రోడ్ టెర్రర్: సంకీర్తనకు వెళ్లి వస్తూ.. ఆరుగురు ఇస్కాన్ భక్తుల మృతి..

ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి వస్తున్న బృందం ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు.

Update: 2024-10-26 12:22 GMT

ఇస్కాన్ నగర సంకీర్తనకు వెళ్లి వస్తున్న ఆరుగురు భక్తుల బృందం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటనతో అనంతపురం-కడప హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుపోయిన ఆరుగురు మృతదేహాలను బయటకు తీయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఆరుగురి మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



అనంతపురం ఇస్కాన్ ఆలయానికి చెందిన ఆరుగురు తాడిపత్రికి వెళ్లారు. అక్కడ నగర సంకీర్తన ముగించుకున్న వారంతా ఒకే కారులో తిరిగి అనంతపురం బయలుదేరారు. వారి ప్రయాణిస్తున్న కారు సింగనమల మండలం నాయన పల్లి హైవే వద్ద వస్తుండగా టైరు పేలిపోయినట్లు సమాచారం అందింది. దీంతో అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం లారీ కిందికి దూసుకుపోయి నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని అనంతపురం నగరంలోని ఇస్కాన్ టెంపుల్ కు చెందిన వారీగా గుర్తించారు. మరణించిన వారిలో సంతోష్, షణ్ముగ , వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీ ఉన్నారని గుర్తించినట్లు సమాచారం అందింది. వీరికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇస్కాన్ లో విషాదం
ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న ఇస్కాన్ ఆలయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి చెందాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రదేశంలోనే రెండు రోజుల క్రితం ఇద్దరు మరణించారని తెలిసింది. బైక్ పై వెళుతున్న ఇద్దరినీ మరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని సమాచారం. హైవేపై డివైడర్లు సరిగా లేకపోవడంతో పాటు ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉన్న కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆ ప్రాంతం నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పటికైనా హైవేపై డివైడర్ల ఎత్తు పెంచడంతోపాటు, పోలీస్ పట్రోలింగ్ నిర్వహించేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రమాదాలు గుర్తుచేస్తున్నాయి. దీనివల్ల ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను త్వరగా ఆస్పత్రులకు తరలించడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News