క్లైమాక్స్‌కు చేరిన.. " నగరి" కుటుంబ కథా చిత్రం..!

అసంతృప్తి నేతలు వైఎస్ఆర్‌సీపీని వీడారు. ఆ పార్టీకి పెద్దదెబ్బ. మూడోసారి గెలవాలని భావిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా విజయంపై తీవ్రప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.

Update: 2024-05-04 09:02 GMT

(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో "నగరి కుటుంబ కథా చిత్రం" క్లైమాక్స్‌కు చేరింది. పోలింగ్ సన్నివేశానికి ముందే కీలక నాయకులందరూ పక్కకు తప్పుకున్నారు. ఇవి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న మంత్రి, ఆర్కే రోజాకు విషమపరీక్షగా మారాయి. పార్టీని వీడుతూ అసమ్మతి వర్గ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రముఖిగా మారారు" ఈమె నుంచి నియోజకవర్గాన్ని, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది" అన్నారు.

వికటించిన హెచ్చరిక

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని అసమ్మతి వర్గాల నుంచి సినీ కథానాయకి, ఎమ్మెల్యే ఆర్కే రోజాకు భారీ షాక్ తగిలింది. అసమ్మతివర్గ నాయకులను నియంత్రించే లక్ష్యంగా తనపై అవినీతి ఆరోపణలు, ధిక్కార ధోరణితో వ్యవహరించిన ఓ జడ్పిటిసి సభ్యుడిపై ఆమె తాజాగా సస్పెన్షన్ వేటు వేయించారు. ఈ ప్రయోగం కాస్తా వికటించి, నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పారు. "తామంతా టిడిపిలో చేరనున్నట్లు కూడా ప్రకటించారు" ఈ పరిణామం ఎమ్మెల్యే ఆర్కే రోజా విజయంపై తీవ్ర ప్రభావం చూపించడమే కాకుండా అధికార వైఎస్సార్సీపీకి శరాఘాతం కాగలదని భావిస్తున్నారు.

ఈ పరిణామం మిగతా కొన్ని నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఆ నాయకులు పదేపదే చెప్పారు. "పార్టీపై మాకు ఏమాత్రం ఆగ్రహం లేదు. సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై అచంచల గౌరవం ఉంది. ఆర్కే రోజాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించే పూచి మాదని భరోసా ఇచ్చినా ఖాతరు చేయలేదు" అని ఆవేదన చెందారు. టిడిపి నుంచి వైఎస్ఆర్సిపిలోకి తీసుకున్న వారికే పదవులు కట్టబెట్టిన ఎమ్మెల్యే ఆర్కే రోజా, తమను ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరించారని వారు ఆరోపించారు.


పార్టీని వీడిన కీలక నాయకులు

ఐదేళ్లుగా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక్కరే ఒకపక్క. ఐదు మండలాల నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు మరోపక్క నిలిచారు. ఎమ్మెల్యే ఆర్కే రోజాపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టిన వారిలో వడమాలపేట జడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డిపై వైయస్సార్సీపి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భరత్ ద్వారా సస్పెన్షన్ వేటు వేయించారు. మిగతా నాయకులకు ఇది హెచ్చరిక అవుతుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా భావించారు. ఈ వ్యూహం తిరగబడి.. అసమ్మతి వర్గం, నియోజకవర్గంలో ఆయా మండలాల్లో శాసించే సత్తా ఉన్న నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టి మరీ వైఎస్ఆర్సిపి నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

వారిలో ప్రధానంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్, నిండ్ర మండలంలోనే కాకుండా నియోజకవర్గంలో కీలక నాయకుడైన రెడ్డివారి చక్రపాణి రెడ్డి పార్టీకి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు లక్ష్మిపతిరాజు సహా ఇద్దరు ఎంపీటీసీ, ఆరుగురు సర్పంచ్‌లు, 24 మంది కీలక నేతలు పార్టీని వీడిన వారిలో ఉన్నారు. 15 రోజుల క్రితం పుత్తూరు పంచాయతీ బోర్డు చివరి సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ ఏలుమలై (అమ్ములు) తో పాటు మరో ఇద్దరు కీలక నేతలు వైఎస్ఆర్సిపీని వీడి, టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

దోపిడీకి అంతు లేదంట..

నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజా, ఆమె భర్త ఆర్కే సెల్వమణి, సోదరులు కుమారస్వామిరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, అవినీతి, దోపిడీకి అంతం లేకుండా పోయిందని శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆరోపించారు. "నగరిలో ఆర్కే రోజా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాయకులను పట్టించుకోలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నిర్వహించిన సర్వేలో కూడా ఆమె ఓడుతుందని తెలిసిన, తమ వినతులను కూడా ఏమాత్రం ఖాతరు చేయలేదన్నారు. రోజా "సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారు" అని ఘాటుగా ఆరోపించారు. రోజా వల్ల నగరి ప్రజలకు, క్యాడర్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నగరి ప్రజలను పదేళ్లుగా ఆమె, ఒక్కో మండలాన్ని ఆమె కుటుంబసభ్యునికి బాధ్యత అప్పగించి, దోచుకున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. "ఐరన్ లెగ్గుగా ముద్రపడిన ఆర్కే రోజాను. మేము గోల్డెన్ లెగ్‌గా మార్చాం" ఆమె మమ్మల్ని తీవ్రంగా వేధించారు. ఆమె అవినీతి, ఆశ్రితపక్షపాతం భరించలేక వైయస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు.


గత ఎన్నికల నాటి నుంచి..

2019 ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచే ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనేది వైఎస్ఆర్సిపి నుంచి అసంతృప్తితో బయటికి వచ్చిన నాయకుల ఆరోపణ. అంతేకాకుండా, 2022లో సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలకు పుత్తూరులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అంశంపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆడియో వివాదాలకు కారణమైనది. "ఆ వేడుకలకు ఎవరూ వెళ్ళద్దంటూ ఆమె స్వరంతో ఉన్న సందేశం" వైరల్ కావడం నాయకుల మధ్య అగాధం ఏర్పడడానికి దారితీసింది. ఇదిలా ఉండగా, 2014, 2019 ఎన్నికల్లో తనకు అండగా నిలిచి, విజయ సోపానానికి కారకులైన వారిని ఉపేక్షించడం. టిడిపి నుంచి వచ్చిన కొందరిని అక్కున చేర్చుకోవడం మరో కారణం అని చెప్తారు. అదే సందర్భంలో తన సోదరులు ఇద్దరి పెత్తనం, భర్త సెల్వమణి మితిమీరిన జోక్యం వల్ల నియోజకవర్గంలోని నాయకులకు ఎమ్మెల్యే రోజా దూరమైనట్లు అనేక సంఘటనలు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా సోదరులు, ఇతరత్రా కార్యక్రమాల్లో అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. ఇసుక వ్యాపారం ఒకపక్క, పనుల కేటాయింపులు మరోపక్క సోదరులు, భర్త జోక్యం పిచ్చు మీరింది అని ఆరోపించారు. ఈ పరిస్థితుల కారణంగా, గడిచిన ఐదేళ్ల కాలంలో కీలక నాయకులతో ఎమ్మెల్యే రోజాకు ఎడతెగని అంతరం ఏర్పడింది.

అందరూ కలిస్తేనే అంతంత... మెజారిటీ

నగరి నియోజకవర్గంలో రాజకీయ దిగ్గజాలు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రెడ్డి వారి రంగారెడ్డి, టిడిపి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా 2014లో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్‌పై విజయం సాధించారు. ఈ విజయం వెనక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన వెంట నడిచే ప్రస్తుత అసమ్మతివర్గ నాయకులు అందరూ సమష్టిగా పని చేశారు. ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రి ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి 2014లో 858 ఓట్లు, 2019లో 2,007 ఓట్లతో ఆర్కే రోజా గట్టెక్కారు. వైయస్ఆర్సీపీ నుంచి కీలక నేతలందరూ పార్టీ వీడిన నేపథ్యంలో కొన్ని రోజుల్లో జరగనున్న పోలింగ్‌పై ఎంత ప్రభావం ఉంటుంది? ఎమ్మెల్యే ఆర్కే రోజా అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం లేకపోలేదు. అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


"నియోజకవర్గానికి చంద్రముఖి"

"నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా చంద్రముఖిలా మారారు. ఈమె నుంచి నియోజకవర్గాన్ని ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని భావిస్తున్నాము" అని సస్పెన్షన్ వేటుకు గురైన వడమాలపేట జడ్పిటిసి సభ్యుడు మురళీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘2014, 2019 ఎన్నికల్లో నియోజకవర్గ మొత్తం మీద వడమాలపేట నుంచి మెజారిటీ రావడానికి పనిచేశాం’’ అని ఆయన గుర్తు చేశారు. ‘‘2014 ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టిడిపి అభ్యర్థులు గెలిచినా, వడమాలపేట నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నేను ఒక్కడిని మాత్రమే గెలిచిన విషయాన్ని మరిచిపోయార’’ అని మురళీధర్ రెడ్డి అంటున్నారు.

"మాకు మంత్రి పెద్దిరెడ్డి సపోర్టు ఉందంటూ అకారణంగా రోడ్డుకు లాగుతున్నారని" మురళీధర్ రెడ్డి ఆక్షేపణ తెలిపారు. ఇది ముమ్మాటికి కావాలని చేస్తున్న ఆరోపణ అని ఆయన అన్నారు. నగరిలో ఆర్కే రోజాను ఓడించకుంటే.. భూములు ఏమాత్రం మిగలవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్ తీసుకోకుండా ఏపని చేయలేదని, ఎమ్మెల్యే ఆర్కే రోజా అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. పాదిరేడులో రైతుల నుంచి రూ. కోట్లు కమీషన్ రూపంలో దోచుకున్నారని, వడమాలపేట టోల్ వద్ద రూ. కోట్లు విలువైన 12 ఎకరాలు దోచుకున్నట్లు మురళిధరరెడ్డి ఆరోపించారు.

టిడిపిలోకి వైఎస్ఆర్సిపి నేతలు

నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజాను వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన నాయకులందరూ టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజాపై పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి గాలి భానుప్రకాష్ వెంట నడవడానికి నిర్ణయించుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్సిపికి ఈ పరిణామం శరాఘాతం లాంటిది అంచనా వేస్తున్నారు. వైయస్సార్సీపిని వీడిన నాయకులు వల్ల ఆ పార్టీకి ఎంత మేరకు నష్టం జరుగుతుంది, టిడిపి అభ్యర్థికి ఎంతవరకు కలిసి వస్తుందనేది పోలింగ్ తర్వాత తేలనుంది.

Tags:    

Similar News