ఇలాంటి అతిథులను కాపాడేదెలా...?
రైతు సంరక్షణలోకి తంబళ్లపల్లె వద్ద జింక ఎలా చేరింది?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-04 15:51 GMT
అటవీసమీప గ్రామాల్లో ఇళ్లలోకి వన్యప్రాణాలు అనుకొని అతిథులుగా వస్తున్నాయి. కుక్కల బారి నుంచి వాటిని రక్షించడానికి గ్రామస్తులు పాట్లు పడుతుంటారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె వద్ద ఓ పెద్ద సైజు జింకను కుక్కలు గాయపరిచాయి. దానిని కాపాడిన వ్యక్తి ఇంటికి తీసుకుని వెళ్లి గ్రాసం అందించాడు.
ఈ సమాచారం అటవీ శాఖాధికారులకు చెప్పడానికి పాట్లు తప్పలేదు. 100 నంబర్ కు డయల్ చేస్తే, 1962కు చేయమన్నారు. వారికి సమాచారం ఇద్దామనుకుంటే కుదరలేదు అని తంబళ్లపల్లెకు సమీపంలోని బండ్రేవు గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నంబర్ పగలు మాత్రమే పనిచేస్తుందని చెబుతున్నారనే ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
మదనపల్లి డివిజన్లోని గ్రామాలు అడవుల మధ్య ఉంటాయి. మదనపల్లి నుంచి కర్ణాటక వెళ్లే మార్గం. పలమనేరు అటు నుంచి కుప్పం జాతీయ రహదారి కూడా అడవుల మధ్య సాగుతుంది.
ఈ రెండు మార్గాల్లో కృష్ణ జింకలు, దుప్పి వన్యప్రాణులు పొలాల్లో సంచరిస్తూ కనువిందు చేస్తాయి. గ్రామాలకు సమీపంలో ఉన్న పంట పొలాల నుంచి కూడా జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈ ప్రాంతంలో ఇది సర్వసాధారణం. ఉద్దేశపూర్వకంగా వన్యప్రాణులకు హాని కలిగించడానికి మాత్రం సాహసించరు.
తంబళ్లపల్లె వద్ద ఏం జరిగింది?
తంబళ్లపల్లె మండలం బండ్రేవుకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన ఎన్. మల్లికార్జునరెడ్డి శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పొలం నుంచి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతున్నాడు. రోడ్డు పక్కన పెద్ద జింకను రెండు కుక్కలు వేటాడుతున్న దృశ్యం కనపడింది. వెంటనే కుక్కలను తరిమివేసి, ఆ జింకను రక్షించాడు. అప్పటికే గాయాలతో ఉన్న జింకను చూసిన మల్లికార్జునరెడ్డి చలించారు.
"కుక్కల దాడిలో జింక గాయపడింది. కదలలేని స్థితిలో ఉంది" అని మల్లికార్జున రెడ్డి చెప్పారు.
అత్యవసర నెంబర్ పనిచేయదా?
వన్యప్రాణులను వేటగాళ్ల నుంచి కాపాడడానికి అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అక్రమ రవాణా, అడవుల్లోకి చొరబాటు దారుల సమాచారం తెలియజేయమని పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా అటవీ శాఖ అధికారుల సెల్ ఫోన్ నెంబర్లు గోడలపై రాశారు. అవి గ్రామస్తులకు పూర్తిగా తెలియడం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది.
"పెద్ద జింక కుక్కల దాడిలో గాయపడిన విషయాన్ని 100 కు కాల్ చేశాను. వారి సూచనతో 1962 నెంబర్ కు కూడా కాల్ చేసిన ప్రయోజనం లేదు" అని మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఆ నెంబర్ పగలు మాత్రమే పని చేస్తుందని కొందరు చెప్పారని ఆయన తెలిపారు. ఈ నంబర్ రాత్రులు కలవడం లేదు. తంబళ్లపల్లి ఘటన నేపథ్యంలో ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధి శుక్రవారం రాత్రి 8:30 నుంచి అనేకసార్లు ఆ నెంబర్ కు డయల్ చేస్తే..
"ఈ లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. మళ్లీ ప్రయత్నించండి" అనే సమాధానమే వినిపించింది. తరువాత కొన్ని నిమిషాలకు అక్కడి నుంచి సమాధానం వచ్చింది. 1962 పశుసంవర్ధక శాఖకు సంబంధించిందనే విషయం ఆపరేటర్ స్పష్టం చేశారు. ఇదిలాఉండగా,
స్పందించిన ఎఫ్ఆర్ఓ
వాట్సప్ గ్రూప్ సమాచారం మదనపల్లె అటవీశాఖాధికారులకు అందింది. దీంతో వారు స్పందించారు.
"కుక్కల దాడిలో గాయపడిన జింక సమాచారం అందింది" అని మదనపల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
గుండ్రాతి జయప్రసాదరావు స్పష్టం చేశారు.
"బండ్రేవు గ్రామంలో రైతు వద్ద ఉన్న జింకను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆ వన్యప్రాణిని తీసుకురావడానికి సిబ్బందిని పంపించాం" ఆయన తెలిపారు. ఈ సంఘటన ద్వారా అయినా, అటవీశాఖ అధికారులు అత్యవసర సేవల నంబర్లు, అధికారుల సెల్ నంబర్లు గ్రామాల్లో మరింతగా ప్రచారం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అందుకు ప్రధాన కారణం మదనపల్లె డివిజన్ లోని తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, పీలేరు, కుప్పం ప్రాంతాలు వన్యప్రాణులకు నిలయం. నిత్యం పొలాల్లోనే కాదు. రోడ్లపై కూడా యథేచ్ఛగా సంచరిస్తుంటాయి. వాటి సంరక్షణకు ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.