మా కుటుంబానికి పవన్ కల్యాణే దిక్కంటున్న రాయుడు చెల్లెలు కీర్తి..
జనసేన నేతలు ఎందుకు స్పందించడం లేదు?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-15 10:31 GMT
జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ బహిష్కృత నేత వినూత కోట మాజీ కారు డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య ఆ పార్టీ నాయకత్వంలో మంటలు రేపుతోంది. పార్టీలో క్రియాశీలక కార్యకర్త శ్రీనివాసులు హత్యకు గురయితే ఏ ఒక్కరూ వచ్చి పరామర్శించలేదు. శ్రీనివాసులు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించేందుకు కూడా జనసేన పార్టీ నాయకుల్లో ఏఒక్కరూ హాజరు కాలేదు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"అమ్మనాన్న లేని నాకు ఉన్న బంధం మా అన్న, అమ్మమ్మ మాత్రమే" అని శ్రీనివాసులు చెల్లెలు కీర్తి శోకిస్తూనే ఉంది. చెన్నైలో శవమై తేలిన రాయుడు భౌతికకాయం శ్రీకాళహస్తిలోని బొక్కసపాలెంకు తీసుకుని రాగానే కీర్తి ఆక్రందనలు మిన్నంటాయి.
"మా అన్నను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించాలి. లేదంటే ఇంకో పార్టీ ద్వారా అయినా పోరాటం సాగిస్తాం" అని కీర్తి శోకాలు పెడుతూనే హెచ్చరించింది. 14 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తన అన్న శ్రీనివాసులు (రాయుడు)కు నివాళులర్పించడానికి జనసేన నుంచి ఒక్కరూ రాకపోవడం ఆమెను తీవ్రంగా బాధించినట్టు అర్థమవుతోంది.
శ్రీనివాసులు (రాయుడు) చెల్లు కీర్తి
అభిమానానికి ఇదా గుర్తింపు?
తాను అభిమానించే నటుడు, జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ పై రాయుడుకు గుండెల నిండా అభిమానం ఉంది. తనను చేరదీసిన నియోజకవర్గ మాజీ ఇన్ చార్జి వినూత కోట అంటే కూడా రాయుడుకు గౌరవం ఉంది. అందుకు నిదర్శనమే రాయుడు ఛాతీపై జనసేన పార్టీ గుర్తు, వినూత పేరు పచ్చబొట్టు వేయించుకోవడమే.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రూ. 500 చెల్లించి జనసేన క్రీయాశీలక సభ్యత్వం తీసుకున్న వారు 5000 మంది ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వారికి అపద కలిగితే ఆర్థికంగా అండగా నిలవడానికి ఓ కంపెనీతో బీమా సదుపాయం కల్పించారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల సాయం అందేలా బీమా చేయించారు. ఈ విషయంలో కూడా జనసేన కేంద్ర, జిల్లా నాయకత్వం నుంచి స్పందన లేదు.
"రాయుడుకు జనసేనలో పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉందా?" ఉంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పుడు ఈ బీమా వస్తుందా లేదో అర్థం కాకుండా ఉంది.
ఈ విషయమై జనసేన పార్టీకి బీమా కన్సల్టెంటుగా పనిచేసే యడ్ల నరసింహారావు ఏమంటున్నారంటే.. "ప్రమాదవశాత్తు జరిగే సంఘటనలకు మాత్రమే సాయం మంజూరవుతుంది. హత్య లేదా ఇతర ఘర్షణల్లో మరణించిన వారికి అందకపోవచ్చు". దీన్ని బట్టి ఈ సంఘటనలో రాయుడు కుటుంబానికి పార్టీ నేతలు మాత్రమే సాయం చేయగలరనే విషయం తేలిపోయింది. దీనిపై డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల బాధిత రాయుడు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది.
రాయుడు సోదరి ఏమన్నారంటే..
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ కు వీరాభిమానుల్లో శ్రీనివాసులు (రాయుడు) కూడా ఒకరు. ఇంటర్ తరువాత ఐటీఐ పూర్తి చేసిన రాయుడు 14 ఏళ్లుగా శ్రీకాళహస్తిలో జనసేన క్రియాశీలక కార్యకర్తగా పనిచేశాడు.
అన్న శ్రీనివాసులు భౌతికకాయం బొక్కసపాలెంకు తీసుకుని రాగానే, కీర్తి కన్నీరుమున్నీరవుతూ, ఘాటు హెచ్చరికలు చేశారు.
"నాకు ఉన్న బంధం నా అన్న మాత్రమే. మా అన్నను పంచిన నిందితులను కఠినంగా శిక్షించకుంటే, మరో పార్టీ ద్వారా పోరాటం సాగిస్తాం" అని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించే వ్యాఖ్యానించిన తరువాత కూడా జనసేన పార్టీ నేతల నుంచి స్పందన లేదు.
టీడీపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీల్లో శ్రీకాళహస్తిలో రగులుతూ ఉన్న చిచ్చు రాయుడు హత్యకు దారితీసింది. దీనిపై ఆ రెండు పార్టీల నుంచి స్పందన లేకపోవడం కూడా రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది.
ఎమ్మెల్యే సెల్ఫ్ గోల్
టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన నేతలుగా పనిచేసిన వినూత, చంద్రబాబు దంపతులకు కోల్ట్ వార్ నడిచింది. ఈ ఎపిసోడ్ లో కారు మాజీ డ్రైవర్ రాయుడు హత్యకు గురికావడం, వినూత, చంద్రబాబు దంపతులను చెన్నై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసింది.
ఈ హత్యలో కోవర్ట్ అపరేషన్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సుధీర్ తనకు తాను ఇరుక్కున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి
"శ్రీనివాసులు (రాయుడు) భౌతికకాయం పాడె మోస్తా" అని ప్రకటించారు. రాయుడు భౌతికకాయం స్వగ్రామానికి వచ్చే సరికి ఆయన అటు వైపు వెళ్లలేదు. అయితే,
కాపు సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేత, శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి మాజీ అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు కొంతమంది మద్దతుదారులతో బొక్కసపాలెం వెళ్లి, రాయుడు భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన మినహా రాజకీయంగా స్పందించిన వారే కనిపించకపోవడం ఇక్కడ గమనార్హం.
హత్యకు గురైన రాయుడు చెల్లి కీర్తి, అమ్మమ్మ కంటనీరు ఆగని స్థితిలో ఇంకా తేరుకోలేకపోతున్నారు. కీర్తి హెచ్చరికలు ఏమాత్రం, ఏ స్థాయిలో పనిచేస్తాయనేది వేచిచూడాలి.