రాష్ట్రానికి సీఎం అయినా, నారావారిపల్లె పిల్లోడినే అనేది చంద్రబాబు మనసులో మాట. అధికారంలో ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నానా? అనేది కాకుండా సీఎం ఎన్. చంద్రబాబు కుటుంబంతో సహా నారావారిపల్లెకు రావడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి శనివారమే నారావారిల్లెకు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్న సీఎం కొడుకు నారా లోకేష్ కూడా చేరుకున్నారు. సాయంత్రం సీఎం చంద్రబాబు తిరుపతిలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (DPNG) ప్రారంభిస్తారు. ఓ ప్రైవేటు కంపెనీ నివాసాలకు నేరుగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం నారావారిపల్లెకు చేరుకునే సీఎం చంద్రబాబు బుధవారం వరకు స్వగ్రామంలోనే ఉంటారు.
సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబీకుల రాక నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇన్చార్జి ఎస్పీ మఠికంఠ చందోలు ఈపాటికే సమీక్షించారు. ఇది ప్రొటోకాల్ లో భాగమే. అయినా..
ఈ ఏడాది సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం (12వ తేదీ) తిరుపతికి చేరుకని, సాయంత్రం నారావారిపల్లెకు వెళతారు. మూడు రోజులు పల్లెలోనే బంధువులు, గ్రామస్తుల మధ్య గడపనున్నారు. వారితో పాటు నందమూరి కుటుంబీకులు కూడా జత కలవనున్నారు. బావాబామర్దులు, అల్లుళ్ల సరదాలు ఏటా సంక్రాంతి సందర్బంగా గోదావరి జిల్లాల తరువాత నారావారిపల్లెలో కనిపిస్తుంది.
నారావారిపల్లెలో ప్రత్యేకత ఏమిటంటే సీఎం చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి బంధువులైన ప్రతి ఇంటికి వెళతారు. పాత బంధువులు వరుసకు ఏమి అవుతారు. ఎలా బంధువులు అనేది పాత వారినే కాదు. కొత్తగా అల్లుళ్లుగా, కోడళ్లుగా వచ్చినా వారందరినీ పేరుపేరునా పరిచయం చేయడానికి సీఎం హోదాలో ఉన్నా చంద్రబాబు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు.
మంత్రి నారా లోకేష్ తీరు ప్రత్యేకంగా ఉంటుంది. బేషజం, ప్రొటోకాల్ పక్కకు ఉంచి, గ్రామంలోని యువకులతో కలసి ఆటపాటలతో సందడి చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించడం గ్రామాస్తులు ఆనందంగా భావిస్తారు. అనేక సంవత్సరాలుగా లోకేష్ ఇదే తరహాలో వ్యవహారిస్తూ, నేనూ ఈ పల్లె పిల్లోడినే అనే విధంగా తండ్రి చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రామస్తులతో మమేకం కావడం ద్వారా బంధువులు, గ్రామస్తుల్లో ఆనందం నింపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈసారి కూడా నారావారిపల్లెలో అదే సందడి కనిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతి మొదటి పండుగకు భోగిమంటలు వేయడం నుంచి ముగ్గుల పోటీలు, క్రీడా సంబరాలు, పశువుల పండుగ, చివరి రోజు మూడో పండుగ రోజు పెద్దల సమాధుల వద్ద వారి ఆత్మశాంతికి నివాళులు అర్పించే వరకు సీఎం చంద్రబాబు, నందమూరి కుటుంబంలోని సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో పాటు ఆయన కుటుంబీకులు హాజరయ్యే అవకాశం ఉంది.
పల్లెకు కొత్త కళ
నారావారిపల్లెకు మూడు రోజుల కిందటి నుంచే పండుగ వాతావరణం వచ్చిది. గ్రామంలో వీధులు నిత్యం పరిశుభ్రంగా ఉంచుతారు. పండుగ వేళ రంగవల్లులతో తీర్చదిద్దడమే కాదు. ఇళ్లు, ఆలయాల ముందు చలువ పందిళ్లు వేశారు. ఇళ్లవద్ద ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు.
15 గ్రామాలకు ఏటీఎం సేవలు
బంధువులు గారపాటి శ్రీనివాస్, నందమూరి జయశ్రీ, చలసాని చాముండేశ్వరి, నారా ఇందిర తదితరులతో కలిసి నారావారిపల్లెకు చేరుకున్న సీఎం భార్య నారా భువనేశ్వరి శనివారం యూనియన్ బ్యాంకు ఏటీఎంను ప్రారంభించారు. ఆమె సమీప బంధువు చలసాని చాముండేశ్వరి ఏటీఎంలో లావాదేవీలు చేశారు. సంక్రాంతి పండుగ రోజు గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు భువనేశ్వరి బహుమతులు అందివ్వనున్నారు. అంతేకాకుండా, సీఎం చంద్రబాబు కుటుంబం నాలుగు రోజుల నారావారిపల్లలోనే ఉండబోతున్నారు. దీంతో స్థానికులే కాకుండా, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కూడా ఇక్కడ ఉంటారు. వారందరికీ పండుగ భోజనాలు, పిండివంటలు వడ్డించడానికి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యవేక్షిస్తున్నారు.