రోల్‌ మోడల్స్‌.. ఆ సీనియర్‌ సిటిజన్స్‌

విశాఖ ఉక్కు రిటైర్డ్‌ ఉద్యోగులు రైలు ప్రయాణికుల దాహం తీరుస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా వాటర్‌ బాటిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.;

Update: 2025-05-13 04:17 GMT
మంచినీటి పంపిణీ చేపట్టిన వివిధ సంస్థల ప్రతినిధులు

సాధారణంగా సీనియర్‌ సిటిజన్లు ఏం చేస్తారు? స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో గడుపుతూ కాలక్షేపం చేస్తారు. రామా కృష్ణా అనుకుంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ ఈ సీనియర్‌ సిటిజన్లు మాత్రం అలా చేయడం లేదు. దేశంలో మరెక్కడా లేనివిధంగా మండు వేసవిలో రైళ్లలో ప్రయాణించే వారి దాహార్తి తీర్చేందుకు నడుం బిగించారు. రైలు ఆగగానే ఉరుకులు పరుగులతో వెళ్లి మంచినీటి బాటిళ్లను వారి చేతిలో పెడుతున్నారు. సాటి సీనియర్‌ సిటిజన్లకు రోల్‌ మోడల్స్‌గా నిలుస్తున్నారు.

                దువ్వాడలో రైలు ప్రయాణికులకు వాటర్‌ బాటిళ్లను అందిస్తున్న సీనియర్‌ సిటిజన్లు

ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల వడగాడ్పులూ వీస్తున్నాయి. ఇలాంటి వేసవిలో రైళ్లలో ప్రయాణించే సాధారణ ప్రజానీకం మంచి నీళ్ల కోసం అల్లాడి పోతుంటారు. వారి దాహం తీర్చడానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పదవీ విరమణ చేసిన కొంతమంది సీనియర్‌ సిటిజన్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. రైల్వే వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం సందీప్‌ సూచనతో వీరు విశాఖ సివారులోని దువ్వాడ రైల్వే స్టేషన్‌ మీదుగా వెళ్లే రైళ్ల బోగీల్లోని సాధారణ ప్రయాణికులకు ఏప్రిల్‌ 30 నుంచి మంచినీటి బాటిళ్లను అందిస్తున్నారు. స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించే వారు రైళ్లలో వచ్చే వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేసుకోగలుగుతారు.

                            దువ్వాడలో రైలు ప్రయాణికులకు వాటర్‌ బాటిళ్లను అందిస్తున్న సీనియర్‌ సిటిజన్లు

 కానీ సాధారణ బోగీల్లో ప్రయాణించే వారు కొనుక్కోవడం కష్టమని భావించి వీరికి పంపిణీ చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఇందుకోసం దూరప్రాంతం నుంచి వచ్చే భువనేశ్వర్‌ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకున్నారు. ఈ రైలు విశాఖపట్నంలో మధ్యాహ్నం 1.05 గంటలకు బయల్దేరి 1.30కి దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ రెండు నిమిషాలు ఆగుతుంది. ఈ స్వల్ప వ్యవధిలోనే రైలుకు ముందు, వెనక ఉండే జనరల్‌ బోగీలతో పాటు మహిళలు, దివాంగుల బోగీల్లోని సాధారణ ప్రయాణికులకు ఈ సీనియర్‌ సిటిజన్లు పరుగు పరుగున కిటికీల వద్దకు వెళ్లి లీటరు ఆర్‌వో కూలింగ్‌ వాటర్‌ బాటిళ్లను ఉచితంగా అందజేస్తున్నారు. ఇలా రోజుకు 200–250 మంది రైలు ప్రయాణికులకు దాహార్తిని తీరుస్తున్నారు. ఎండలకు అప్పటికే దాహంతో అల్లాడి పోతున్న ప్రయాణికులు ఆ బాటిళ్లలోని చల్లని వాటర్‌ తాగిు వేసవి తాపం నుంచి ఎంతో ఉపశమనం పొందుతున్నారు. ప్రధానంగా ప్రశాంత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మధ్యాహ్నం వేళ దువ్వాడ స్టేషన్‌ మీదుగా వెళ్లే రత్నాచల్, అమరావతి, తిరుమల ఎక్స్‌ప్రెస్‌ల్లో వెళ్లే సాధారణ ప్రయాణికులకు కూడా మంచినీటి బాటిళ్లను వీలును బట్టి పంపిణీ చేస్తున్నారు. ఈ సీనియర్‌ సిటిజన్లు సాధారణ పాసింజర్లకే కాదు.. రైలింజన్‌ లోకో పైలట్లకు, ఆఖరి బోగీలో ఉండే గార్డులకు కూడా కూల్‌ వాటర్‌ బాటిళ్లను అందిస్తున్నారు.

            రైలు ప్రయాణికులకు మంచినీటి బాటిళ్లు ఇస్తున్న చిన్నారులు, మహిళలు

 స్వచ్ఛంద విరాళాల సాయంతో..

దువ్వాడ రైల్వే స్టేషన్‌ మీదుగా రైళ్లలో వెళ్లే సాధారణ ప్రయాణికులకు ఆర్‌వో వాటర్‌ బాటిళ్లకు రోజుకు సగటున రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని ఈ సీనియర్‌ సిటిజన్స్‌తో పాటు వారి సత్సంకల్పానికి స్పందించి స్నేహితులు మరికొందరు, పూర్వ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు, సత్యసాయి, మానవత, మానవ వికాస వేదిక, లయన్స్‌ క్లబ్‌ వంటి సంస్థలు భరిస్తున్నాయి. మరోవైపు మండుటెండలను సైతం లెక్క చేయకుండా రైలు ప్రయాణికులకు మంచినీటి బాటిళ్ల పంపిణీ చేసే బృహత్కార్యంలో మహిళలు, చిన్నారులు కూడా పాలుపంచుకుంటూ తమ ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు.

                                                                            కంచుమూర్తి ఈశ్వర్‌

వేసవి ముగిసే వరకూ కొనసాగిస్తాంః ఈశ్వర్‌

ఈ వేసవి కాలంలో రైళ్లలో సాధారణ బోగీల్లో ప్రయాణించే వారికి తొలుత మజ్జిగను అందించాలనుకున్నాం. కానీ ఎండలకు పులిసిన మజ్జిగ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదన్న భావనతో ఆ ఆలోచనను విరమించుకున్నాం. రైల్వే అధికారుల అనుమతితో గడచిన 14 రోజులుగా రోజుకు 250 మంది వరకు రైలు ప్రయాణికులకు ఉచితంగా ఆర్వో వాటర్‌ బాటిళ్లను అందిస్తున్నాం. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ దువ్వాడ స్టేషన్‌లో ఆగే రెండు నిమిషాల స్వల్ప వ్యవధిలోనే పంపిణీ చేస్తున్నాం. మండు వేసవిలో ప్రయాణిస్తున్న వారు చల్లని మంచినీటితో ఉపశమనం పొందడం ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇస్తోంది. దాతల సాయంతో ఈ వాటర్‌ బాటిళ్ల పంపిణీ వేసవి ముగిసే వరకు కొనసాగిస్తాం. మా సంకల్పాన్ని తూర్పు కోస్తా రైల్వే జీఎం, డీఆర్‌ఎంలు మెచ్చుకుంటున్నారు. దేశంలో మరెక్కడా ఈ తరహా రైలు ప్రయాణికులకు మంచినీటి బాటిళ్ల పంపిణీ జరగడం లేదు’ అని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జెడ్‌ఆర్‌యూసీసీ మెంబర్, దువ్వాడ రైల్వే యూజర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కంచుమూర్తి ఈశ్వర్‌ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధికి చెప్పారు.
Tags:    

Similar News