అధికారులకు సీఎం చేసిన ’హితబోధ‘ ఇదే
మంత్రులు, అధికారులు ఫైళ్లను పెండింగులో పెట్టొద్దు, పనితీరు మెరుగు పరుచుకోవాలంటూ మంత్రులు, అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
గత ప్రభుత్వం అధిక వడ్డీలతో చేసిన రుణాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల వల్ల రాష్ట్రానికున్న బ్రాండ్ దెబ్బ తినడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రుణాలు, వడ్డీలను రీ-షెడ్యూల్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాకులో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ ఓడీల సమావేశంలో వివిధ శాఖల అధికారులు... ఆయా శాఖలకు చెందిన ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మేరకు సీఎం వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”గత పాలకుల నిర్లక్ష్యంతో సగటున 12 శాతం మేర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. కొన్ని రుణాలను రీషెడ్యూలింగ్ ద్వారా మొదటి ఏడాదిలోనే రూ.512 కోట్ల మేర ఆదా చేయగలిగాం. ఈ ఏడాది మార్చి నాటికి రూ.1000 కోట్ల మేర ఆదా అవుతుంది. ఇవి కొన్ని కార్పోరేషన్లు వివిధ బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను పరిశీలించి... బ్యాంకులతో సంప్రదింపులు జరిపితే... ఈ మేరకు ఆదా అయింది. హెచ్ఓడీలు జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రజా ధనం వృధా కాకుండా నిలువరించే అవకాశం ఉంది. మొత్తంగా అప్పులపై రూ.7 వేల కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా. గత పాలనలో ఏపీ బ్రాండ్ పోవటం వల్ల అదనంగా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాటన్నిటినీ రీషెడ్యూలు చేసి ప్రజాధానాన్ని కాపాడుతున్నాం. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం రావడంతోపాటు... వాళ్లకు సంతృప్తి కలిగించేలా ప్రభుత్వ శాఖలు పనిచేయాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు. టెక్నాలజీ ఆడిటింగ్ తో పాటు ఆఫీసర్ల వ్యవహరశైలి మారితే ప్రజలు సంతృప్తి చెందుతారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవడమే కాదు... ఫలానా అధికారి, ఫలానా విభాగం బాగా పని చేస్తుందని ప్రజలే చెప్పే స్థాయిలో అధికారులు పని చేయాలి. అంతా కలిసి పని చేస్తే మూడు నెలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.”అని సీఎం అన్నారు.