రేవంత్ మూడుకలల ప్రాజెక్టులు సాధ్యమేనా ?

తెలంగాణాలో తన ఇమేజి శాశ్వతంగా ఉండిపోవాలని రేవంత్ అనుకున్నారు.

Update: 2024-11-19 05:41 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తెలంగాణాలో తనఇమేజి శాశ్వతంగా ఉండిపోవాలని రేవంత్ అనుకున్నారు. అందుకు మూడుప్రాజెక్టులను ఎంచుకున్నారు. ఏ ముఖ్యమంత్రయినా పరిపాలనలో తన పేరు చిరస్ధాయిగా ఉండిపోవాలని అనుకోవటం తప్పేమీకాదు. కాకపోతే అందుకు అనేక అంశాలు తోడవ్వాలంతే. రేవంత్(Revanth) విషయం చూస్తే కాంగ్రెస్(Congress) లో ఏ నేత ముఖ్యమంత్రిగా ఎంతకాలం ఉంటారో ఎవరూ చెప్పలేరు. అందుకనే ఒకేసారి రేవంత్ మూడు ప్రాజెక్టులను టేకప్ చేశారు. అవేమిటంటే మొదటిది మూసీనది పునరుజ్జీవనం(Musi river project), రెండోది ఫోర్త్ సిటీ(Fourth city/Feature city) నిర్మాణం, మూడోది, చివరిది తన నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా సిటి (pharma city) ఏర్పాటు. మూడో ప్రాజెక్టును పక్కనపెట్టినా మొదటిరెండు ప్రాజెక్టులు గనుక ఏర్పాటైతే రేవంత్ పేరు తెలంగాణా చరిత్రలో చిరస్ధాయిగా ఉండిపోవటం ఖాయం.

మూసీనది పునరుజ్జీవనం ప్రాజెక్టుతో పాటు ఫోర్త్ సిటీ ప్రాజెక్టు ఆర్ధికపరంగా చాలా పెద్దవనే చెప్పాలి. ఈ ప్రాజెక్టులు మొదలవ్వాలన్నా, పూర్తవ్వాలన్నా కాలం కలిసిరావాల్సిందే. ఎందుకంటే వేలకోట్ల రూపాయలతో ముడిపడున్న పై రెండు ప్రాజెక్టులు ఏడాది, రెండేళ్ళల్లో పూర్తయ్యేవి కావు. ఒకపుడు రేవంత్ చెప్పినట్లుగానే మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు పూర్తవ్వాలంటే లక్షన్నర కోట్ల రూపాయులు కావాలి. రాష్ట్ర ఆర్ధికపరిస్ధితేమో సుమారు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం సొంతంగా ప్రాజెక్టును టేకప్ చేసే అవకాశం లేదు కాబట్టే అప్పులు లేదా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం(పీపీపీ)లో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

త్రిబుల్ పీ పద్దతిలో ప్రాజెక్టు మొదలైతే ప్రభుత్వం తన పెట్టుబడిగా భూమిని కేటాయిస్తుంది. ఆ భూములను ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్ధ లేదా సంస్ధల కన్సార్షియం అగ్రిమెంటు ద్వారా తన ఆధీనంలోకి తీసుకుని బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్ధల్లోనో తాకట్టు పెడతాయి. తాకట్టు ద్వారా వచ్చే డబ్బులతో ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెడుతుంది. ఇవన్నీ అవ్వాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ ప్రాజెక్టును సాకారంచేయటానికి ప్రభుత్వం శ్రీకారంచుట్టగానే ప్రతిపక్షాలు గోలగోల చేస్తున్నాయి. మూసీనదికి రెండువైపులా ఉన్న నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించకపోతే ప్రభుత్వానికి భూమి అందుబాటులోకి రాదు. భూమి ప్రభుత్వం ఆధీనంలోకి రాకపోతే పీపీపీ పద్దతిలో ప్రాజెక్టును టేకప్ చేయటం సాధ్యంకాదు. అందుకనే ఇళ్ళన్నింటినీ స్వాధీనం చేసుకుని కూల్చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. నివాసితుల్లో వందమంది కోర్టుకు వెళ్ళి తమ ఇళ్ళను కూల్చేందుకులేదని స్టే కూడా తెచ్చుకున్నారు.

ప్రతిపక్షాల అడ్డంకులను లెక్కచేయకపోయినా కోర్టులో కేసులున్నపుడు ప్రభుత్వం తనిష్టంవచ్చినట్లు తాను చేసుకుని పోయేందుకు లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టేందుకు సమయం పట్టేట్లుంది. ఇక ఫోర్త్ సిటీ విషయం చూస్తే ఇది కూడా మూసీనది పునరుజ్జీవనం ప్రాజెక్టు లాగానే సేమ్ టు సేమ్. ఇక్కడ కూడా వేలాది ఎకరాలు కావాల్సిందే. ఈ ప్రాజెక్టు కూడా పీపీపీ పద్దతిలోనే ముందుకు వెళ్ళాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ముచ్చర్ల, కందుకూరు లాంటి మూడు, నాలుగు గ్రామాల్లో వేలాది ఎకరాలను సేకరించాలి. భూములు సేకరించాలంటే రైతులతో మాట్లాడి కన్వీన్స్ చేసి ఒప్పించి వాళ్ళను ఖాళీ చేయించాలి. ఇక్కడ కూడా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. ఆరులైన్ల రోడ్లు వేయటానికి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు, రోడ్లు వేయటానికి తమ భూములను ఇచ్చేదిలేదని అడ్డం తిరిగారు. ప్రజాప్రయోజనాల కోసమని ఎవరి భూములను అయినా తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.

అయితే బలవంతంగా భూములను సేకరించాలంటే రైతులు, స్ధానికులు, ప్రతిపక్షాలతో ప్రభుత్వానికి ఘర్షణలు తప్పవు. దాంతో పాటు కోర్టు కేసులు ఎదుర్కోకతప్పదు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి ప్రాజెక్టును మొదలుపెట్టి పూర్తిచేయటం అంటే ఎన్నిసంవత్సరాలు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటికి కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో ఉండదో పార్టీ అధికరంలోనే ఉన్నా రేవంతే ముఖ్యమంత్రిగా ఉంటారని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. రేవంత్ స్ధానంలో సీఎంగా వేరేవాళ్ళుంటే వాళ్ళ ప్రాధాన్యతలు మారిపోతాయి. అప్పుడు ప్రాజెక్టులు ముందుకుపోవచ్చు లేదా మూలనాపడచ్చు.

ఫైనల్ గా కొడంగల్ లో ఫార్మా సిటీని చూస్తే గడచిన వారంరోజులుగా రచ్చరచ్చ అవుతోంది. ఫార్మాకంపెనీల ఏర్పాటుకోసం 3500 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నది. ఈ నేపధ్యంలో లగచర్ల(Lagacharla)లో గ్రామసభ నిర్వహిస్తే ఏకంగా కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. భూసేకరణలో భూములు కోల్పోయేవారిలో ఎక్కువగా గిరిజన రైతులు ఉండటంతో వారు తమ సమస్యలను జాతీయస్ధాయికి తీసుకెళ్ళారు. లగచర్లలో కలెక్టర్ మీద జరిగిన దాడికి సంబంధించి పోలీసులు 40 మందిని బాధ్యులుగా గుర్తించారు. వీరిలో సుమారు 30 మందిని అరెస్టుచేశారు. దాడికి బాధ్యులను అరెస్టుచేయటంలో భాగంగా పోలీసులు అర్ధరాత్రి గ్రామాలపై దాడులుచేసి కొందరిని అరెస్టులు చేశారు. గుర్తించిన వారు ఇళ్ళల్లో లేకపోతే ఇంట్లోని ఆడవాళ్ళను ఎత్తుకెళ్ళి పోలీసుస్టేషన్లో బంధించారని కొందరు ఎస్టీ మహిళలు ఫిర్యాదుచేశారు. తమను ఎంతగా వేధించారో కమిషన్ ఛైర్మన్ కు ఆడవాళ్ళు వివరించారు. మగవాళ్ళ ఆచూకీ చెప్పమని తమను నిర్బంధించి పోలీసులు అమానవీయంగా వ్యవహరించినట్లు స్త్రీలు జాతీయ ఎస్టీ, ఎస్సీ కమీషన్ ఛైర్మన్(National Commission for SC and ST Atrocities) కిషోర్ మక్వానాకు ఫిర్యాదు చేశారు.

తమను చంపేసిన సరే ఫార్మా యూనిట్లకు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేదిలేదని గిరిజన రైతులు గట్టిగా ఎదురుతిరిగారు. గిరిజన మహిళల ఫిర్యాదు నేపధ్యంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ లగచర్ల, రోటిబండ తండాలో పర్యటించి రైతులు, రైతుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇపుడు లగచర్లలో మొదలైన భూసమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో ? రైతులు ఎప్పుడు ప్రభుత్వం చెప్పినట్లుగా వింటారో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పై మూడు ప్రాజెక్టులు కూడా ప్రజామోదంతో ముడిపడున్నవే. ప్రజలు లేదా రైతులు అంగీకరించి భూములు ఇవ్వటానికి సుముఖత వ్యక్తంచేస్తేనే ప్రభుత్వం ప్రాజెక్టులను టేకప్ చేయగలదు. కాదు కూడదు బలవంతంగా అయినా సరే భూములు సేకరించాలని రేవంత్ అనుకుంటే అంత వీజీకాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ నేపధ్యంలో మూడు కలల ప్రాజెక్టులు ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News