మద్యం విధానంపై చర్చకు సిద్ధం

వైసీపీ దెబ్బ తీసేందుకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.;

Update: 2025-07-21 06:12 GMT

పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అక్రమ కేసులు బనాయించి ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడం దారుణమని, వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మద్యం విధానంపై తాము చర్చకు సిద్ధమని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాతూ.. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మద్యం విధానంపైన చర్చించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. అంటే తొలుత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ హయాంలో 2014–2024 వరకు మద్యం విధానంపై చర్చించాలని, దీనికి తాము సిద్ధమని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రైవేటు వ్యాపారులు మద్యం లైన్సులు ఇచ్చి ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా బెల్టు షాపులు పెట్టించారని, ఇప్పుడు కూడా అలానే మద్యం ఏరులై పారుతోందని, తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించి అమ్మకాలను తగ్గించిందని, మరి మద్యం విషయంలో ఎవరు ప్రజలకు మేలు చేసినట్టు అని ప్రశ్నించారు. కేవలం వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీని, ప్రజల్లో మరింత ఆదరణ కలిగిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీసేందుకే లిక్కర్‌ స్కామ్‌ను తెరపైకి తీసుకొచ్చి, కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు వైఫల్యం చెందాయని మండిపడ్డారు. సంపద సృష్టిస్తాను అని చెబుతున్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ఖనిజ సంపదను అప్పుల కోసం తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాలన్నింటినీ లేవనెత్తి, దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తానని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Tags:    

Similar News