పల్లెలకు ఏసీ బస్సులు

కొనుగోలు చేసే ఆర్టీసీ ఈవీ బస్సులన్నీ ఏసీ బస్సులే ఉండాలని, పల్లె వెలుగైనా సరే ఏసీ సౌకర్యం కలిగి ఉండాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Update: 2025-12-24 06:26 GMT

రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని పల్లెప్రాంతాలకు, గ్రామాలకు ఏసీ సౌకర్యంతో కూడి బస్సులను నడిపేందుకు ఆలోచనలు చేస్తున్నారు.  అందుతో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)ను ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. భవిష్యత్తులో ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులన్నీ (EV Buses) ఎయిర్ కండిషన్డ్ (AC) సౌకర్యంతోనే ఉండాలని ఆయన అధికారులకు స్పష్టమైన నిర్దేశాలు చేశారు. అది సామాన్యులు ప్రయాణించే 'పల్లె వెలుగు' బస్సు అయినా సరే, ప్రయాణికులకు ఏసీ సౌకర్యం కల్పించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.  

సాధారణంగా ఏసీ సౌకర్యం కేవలం సుదూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, ఇంద్ర లేదా గరుడ బస్సులకే పరిమితం అనే భావనను మార్చాలని సీఎం అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా తక్కువ ధరలో అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ హితం కోరుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను పెంచాలని నిర్ణయించారు. నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు.
కొత్తగా కొనుగోలు చేసే ప్రతి ఈవీ బస్సులో అత్యాధునిక హంగులు, సౌకర్యవంతమైన సీటింగ్ ఏసీ ఉండాలి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు సాంకేతికతను జోడించాలని, ప్రయాణికులను ఆకర్షించేలా సేవల నాణ్యత పెంచాలని సూచించారు. ఏసీ సౌకర్యం కల్పించినప్పటికీ, సామాన్యులపై భారం పడకుండా చార్జీల విషయంలో సమతుల్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు కొత్త ఈవీ బస్సుల డిజైన్, కొనుగోలు ప్రక్రియలో మార్పులు చేయనున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో సైతం ఏసీ రానుండటంపై గ్రామీణ ప్రాంత ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని దేశంలోనే అత్యుత్తమ రవాణా సంస్థగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 
Tags:    

Similar News