డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యాన జరిగిన ‘ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్’సదస్సులో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఐ – డాటా సెంటర్లపై జరిగిన చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... సౌత్ ఏషియాలోనే తొలి 152 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఎపి రాజధాని అమరావతిలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోంది. ఇది యావత్ ఎకో సిస్టమ్ ను మార్చబోతుంది. విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయంగా పలు ప్రఖ్యాత సంస్థలో విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.
ఇప్పటివరకు సాంప్రదాయ విద్యావిధానం కొనసాగుతున్న నేపథ్యంలో ఎఐ వంటి అధునాతన సాంకేతికతకు ట్రాన్సఫార్మేషన్ కష్టతరమైన పనే. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యలో ఎఐ స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్ లను ప్రవేశపెడుతున్నాం. ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పాఠ్యాంశాలతో కరిక్యులమ్ లో సమూల మార్పులు తెస్తున్నాం.
రోజువారీ పరిపాలనలో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. పాదయాత్ర సమయంలో ప్రజలు సాధారణ ల్యాండ్ రికార్డుల కోస ఇబ్బందులు పడటం నేరుగా గమనించాను. అందుకోసం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు సులభతరమైన పౌరసేవలు అందించడంపై దృష్టి సారించాం. మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టి 600 రకాల పౌరసేవలను ప్రజలకు వేగవంతంగా అందిస్తున్నాం. ఇందుకోసం వివిధ ప్రభుత్వశాఖలను అనుసంధానిస్తూ అతి పెద్ద బ్యాక్ ఎండ్ డేటా లేక్ ను తయారుచేశాం.
ఎఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మేం యుఎఈని ఆదర్శంగా తీసుకుంటున్నాం. ప్రపంచంలో తొలిసారిగా ఎఐ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసిన దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఎఈ ట్రాఫిక్ క్రమబద్దీకరణలో ఎఐ సాంకేతికతను వినియోగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా ఉద్యోగావకాశాలు కోల్పోతామన్న కొందరి వాదనతో నేను ఏకీభవించను. ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని నేను నమ్ముతాను. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించబోతోంది.
జి టు జి కొలాబరేషన్ లో భాగంగా యుఎఈ – ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకారం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని మేం భావిస్తున్నాం. ఎఐ, డేటా సెంటర్లు, డిజిటల్ ఆవిష్కరణలు, స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా ఆర్థిక వద్ధిని ముందుకు నడిపించే మార్గాలను అన్వేషిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఫైర్ సైడ్ చాట్ లో తనకు ఇష్టమైన ఎఐ అప్లికేషన్ చాట్ జిపిటి లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి జి42 ఇండియా సిఇఓ మనుజైన్ హాజరుకాగా, ప్రైమస్ పార్టనర్స్ వైస్ ప్రెసిడెంట్ రక్ష శ్రద్ధ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రెన్యువబుల్ ఎనర్జీ, ఇన్ ఫ్రా, డిజిటల్ గవర్నెన్స్, ఎఐ ఫస్ట్ యూనివర్సిటీ, జీనోమ్ సీక్వెన్సింగ్, క్వాంటమ్ వ్యాలీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి యుఎఇ ఆర్థిక మంత్రి అబ్దుల్ బిన్ తక్ ఆల్ మరితో మంత్రి లోకేష్ చర్చించారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు యుఎఇ తరపున సహకారం అందించాల్సిందిగా కోరారు. దీనికి అబ్దుల్ బిన్ స్పందిస్తూ యుఎఈ పర్యటనకు రావాల్సిందిగా మంత్రి లోకేష్ ను ఆహ్వానించారు.