పులివెందుల:వైసిపి జెడ్పీటీసీ అభ్యర్థి ఎందుకు ఓటు వేయలేకపోయారు!
ఆర్ తుమ్మలపల్లె పంచాయతీలు రీపోలింగ్కు డిమాండ్.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-12 11:25 GMT
మా వేలికి బులుగు చుక్క లేదు. మేము ఓటు వేయలేదని మహిళలు అంటున్నారు. పోలింగ్ కేంద్రం రద్దీగా ఉంది. బాక్సులో బ్యాలెట్ పేపర్లు పడిపోయాయి. వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు తుమ్మల హేమంత్ రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించునే పరిస్థితి లేదని చెప్పారు. ఆ గ్రామంలోని వందలాది మంది మహిళలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ఆ గ్రామంలోని ఓటర్లు ఉన్న యువతులు పోలీసులపైకి శివంగుల్లా తిరగబడి నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేని స్థితిలో సీఐ, కానిస్టేబుళ్లు వెనుదిరిగారు.
పులివెందుల జెడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన మహేష్ రెడ్డి స్వగ్రామం తుమ్మలపల్లిలో ఏం జరిగింది?
జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డి అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన కొడుకు హేమంత్ రెడ్డికి వైసీపీ అవకాశం కల్పించింది. ఇదిలావుంటే,
"పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లి పంచాయతీలో జరిగిన వ్యవహారంపై ఎలక్షన్ కమిషన్ విచారణ జరిపించాలి. ఓటర్లు వారి హక్కు వినియోగించుకునేందుకు రీపోలింగ్ జరపాలి" అని వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
పులివెందుల జెడ్పిటిసి వైసిపి అభ్యర్థిగా ఆర్. తుమ్మలపల్లి కు చెందిన మహేష్ రెడ్డి పోటీ చేశారు. ఈ గ్రామంలో 1200 మంది ఓటర్లు ఉన్నారు. బిఎల్వో లు వారందరికీ ఓటర్ స్లిప్పులు అందించారు. హేమంత్ రెడ్డి తన చెల్లి తో పాటు మరొకరిని ఏజెంట్గా నియమించారు. పోలింగ్కు ముందే ఏజెంట్గా కూర్చోవడానికి బయలుదేరిన యువతులను టిడిపి మద్దతుదారులు అడ్డగించారు అనేది ఆరోపణ.
మంగళవారం ఉదయమే ఇళ్ల వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఓటర్ స్లిప్పులను బలవంతంగా లాక్కుని వెళ్లారని అనేకమంది మహిళలు ఆరోపించారు. "పోలింగ్ బూత్ వద్దకు కాదు. బయటికి వచ్చిన కొడతాం" అని కర్రలు చేత పట్టుకున్న కొందరు బెదిరింపులకు దిగారు అని మహిళలు ఆరోపించారు.
ఉదయం 11 గంటల వరకు కూడా వైసిపి అభ్యర్థి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లలేని స్థితిలో ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు. ఇప్పటికి కూడా ఆయన పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లడానికి సాహసించలేకపోయారని పులివెందుల నుంచి తెలిసిన సమాచారం.
ఈ పరిస్థితిపై వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఏమంటున్నారంటే..
"ఉదయం నుంచే మా ఇంటి చుట్టూ టిడిపి మద్దతుదారులు మోహరించారు. కర్రలు దాడులతో ఓటర్లను భయపెట్టారు. పోలింగ్ ఏజెంట్లు కూడా కేంద్రం వద్దకు రానివ్వలేదు" అని హేమంత్ రెడ్డి ఆరోపించారు .
"మా గ్రామంలోని ఆర్ తుమ్మలపల్లె పోలింగ్ కేంద్రం వద్ద 50 మీటర్ల దూరంలోని ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్లలేదా? పోలీసులకు కనిపించడం లేదా" అని హేమంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
"నా ఏజెంట్గా మాజీ ఎంపీపీ బలరాంరెడ్డిని పోలింగ్ కేంద్రంలో కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. 24 గంటలకు ముందు వరకు తనకు ఉన్న గన్మెన్ ను తొలగించి మరొకరిని పంపించారు. ఇవన్నీ కుట్రపూరితంగా జరుగుతున్న పోలీసులు తమాషా చూస్తున్నారు" అని హేమంత్ రెడ్డి ఆరోపించారు.
శివంగులైన యువతులు
పులివెందుల మండలం ఆర్ తుమ్మలపల్లి లో వైసీపీ మద్దతు దారులుగా ఉన్న ఓటర్లు తమ హక్కు వినియోగించుకోలేకపోయారు. తమ ఓట్లు మరొకరు వేశారు అనేది అక్కడ మహిళల ఆరోపణ. చివరికి ఏ జంటను కూడా పోలింగ్ కేంద్రంలోకి అనుమతించని పరిస్థితి ఏర్పడింది.
"ఈ సమస్యపై కడప జిల్లా ఎస్పీ ఈజీ. అశోక్ కుమార్కు ఉదయం నుంచి మూడుసార్లు ఫోన్ చేశాను" అని వైసిపి అభ్యర్థి మహేష్ రెడ్డి మీడియాకు చెప్పారు.
మధ్యాహ్నం తర్వాత ఆ గ్రామంలోకి ఓ సీఐ తోపాటు ఇద్దరు కానిస్టేబుల్ రావడంతో మహిళలు మూకుమ్మడిగా తిరగబడి, ప్రశ్నలతో నిలదీశారు.
"మా ఓటు హక్కు మేము వినియోగించుకునే విధంగా భద్రత కల్పించ లేనప్పుడు మా ఊరికి ఎందుకు వచ్చారు?" అని గట్టిగా నిలదీశారు. పోలీసులపై తీవ్రస్థాయిలో ఇద్దరు యువతలు విరుచుకుపడ్డారు. వారికి సమాధానం చెప్పలేక ఆ పోలీసులు సతమతమయ్యారు.
"ఇప్పుడు రండి. మేము మీ వెంట ఉంటాం. ఓటు వేయిస్తాం" అని ఆ సీఐ చెప్పిన మాటలతో యువతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
"మా చేతిలో ఓటరు స్లిప్పులు లేవు. మా వేలుపై ఓటు వేసినట్లు గుర్తు కూడా లేదు. బ్యాలెట్ లో ఓట్లు ఎవరు వేశారు?" అక్కడికి వస్తే రక్షణ కల్పిస్తారా అని మూకుమ్మడిగా నిలదీయడంతో వారికి సమాధానం చెప్పలేని స్థితిలో పోలీసులు చల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.
ఈ వ్యవహారంపై వైసీపీ రాష్ట్ర నాయకులు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారని జెడ్పిటిసి అభ్యర్థి మహేష్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఎలక్షన్ కమిషన్ స్పందించి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.