వైసీపీకి పవన్ మాస్ వార్నింగ్
రౌడీయిజం చేస్తే బెదిరేవారెవరూ లేరు.అధికారం లోకి ఎలా వస్తారో చూస్తాం;
By : V V S Krishna Kumar
Update: 2025-07-04 13:42 GMT
వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు."2029లో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైకాపా నేతలు అంటున్నారు. మీరు అధికారంలోకి రావాలి కదా? ఎలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం" అంటూ పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.సామాన్యులను బెదిరించడం వల్లే వైసీపీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని , అయినా వారు మారడం లేదని అన్నారు.
ప్రకాశం జిల్లా నరసింహపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు.ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యమన్నారు.వెలిగొండ ప్రాజెక్టుకు 4 వేల కోట్ల రూపాయలు కావాలని,ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ మొదటి విడత రూ.1,290 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నామన్నారు.ప్రకాశం జిల్లాలో వస్తున్న అతిపెద్ద తాగునీటి పథకమిదేనన్నారు.దాదాపు 10 లక్షలకు పైగా జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని పవన్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఆపేస్తున్నామని కేంద్రం చెప్పిందని , అయినా కేంద్ర మంత్రి పాటిల్‌ను కలిసి అన్ని విషయాలు వివరించామన్నారు. నీటి ఎద్దడి ప్రాంతాలకు రూ.84 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పామని వెల్లడించారు.సకాలంలో నిధులు వస్తే 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేస్తామని, తాను ప్రత్యేకించి ఈ పథకాన్ని పర్యవేక్షిస్తానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
కేంద్ర సహకారం..చంద్రబాబు సమర్థత
కేంద్రంలో అధికారంలో వున్న బిజేపీ పూర్తి సహకారం , అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని పవన్ అన్నారు.తనకు పనిచేయాలన్న తపన ,పోరాట స్పూర్తి వున్నాయని ,చంద్రబాబు సారధ్యంలో ముందుకు వెళుతున్నామన్నారు.గత పాలకులు రూ.లక్షల కోట్లు అప్పులు పెడితే వాటన్నింటిని తట్టుకుని ఇవాళ ముందుకు సాగుతున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా వాటిని దోచేశారని ఆరోపించిన పవన్ ,ఆక్రమణకు గురైన ఆలయాల భూములను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించామన్నారు.లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం భూములు దోచుకోవాలనుకుంటే అంతే సంగతులంటూ హెచ్చరించారు.