గబ్బర్‌సింగ్ లాంటి హిట్‌ను కోరుకుంటున్నా..!
తనకు నటన నేర్పించిన గురువు సత్యానంద్‌కు పవన్ కల్యాణ్ పాదాభివందనం చేశారు.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-07-23 15:25 GMT
హరిహరవీరమల్లు సినిమా గబ్బర్‌సింగ్ లాంటి మంచి హిట్‌ను అందించాలని భగవంతుడిని కోర్టుకుంటున్నట్టు ఆ సినిమా హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. చాన్నాళ్లుగా ఓ మంచి హిట్ ఇవ్వాలని తన అభిమానులంతా కోరుకుంటున్నారని, తాను నటనలో ఓనమాలు దిద్దిన విశాఖ నుంచి నేల నుంచి మీరంతా ఆనందించే విజయాన్నివ్వాలని ఆ సరస్వతీ దేవినీ కోరుకుంటున్నానని చెప్పారు. గురువారం ప్రపంచవ్యాప్తంగా హరిహరవీరమల్లు సినిమా విడుదలవుతున్న సందర్భంగా పవన్‌కల్యాణ్.. విశాఖ సాగరతీరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే?
ఈవెంట్‌కు హాజరైన అభిమానులు
విశాఖపట్నం ఎప్పడూ నా గుండెల్లోనే ఉంటుంది. నేను ఇంట్లో ఉన్న రోజుల్లో నేనేమవుతానో అనే భయంతో ఇంట్లోంచి బయటకు పంపితే తప్ప లాభం లేదని అన్నయ్య చిరంజీవి నన్ను నటనలో శిక్షణకు విశాఖలోని సత్యానంద్ మాస్టారి దగ్గరకు పంపించారు. ఆయన నటనతో పాటు ఉత్తరాంధ్ర ఆటపాట నా గుండెల్లో అణువణువునా నింపేశారు. విశాఖపట్నం సత్యానంద్ వద్దకు నన్ను తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ ఓనామాలు తెలీదు. సత్యానంద్‌తో పరిచయం నాటికి రూంలోకి బయటకు రావడానికి సంకోచించేవాడిని. బిగుసుకుపోయేవాడిని. ఆయన దగ్గర నేను నటనకంటే ధైర్యాన్నే ఎక్కువగా నేర్చుకున్నాను. నాకు జీవిత పాఠాలనూ నేర్పారు. దీంతో నేను యాక్టర్‌తో పాటు ఎలాగైనా బతికేస్తానన్న ధైర్యం వచ్చేసింది. నాకు చిన్నప్పట్నుంచి అన్యాయం జరిగితే ఎదురు తిరగాలనే ఓ లక్షణం నా మనసులో ఉండేది. ఎవరికైనా సాయం చేయాలని ఉండేది. మా అన్నయ్య చిరంజీవి, వదిన నన్ను నమ్మారు.. వచ్చే ఏడాదికి 30 ఏళ్ల ఇండస్ట్రీలోకి అడుగు పెడతాను. రియల్ లైఫ్‌లో ఏం చేయగలనో నటించడానికి అలాంటి సినిమాలనే వెతుక్కుంటాను. పబ్లిసిటీ లేకుండానే హీరోనయ్యాను. మీడియా ప్రచారం లేకుండా నా సినిమాలు విజయవంతమయ్యాయి.
నా పేరు పవన్.. తిరుగుతూనే ఉంటా..
పవన్ ఎక్కడికెళ్తే అక్కడి వాడినేనంటూ చెప్పుకుంటాడని కొంతమంది హేళన చేస్తారు. నా పేరులోనే పవన్ (గాలి) ఉంది. నేను అలా తిరుగుతూనే ఉంటాను. పవనం సర్వాంతర్యామి.. నాకు ఇవ్వడమే తెలుసు.. అడగడం తెలీదు.. సినిమా చూడాలని, ఓటేయండని అడగాడానికి సిగ్గనిపిస్తుంది. నేను అడక్కుండా మీరిస్తారని నాకు తెలుసు.
రెండేళ్ల క్రితం ఇక్కడే నలిపేశారు..
రెండేళ్ల క్రితం విశాఖలోని నోవాటెల్‌లో అప్పటి పాలకులు నన్ను ఇబ్బంది పెట్టారు. కారులోంచి బయటకు రాకూడదని నలిపేశారు. నోవాటెల్ రూములను పోలీసులు కాలి బూట్లతో తన్నారు. నన్ను అరెస్టు చేయాలని చూస్తే విశాఖపట్నం అంతా హోటల్ వద్దకు వచ్చి కూర్చుంది. అందుకే విశాఖలో హరిహరవీరమల్లు ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించాను. నియంత పోకడలున్న ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నామంటే మీరిచ్చిన బలమే.
రాజకీయ పరిస్థితులతో సినిమా ఆలస్యం..
మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా నేను తీసుకున్న శాఖలకు ఇబ్బంది లేకుండా హరిహరవీరమల్లు సినిమాను పూర్తి చేశాను. రాజకీయ కారణాలతోనే ఈ సినిమా ఆలస్యమైంది. ఇక కథ విషయానికొస్తే.. కృష్ణా నది తీరంలో మంగళగిరి సమీపంలో కొల్లూరులో దొరికిన వజ్రం కోహినూర్. అది గోల్కొండ నవాబు కులీ కుతూబ్‌షా చేతికెళ్లింది. అక్కడి నుంచి మొగలాయిల చేతుల్లోకెళ్లి, ఆపై లండన్ చేరి అక్కడుంది. నెమలి సింహాసనం మీద కంటకుడైన పాలకుడు ఔరంగజేబు కూర్చున్నాడు. అలాంటి ప్రజా కంటకుడు, దుర్మార్గుడు కూర్చున్న నెమలి సింహాననంపైన ఉన్న ఆ వజ్రాన్ని తిరిగి వెనక్కి తీసుకురావాలని కులీకుతుబ్ షా ఆదేశించినప్పుడు హరిహర వీరమల్లు కల్పిత పాత్ర మొదలవుతుంది. అలా ఢిల్లీ ఎర్రకోటకు వెళ్లే ముందు వరకు సినిమా తొలి పార్టు.. ఆ తర్వాత రెండో పార్టు ఉంటుంది.
సనాతన ధర్మం ఏ మతానికీ వ్యతిరేకం కాదు..
సనాతన ధర్మం ఏ మతానికి వ్యతిరేకం కాదు.. అందరినీ కలుపుకుని తీసుకెళ్లేది. అలాంటి సనాతన ధర్మాన్ని ఔరంగజేబులాంటి పాలకుడు పరిపాలించే సమయంలో హిందువుగా ఉండాలంటే జిజియా టాక్స్ చెల్లించాలనడం సమంజసమా? మన చరిత్ర పుస్తకాల్లో మొఘల్స్ గురించి ఎక్కవ, ఇతర రాజుల గురించి తక్కువ చూపించారు. కోహినూర్ వజ్రం క్రమంలో చోటు చేసుకునే ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి.
విశాఖలో తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్..
పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా హరిహరవీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం విశాఖలో ఇదే తొలిసారి. ఈవెంట్‌లో భాగంగా తొలుత ∙సినిమా ట్రైలర్‌ను చూపించారు. సనాతన ధర్మ పరిరక్షణపై సన్నీ మాస్టర్ డ్యాన్స్ టీమ్ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. హరిహరవీరమల్లు కథానాయకి నిధి అగర్వాల్ మాట్లాడుతూ తాను పవన్ కల్యాణ్ ఫాన్‌ను అని, ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఎమోషనల్‌గా ఉన్నానని చెప్పారు.
పవన్ నా ప్రథమ శిష్యుడు..
పగన్ కల్యాణ్ గురువు సత్యానంద్ మాట్లాడుతూ.. చిరంజీవి నుంచి చెన్నై రమ్మని 1992లో నాకు కాల్ వచ్చింది. పవన్ కల్యాణ్‌ను పవన్ కల్యాణ్‌ని పట్టుకుని ఇతను నా తమ్ముడు.. నీ చేతుల్లో పెడ్తున్నాను, మంచి ఆర్టిస్టుగా తీర్చిదిద్దాలని అప్పగించారు. అదే నాకు జీవితంలో టర్నింగ్ పాయింట్. నాకు పవర్ స్టార్‌ని వజ్రంలా తయారు చేసే అవకాశం దక్కింది. నా ప్రథమ శిష్యుడు పవర్ స్టార్. హరిహర వీరమల్లు చిత్రం అఖండ విజయం సాధిస్తుందని ట్రైలర్ చూసిన తర్వాత స్పష్టమైంది’ అని నటన శిక్షకుడు సత్యానంద్ పేర్కొన్నారు. అనంతరం సత్యానంద్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను పవన్ కల్యాణ్ సత్కరించారు. నటనలో తన గురువు సత్యానంద్‌కు పవన్ పదాభివందనం చేశారు.