తిరుపతిలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు
తొక్కిసలాట క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్తున్న జగన్ కాన్వాయ్‌ని పోలీసులు ఆపేశారు.;
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న భక్తుల కుబుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయలు దేరారు. ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న బాధితులను çపరామర్శించేందుకు గురువారం సాయంత్రం రేణుగుంట విమానాశ్రయం నుంచి వెళ్తున్న జగన్ కాన్వాయ్‌ని తిరుచానూరు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు నిలిపి వేశారు. అలా జగన్ కాన్వాయ్‌ని ఎందుకు ఆపేశారు అనే దానికి పోలీసుల వద్ద సమాధానం లేదు. సుమారు అరగంట పాటు కాన్వాయ్‌ని కదలనివ్వక పోవడంతో కారు దిగిన జగన్ కాలినడకన నడుచుకుంటూ ఆసుపత్రికి బయలు దేరారు. ఆయన వెంట మాజీ మంత్రులతో పాటు పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదిలాయి.
కార్యకర్తలే ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ ముందుకు సాగారు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ పార్టీ నాయకుడు ఒకరు కారును తెచ్చి ఎక్కాలని కోరడంతో ఆ కారులో జగన్ బయలు దేరారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా ఉన్నప్పటికీ ఎందుకు జగన్‌ను పోలీసులు ఆపారనేది చర్చనీయాంశంగా మారింది. మరో వైపు ఆసుపత్రి నుంచి క్షతగాత్రులను డిచ్చార్జి చేయడం కూడా తాజాగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మందీ మార్బలం.. బాధితులను పరామర్శించడం పూర్తి అయినందున, జగన్ పరామర్శకు వచ్చే లోపు ఆసుపత్రి నుంచి బాధితులను డిశ్చార్జి చేసి పంపించాలనే ఆలోచనలు అధికారి పార్టీ నేతలు చేసినట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఏమైనా ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న మాజీ సీఎం జగన్‌ను పోలీసులు అడ్డుకోవడం, అరగంట సేపు కదలనీకుండా చేయడం, ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న క్షతగాత్రులను ఆకస్మికంగా డిశ్చార్జి చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది.