అడ్రస్ మార్చేసిన పులస..గోదావరి జనాలకు జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిందేనా ?
ఎంతో ఆతృతగా ఎదురుచూసే మాంసప్రియులకు పులస పెద్ద షాకిచ్చింది. బహుశా గోదవరి నదిలో ఇకనుండి పులసలు దొరక్కపోవచ్చు.
పుస్తలమ్మయినా సరే పులస తినాలనే నానుడి అందరికీ తెలిసిందే. అయితే ఇకనుండి పులసల కోసం పుస్తెలు అమ్ముకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంతో ఆతృతగా ఎదురుచూసే మాంసప్రియులకు పులస పెద్ద షాకిచ్చింది. బహుశా గోదవరి నదిలో ఇకనుండి పులసలు దొరక్కపోవచ్చు. పులస చేపలను తినటాన్ని మాంసప్రియులు ఎంతో అదృష్టంగానే కాకుండా ప్రిస్టేజిగా కూడా భావిస్తారు. అందుకనే పులసల కోసం పుస్తెలమ్మాలన్న నానుడి మొదలైంది. ఈ నానుడితోనే పులసకున్న డిమాండ్ తెలిసిపోతోంది. పులసచేప వలలో పడిందంటే మత్య్సకారుల పంట పండినట్లుగానే భావిస్తుంటారు. ఎలాగంటే పులస వలలో పడితే వెంటనే వేలంపాటను నిర్వహిస్తారు. ఆ వేలంలో పులస సైజును బట్టి తక్కువలో తక్కువ రు. 3, 4 లక్షల ధర పలికిన రోజులున్నాయి. పులస వేలంపాట జరుగుతోందంటే చాలు కొనేంత శక్తిలేకపోయినా కనీసం పులస చేపను చూడ్డానికే జనాలు పెద్దఎత్తున ఎగబడతారు.
ఇంతటి డిమాండున్న పులస చేపలు మాంస ప్రియులకు పెద్ద షాకే ఇచ్చాయి. ఎలాగంటే ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం ఒక్కటంటే ఒక్క పులస మాత్రమే మత్స్యకారులకు దొరికింది. సీజన్లో ఇప్పటివరకు ఒకే చేప దొరకిందంటేనే మత్స్యాకారులతో పాటు ప్రియులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పులసల సీజన్ అంటే జూలై-ఆగష్టు నెలలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మత్స్యకారులకు మిగిలిన చేపల్లాగ పెద్దసంఖ్యలో దొరకకపోయినా రెగ్యులర్ గా దొరుకుతునే ఉంటాయి. అయితే ఈ సీజన్లో మాత్రం ఇప్పటికి ఒకే ఒక్క పులస దొరికింది. మరో 15 రోజుల్లో ముగియబోయే సీజన్లో మరిక దొరుకుతాయన్న ఆశను మత్స్యకారులు వదిలేసుకున్నారు.
ప్రతిఏడాది జూలై-ఆగష్టు నెలల్లో గోదావరి ప్రాంతంలో దొరికే పులసకు ఇపుడు ఏమైంది ? ఏమైందంటే కాలుష్యం కారణంగా పులసలు ఇటు రావటం మానేశాయట. పులసలు రూటు మార్చి గోదావరి తీరం కాకుండా ఒడిస్సా, పశ్చిమబెంగాల్ వైపు వెళుతున్నట్లు సెంట్రల్ ఇన్ ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్ స్ట్యిట్యూట్ (సిఫ్రీ) గమనించింది. గోదావరి నదిలో దొరికే పులసలను సముద్రజలాల్లో ఉన్నపుడు ‘ఇలస’ అనంటారు. ఇలసల్లో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా కొవ్వుపట్టిన ఇలసలు చాలా లావుగా ఉంటాయి. సంతానోత్పత్తి కోసం హిందు మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, టాంజానియా దేశాల నుండి సుమారు 11 వేల నాటికల్ మైళ్ళు ఈదుకుంటు పునరుత్పత్తి కోసం గోదావరి నదిలోకి చేరుకుంటాయి. అన్ని వేల నాటికల్ మైళ్ళు ఈదుకుని గోదావరిలోకి ప్రవేశించే ఇలసలు కొవ్వును కరిగించుకుని బాగా స్మార్ట్ గా తయారై పులసలుగా రూపాంతరం చెందుతాయి.
ఎప్పుడైతే ఇలస పులసగా మారుతుందో అప్పుడే ఎరుపు, గోధుమరంగుతో మెరిసిపోతు మాంసప్రియులను బాగా ఆకర్షిస్తుంటాయి. పైగా కొవ్వు కరిగిపోవటంతో పులసలో మంచి పోషక విలువలు పెరిగిపోతాయి. అందుకనే పులస వంటకం అంత రుచికరంగా తయారవుతుంది. బాగా చేయితిరిగిన వంటవాళ్ళు వండితే పులస రుచే వేరని లొట్టలేసుకుంటు వాయిలకు వాయిలు మింగేస్తారనటంలో సందేహంలేదు. ఇలాంటి పులస సడెన్ గా గోదావరి తీరాన్ని కాకుండా తన అడ్రస్ ఎందుకు మార్చుకున్నట్లు ?
ఎందుకంటే గోదావరి తీరంలోని చాలా ప్రాంతాల్లో శబ్ద, వాయుకాలుష్యం పెరిగిపోతుండటమే ప్రధాన కారణం. గోదావరి తీరంలో చాలా ప్రాంతాల్లో ప్రధానంగా రాజమండ్రి, కాకినాడ, అంతర్వేది, కరవాక, యానాం, గాడిమొగ, ఎదుర్లంక ప్రాంతాల్లో ఆయిల్ కోసం సముద్రంలో డ్రెడ్జింజ్ జరుగుతోంది. దాంతో విపరీతమైన శబ్దాలతో పాటు బయటకు వచ్చే ఆయిల్ గోదావరి నదిలో కలిసిపోతోంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లోని అనేక వ్యర్ధాలు కూడా నదిలో కలుస్తున్నాయి. దాంతో అమోనియా, సల్ఫర్, లెడ్ లాంటి రసాయనాలు కూడా నదిలో కలిసిపోతున్నాయి. దాంతో రకరకాల కాలుష్యాలు పెరిగిపోతున్నాయి. చివరగా రొయ్యల సాగు వ్యర్ధాలను రైతులు, కంపెనీలు సముద్రం, గోదావరి నదిలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి అనేక కాలుష్యాల వల్ల పులసలకు చాలా ఇబ్బంది పడుతున్నాయని సిఫ్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు.
గోదావరి తీరం కాలుష్యంతో నిండిపోతు సంతానోత్పత్తికి అడ్డంకిగా తయారైంది. అందుకనే పులసలు గోదావరి తీరాన్ని కాకుండా కొత్తగా ఒడిస్సా, పశ్చిమబెంగాల్ వైపుకు వెళిపోతున్నాయట. సంతానోత్పత్తికి గోదావరి సముద్ర, నదుల కన్నా ఒడిస్సా, బెంగాల్ జలాలు అనుకూలంగా ఉన్నట్లు సిఫ్రీ నిపుణుల అధ్యయనంలో తేలింది. బెంగాల్లోని హుగ్లీ నది ప్రాంతం పులసలు ఎక్కువగా ఉన్నట్లు సిఫ్రీ నిపుణల అధ్యయనంలో బయటపడింది. ఈ కారణాలతోనే పులసలు గోదావరిలో కనబడలేదు. ఈ సీజన్లో రాజోలు దీవిలోని మత్స్యాకారులకు ఒక్కసారి మాత్రమే పులస చేప దొరికింది. దాన్ని వేలంవేస్తే రు. 24 వేలకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క పులసను కూడా మత్స్యకారులు చూడలేదు. దాంతోనే అర్ధమైపోతోంది పులసలు తమ అడ్రస్ మార్చుకున్నాయని.