ఏపీలో నేడు ప్రధాన మంత్రి మోదీ

సూపర్ జీఎస్టీ వేడుకలు, రూ.13,430 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు.

Update: 2025-10-16 03:02 GMT

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రఖ్యాత శివక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, రాయలసీమ ప్రాంతంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో జరుగుతున్న పొదుపు పండుగ వేడుకల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనదిగా భావిస్తున్నారు.

ఆధ్యాత్మికతకు గుర్తు... శ్రీశైలం దర్శనం

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9:50కి కర్నూలు ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సుండిపెంటకు వెళ్లి, రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకుని 11:15 నుంచి 12:05 వరకు జ్యోతిర్లింగ మూర్తి మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 12:10కి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజు వారసత్వాన్ని స్మరించుకుంటారు. మధ్యాహ్నం 1:15 వరకు బ్రహ్మపుత్ర గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని, 2:20కి కర్నూలు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో పాల్గొంటారు.


సూపర్ జీఎస్టీ వేడుకలు

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. దసరా నుంచి దీపావళి వరకు 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలపై సుమారు రూ.8 వేల కోట్ల మేర భారం తగ్గుతుందని అంచనా. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 90 వేలకు పైగా ఈవెంట్లు నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు వద్ద భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.


రూ.13,430 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం

పర్యటన సందర్భంగా ప్రధాని రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో రూ.9,449 కోట్ల శంకుస్థాపనలు, రూ.1,704 కోట్ల ప్రారంభోత్సవాలు, రూ.2,276 కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.

ప్రాజెక్ట్ వివరాలురకంబడ్జెట్ (రూ. కోట్లు)
విద్యుత్ ట్రాన్సమిషన్ వ్యవస్థశంకుస్థాపన2886
ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్శంకుస్థాపన4922
కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్శంకుస్థాపన493
పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్శంకుస్థాపన184
సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారిశంకుస్థాపన964
రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డుప్రారంభం82
కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లుప్రారంభం286
కనిగిరి బైపాస్ రోడ్ప్రారంభం70
గుడివాడ-నూజెండ్ల వద్ద 4-లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జిప్రారంభం98
కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డుప్రారంభం13
పీలేరు నుండి కలసూర్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల రోడ్ప్రారంభం593
నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ప్రారంభం362
చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ప్రారంభం200
కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్జాతికి అంకితం546
శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్జాతికి అంకితం1730

ఈ ప్రాజెక్టులు పారిశ్రామిక, విద్యుత్, రోడ్లు, రైల్వే, రక్షణ ఉత్పాదన, పెట్రోలియం రంగాల్లో వృద్ధిని తెస్తాయి. లక్ష మందికి పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.


సీఎం పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు

ప్రధాని పర్యటనను సక్సెస్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. వారం రోజులుగా మంత్రులు కర్నూలులో మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది హాజరవుతారని అంచనా. భోజనం, పార్కింగ్, మంచినీరు, ట్రాఫిక్ డైవర్షన్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 1,800 మంది పోలీసులతో భారీ బందోబస్తు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు పర్యటనను స్వాగతిస్తున్నారు.

Tags:    

Similar News