీపీ పద్దతిలో రోడ్లేస్తే ప్రైవేట్ రోడ్లవుతాయా మెడికల్ కాలేజీలంతే

పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం అని సీఎం చంద్రబాబు మరో సారి స్పష్టం చేశారు.

Update: 2025-12-17 08:25 GMT

పీపీపీ పద్దతిన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా... అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయి. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా... అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయి. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుతాయి. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లం. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అవి ప్రైవేటు వ్యక్తులది అయిపోతాయా?”అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు ఉండాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంతో పాటు... జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత, సంతృప్తి పెరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుంది. ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. దీన్ని గుర్తుపెట్టుకుని కలెక్టర్లు పని చేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కీలకం. కొన్ని అంశాల్లో ప్రజా ప్రతినిధుల సూచనలు అమలయ్యేలా చూడాలి. అలాగే వారి సేవలను కూడా వినియోగించుకోవాలి. వివిధ జిల్లాల్లో అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్ లైన్‌లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదాం. చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు తెలియచేసేలా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలను పటిష్టంగా అమలు చేసి 15 శాతం వృద్ధి రేటు సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
Tags:    

Similar News