బొండా ఉమాను పోలీసులు అనుమానిస్తున్నారా?

విజయవాడ సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరావును పోలీసులు అనుమానిస్తున్నారా? సీఎం వైఎస్‌ జగన్‌పై రాయి విసిరిన కేసులో ఏమి జరుగుతోంది.

Update: 2024-04-18 11:38 GMT

ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడిన వారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని పోలీసులు భావిస్తున్నారా? ఈ మేరకు వారిని పలు కోణాల్లో విచారిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఇంకా ధృవీకరించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు అజిత్‌సింగ్‌ నగర్‌లో స్థానికులైన కూలి పనులు చేసుకునే యువకులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు పేరు చెప్పినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో ఈ విషయాలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

పోలీసులు బొండా ఉమామహేశ్వరావుపై అనుమానంతో కేసు నమోదు చేసే అవకాశం ఉందని భావించిన సెంట్రల్‌ తెలుగుదేశం పార్టీ నాయకులు బొండా ఉమాను ముందుగా ముందస్తుబెయిల్‌ తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఎన్నికల సమయం కావడం, అందులోనూ సీఎంపై దాడి కేసు కావడం వల్ల ఏదైనా జరిగే అవకాశం ఉందని, అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఎన్నికల్లో ప్రచారం వ్యూహం పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్‌ తీసుకోవడం మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులను ప్రశ్నిస్తే తమకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వనందునే రాయి విసిరామని, అది తగులుతుందని అనుకోలేదని వారు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. వాహనం పక్కన నిలబడి వారు రాయి విసిరితే ఎవ్వరికీ కనిపించకుండా సీఎం తలకు ఎలా తగిలిందనేది ఇంకా చర్చగానే ఉంది.
కావాలని తెలుగుదేశం వారిని కేసులో ఇరికించేందుకు వైఎస్సార్‌సీపీ వారు ప్లాన్‌ చేశారనే ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలపై ఎటువంటి అవగాహన లేని వారిని అదుపులోకి తీసుకుని రాయి మీరే వేశారని చెప్పాలంటూ పోలీసులు వారిపై వత్తిడి తీసుకొచ్చారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. నాయకులను గౌరవించే వారే తప్ప వారు దాడులకు పాల్పడే వారు కాదని పోలీసుల అదుపులో ఉన్న యువకుల తల్లిదండ్రులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగ్‌నగర్‌లో పోలీసుల అదుపులో ఉన్న యువకుల బంధువులు సింగ్‌నగర్‌ సెంటర్‌లో ధర్నాచేసి తమ పిల్లలను వదిలి పెట్టాలని పోలీసులను కోరారు.
చివరకు ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందోనని తెలుగుదేశం వారు ఆందోళనలో ఉన్నారు. తమను కావాలని ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో సంఘటన జరగటం వెనుక పోలీసుల వైఫల్యం ఉందే తప్ప తెలుగుదేశం వారు బాధ్యులు కాదని వారు అంటున్నారు. దీనిని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఖండిస్తున్నాయి.
మీడియాతో బోండా ఉమా మాట్లాడుతూ ‘పోలీస్‌ అధికారులు కొంతమంది నన్ను ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇరికించాలని చూస్తున్నారు. నాకు సీఎం పై రాయి దాడి ఘటనలో ఏటువంటి సంబంధం లేదు. సీబీఐ విచారణ వేయాలని డిమండ్‌ చేస్తున్నా. నేను కూడా సహకరిస్తాను. వేముల దుర్గారావును తీసుకువెళ్ళి హింసించి నా పేరు చెప్పించాలని చూస్తున్నారు. అంతకుముందు వడ్డెర గూడెం పిల్లలను తీసుకువెళ్ళి హింసించారు. అందులో ఒకతను తనకు డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే రాయి విసిరానని చెప్పారు.’ అని అన్నారు. కోడికత్తి డ్రామా, వివేకానంద రెడ్డి హత్య వాళ్ళే చేయించారని దర్యాప్తు సంస్థలు తేల్చాయని, ఇప్పుడు ఎన్నికల ముందు సింపతీ కోసం గులక రాయి డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News