వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ను అడ్డుకున్న పోలీస్

ఎరువుల బ్లాక్ మార్కెట్ కు వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది.;

Update: 2025-09-09 13:00 GMT
విజయవాడలో పోలీసుతో వైఎస్సార్సీపీ నేతల తోపులాట

రాష్ట్రంలో ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో కూటమి సర్కారుపై వైఎస్సార్‌ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు మంగళవారం శాంతియుత ఆందోళనలు నిర్వహించాయి.


రైతన్నలపై కూటమి ప్రభుత్వం దగాను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలోచేపట్టిన అన్నదాత పోరు గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని వైఎస్సార్సీపీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు కదం తొక్కినట్లు పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ పిలుపుతో వైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో శాంతియ‌తంగా ర్యాలీలు జరిగాయన్నారు. పోలీసుల ఆంక్ష‌ల‌ను లెక్కచేయ‌కుండా పాల్గొన్న రైతులకు పార్టీ అభినందనలు తెలిపింది.

విజయవాడలో నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులు పోలీసుల తోపులాటలో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అధికారుల వద్దకు ఒకరికంటే ఎక్కువ మంది వెళ్లొద్దంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. ర్యాలీలను అడ్డుకున్నారు. 


యూరియా కొరత సహా అనేక రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసనలు చేపట్టారు. అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైఎస్సార్ సీపీ నేతలు శాంతియుత నిరసనలు తెలిపారు. ఉల్లి, టమోటాలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎంతమందిని అరెస్టు చేసినా రైతుల పక్షాన పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ రైతు నాయకులు అన్నారు.


అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్‌ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు చేరుతోంది. నల్లబజార్‌లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్‌కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్‌లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ ఈస్ట్ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ భూమన అభినయ్ రెడ్డి, మాజీ మంత్రులు కాకాని గోవర్థన్ రెడ్డి, జోగి రమేశ్, ఆర్కే రోజా, పేర్నినాని, ధర్మాన కృష్ణదాస్, విడదల రజిని, వేణుగోపాల కృష్ణ, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజా అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జ్ లు ఆందోళనలో పాల్గొని పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఎక్కడికక్కడ పోలీసులు తమ ర్యాలీలను అడ్డుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని, అందుకే తాము ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News