ఏపీలో ప్రారంభమైన పోలింగ్‌

రెండు పట్టభద్రుల స్థానాలు, ఒక ఉపాధ్యాయ నియోజక వర్గం కలిపి మూడు ఎమ్మెల్సీ నియోజక వర్గాలలో పోలింగ్‌ ప్రారంభమైంది.;

By :  Admin
Update: 2025-02-27 04:54 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నాడు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండు పట్టభద్రుల స్థానాలు, ఒక ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికల మంగళవారంతో ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 1,062 పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మూడు ఎమ్మెల్సీ నియోజక వర్గాల్లో 70 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, 6,84,593 మంది ఓటర్లు తమ ఓటింగ్‌ను వినియోగించుకోనున్నారు. అయితే సాయంత్రం నిర్ణయించిన సమయంలోగా పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. 144  సెక్షన్ ను కూడా అమలులోకి తెచ్చారు.  

అయితే ఈ మూడు స్థానాల్లో పోటీ హోరా హోరీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్న కూటమి వర్గాలు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. దీంతో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికల బరీలో ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్‌ నుంచి బరీలో ఉండగా మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు పీఆర్‌టీయూ నుంచి కోరెడ్ల విజయగౌరి యూటీఎఫ్‌ నుంచి పోటీలో ఉన్నారు. వీరి మధ్యలోనే ప్రధాన పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రఘువర్మకు కూటమి వర్గాలైన టీడీపీ, జనసేనలు సపోర్టు చేస్తున్నారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీల వరకు, ఇక టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూటమి అభ్యర్థి గెలుపు కోసం ఇక్కడ పని చేస్తున్నారు.
గాదె శ్రీనివాసులునాయుడుకి కూటమిలో కీలక భాగస్వామి అయిన బీజేపీ మద్దతు తెలిపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి బీజేపీ విభాగాలు శ్రీనివాసులునాయుడు గెలుపు కోసం పని చేస్తున్నాయి. బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బాధవ్‌తో పాటు బీజేపీ ముఖ్యనేతలు, శ్రేణులు రంగంలోకి దిగాయి. యూటీఎఫ్‌ అభ్యర్థి విజయగౌరీకి కూడా ఈ ప్రాంతంలో భారీగానే మద్దతు లభిస్తోంది. ఈ ప్రాంతంలో యూటీఎఫ్‌ బలంగా ఉండటంతో ఎన్నికల్లో కూడా యూటీఎఫ్‌ వర్గాలు బాగానే పని చేస్తున్నాయి. గత ఎన్నికల్లో యూటీఎఫ్‌ మద్దతుతోనే రఘువర్మ గెలుపొందారు. అయితే సారి యూటీఎఫ్‌ నుంచే అభ్యర్థి బరిలోకి దిగడంతో పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇక ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి 25 మంది అభ్యర్థులు బరీలో ఉండగా, ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉపాధ్యాయ నియోజక వర్గంలో 22,499, ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గంలో 3,14,984, ఉమ్మడి కృష్ణా–గుంటూరు నియోజక వర్గంలో 3,47,118 మంది ఓటర్లు ఉన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధానంగా పీడీఎఫ్, కూటమి అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఉమ్మడి తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల నియోజక వర్గం నుంచి పీడీఎఫ్‌ అభ్యర్థిగా డీవీ రాఘవులు, కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీడీఎఫ్‌ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐ వెంకటేశ్వర్లు గెలుపొందారు. కూటమి అభ్యర్థి రాజశేఖరం గెలుపుకోసం టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పని చేస్తుండగా, పీడీఎఫ్‌ అభ్యర్థి డీవీ రాఘవులు గెలుపు కోసం సీపీఎం, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పని చేస్తున్నాయి. ఇక్కడ అనధికారికంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడం పీడీఎఫ్‌ అభ్యర్థి రాఘవులకు ప్లస్‌గా మారింది.
ఇక ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల నియోజక వర్గంలో కూడా కూటమి అభ్యర్థికి, పీడీఎఫ్‌ అభ్యర్థికి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ బరిలో ఉండగా, పీడీఎఫ్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2024 ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించడం వల్ల ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు సీటు దక్క లేదు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తినే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల ప్రస్తావన రాకముందే చంద్రబాబు ప్రకటించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పని చేస్తున్నాయి.
పీడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు గెలుపు కోసం ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్షాలు తీవ్రంగా పని చేస్తున్నాయి. అయితే విజయ అవకాశాలు కూటమి అభ్యర్థులకే ఉన్నాయనే టాక్‌ ఆ ప్రాంతాల్లో వినిపిస్తోంది. రెండు పట్టభద్రుల స్థానాల్లో రాజశేఖరం, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కూడా కూటమి మద్దతిస్తున్న అభ్యర్థి రఘువర్మ గెలుస్తారనే టాక్‌ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. గట్టి పోటీ ఇస్తున్న పీడీఎఫ్‌ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయని కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల్లో టాక్‌ వినిపిస్తోంది.
Tags:    

Similar News