RRR Case | ప్రభావతి ఎక్కడున్నా 7,8 తేదీల్లో విచారణకు వెళ్లాలి
డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు పై దాడి కేసులో కీలక సాక్షిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి విచారణకు సహకరించాలని ఆదేశించింది.;
By : The Federal
Update: 2025-04-01 11:12 GMT
ట్రిపుల్ ఆర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ,ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు పై దాడి కేసులో కీలక సాక్షిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఆమె ఎక్కడ ఉన్నా ఏప్రిల్ 7, 8 తేదీలలో విచారణకు హాజరుకావాలని ఉత్తర్వులు ఇచ్చింది.
మాజీ ఎంపీ, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Supreme Court)పై కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి దర్యాప్తునకు తప్పక సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైసీపీ అధికారంలో ఉండగా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ప్రభావతి పనిచేశారు. రఘురామపై కస్టోడియల్ టార్చర్‌లో ఎలాంటి గాయాలు కాలేదని అప్పట్లో ఆమె నివేదిక ఇచ్చారు. దీన్ని రఘురామ కృష్ణ రాజు ఆక్షేపించారు. ప్రభుత్వ వత్తిడి కి తలొగ్గి ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఆమె గత కొంత కాలంగా విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఫిర్యాదు చేశారు.
ఈ అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 7, 8 తేదీల్లో సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరుకావాలని ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.
సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తునకు సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఒక్కసారే విచారణకు పిలిచారని.. రెండు నెలల్లో మళ్లీ పిలవలేదని ప్రభావతి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎప్పుడు నోటీసులు పంపినా.. ప్రభావతి తప్ప ఎవరో ఒకరు స్పందిస్తున్నారని సిద్ధార్థ లూథ్రా అన్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది.