COVID| తిరుపతి ఆస్పత్రుల్లో ప్రశాంతం.. ఫ్రంట్ లైన్ వారియర్స్ అప్రమత్తం
ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు యథావిధిగా అందిస్తున్నారు. కోవిడ్ కేసులు వస్తే, పరికరాలు, వసతులు సిద్ధంగా ఉంచామని స్విమ్స్ డైరెక్టర్ చెబుతున్నారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-24 07:40 GMT
ప్రభుత్వ ప్రధానాస్పత్రుల్లో 'కరోనా' కలవర పెట్టడం లేదు. రోగులకు వైద్య సిబ్బంది యథావిధిగానే సేవలు అందిస్తున్నారు. వైరస్ ప్రబలకుండా రోగులకు అవగాహన కల్పిస్తున్నారు.
రాయలసీమకు తలమానికంగా ఉన్న పెద్దాస్పత్రుల్లో ప్రధానమైనవి తిరుపతిలో శ్రీవేంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా ఆస్సత్రి ( Sri Venkateswara Ram Narayan Ruya Government General Hospital SVRR ), శ్రీవేంకటేశ్వ వైద్య విజ్ణాన సంస్థ (Sri Venkateswara Institute of Medical Sciences SVIMS) లో కనిపించిన వాతావరణం ఇది.
కడప రిమ్స్ ప్రభుత్వాస్పత్రిలో చేరిన కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన ఓ వృద్ధురాలు (70) కరోనాకు గురయ్యారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి చెప్పారు. ఆమెకు తదుపరి పరీక్షల నివేదిక వచ్చిన తరువాతే చెప్పగలం అని స్పష్టం చేశారు. మహిళలకు కోవిడ్ సోకిందనే వార్తలను సాయంత్రానికి ఆ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ( District Medical and Health Officer ) నాగరాజు తోసిపుచ్చారు.
"ఆ మహిళకు జ్వరం, దగ్గు మాత్రమే ఉంది. ప్రత్యేక వార్డులో పర్యవేక్షణలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం" అని డీఎం అండ్ హెచ్ నాగరాజు స్పష్టం చేశారు.
ఇక్కడంతా ప్రశాంతం...
రుయా ఆస్పత్రి అత్యవసర విభాగం
తిరుపతిలోని SVRR ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, అదే ప్రాంగణంలోని SVIMS ఆస్పత్రుల్లో శుక్రవారం సాయంత్రం ఎలాంటి అలజడి లేదు. రోగులు వార్డుల్లో చికిత్స తీసుకుంటూ ఉంటే, ఆస్పత్రి బయట వారి సంబంధీకులు చెట్ల కింద రోజు మాదిరే సేదదీరుతూ కనిపించారు. ఈ ఆస్పత్రుల్లో ఒకరిద్దరు వైద్య సిబ్బంది, రోగుల సంబంధీకులు మాత్రమే మాస్కులు ధరించి కనిపించారు. కొందరితో మాట్లాడాలని ప్రయత్నిస్తే, లేని సందేహాలు ఎందుకు కల్పిస్తారు. అంతా ప్రశాంతంగానే ఉందని సమాధానం ఇచ్చారు.
అత్యవసర సేవలకు సిద్ధం
"కోవిడ్ కేసులు వస్తే, అత్యవసర సేవలకు వసతులతో సిద్ధంగా ఉన్నాం" అని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ స్పష్టం చేశారు.
తిరుపతి స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 750 ఇన్ పేషంట్లు ఉన్నారు. ఓపీడీలో రోజుకు కనీసంగా 1,500 రోగులు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్య సిబ్బంది జ్వరం, జలుబు, శరీర నొప్పులతో బాధపడే వారిని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం" అని డాక్టర్ ఆర్వీ. కుమార్ వివరించారు.
SVIMS Director ఆర్వీ. కుమార్
ఆయన ఇంకా ఏమన్నారంటే..
జ్వరంతో కొందరు వస్తున్నారు. అవి ప్రమాదం కాదు. సీజనల్ వ్యాధులు రావడం సహజం. వాతావరణ మార్పుల వల్ల కూడా సహజ లక్షణాలు మారుతుంటాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని ఆయన వివరించారు. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అత్యవసర విభాగం 24/7 రద్దీగా ఉంటుంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. "కొన్ని ప్రాంతాల్లో కనిపించిన లక్షణాల నేఫథ్యంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రోగం ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది" అని డాక్టర్ ఆర్వీ. కుమార్ గుర్తు చేశారు.
కోవిడ్ మళ్లీ ప్రారంభమైందనే విషయంపై ఆయన స్పందించారు.
"ఆస్పత్రిలో పడకలు సిద్ధంగా ఉన్నాయి. రోగ నిర్ఢారణకు అవసరమైన పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటికంటే ముందు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉన్నారు" అని చెప్పారు.
వైద్య పరిభాషలో..
ప్రస్తుతం కనిపిస్తున్న లక్షణాలు వైద్య పరిభాషలో చెప్పాలంటే.. "స్పాండిక్ కేసేస్" అంటారు. అక్కడక్కడ లక్షణాలు ఉన్నాయి. గతంలో ఉన్నంత సీరియస్ ఉండకపోవచ్చు. కేసులు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అది తీవ్రతరం కాకుండా, చేయడం అనేది ప్రజలు మొదట వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది" అదే విషయాన్ని ఆస్పత్రికి వచ్చే రోగులను పరిశీలించడంతో పాటు, సూచనలు కూడా చేస్తున్నాం అని ఆయన చెప్పారు. వైరస్ అనేది ఒకే రీతిలో ఉండదు. జనటిక్ కంపోజిషన్ మారుతుంటుంది. ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. అని డాక్టర్ ఆర్ వీ.కుమార్ విశ్లేషించారు.
స్విమ్స్ అత్యవసర విభాగంలో రోగులను పరీక్షిస్తున్న డాక్టర్లు
ఈ ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలోకి వెళ్లే సరికి దాదాపు 30 మందికి పైగానే వివిధ రోగాలు, ప్రమాదాలకు గురైన వారితో అత్యవసర విభాగం కిటకిటలాడుతోంది. అదే సమయంలో మిగతా వైద్యులు, సిబ్బందికి తోడు చీఫ్ క్యాజువాలిటీ ఆఫీసర్ ( Chief Casualty Officer ) డాక్టర్ శివశంకర్, క్యాజువాలిటీ ఆఫీసర్ డాక్టర్ మునుస్వామి, మరో ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాష్ అత్యవసర రోగులకు చికిత్స అందించడంలో సూచనలు ఇస్తూ కనిపించారు. ఒకరిద్దరు మినహా చాలా మంది మాస్కులు ధరించిన ఛాయలే కనిపించలేదు.
"కరోనా వస్తోందంట కదా సార్. ఇంతప్రశాంతంగా ఉన్నారంటే ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు.
కీలకమైన వైరాలజీ విభాగంలోకి మాస్కులు లేకుండా ప్రశాంతంగా వెళుతున్న సిబ్బంది
"ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ పరికరాలే కాదు పీపీఏ కిట్లు కూడా ఉన్నాయి. వ్యాధి ప్రబలకుండా నివారించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రం మొత్తానికి స్విమ్స్ లోనే వైరాలజీ విభాగం చాలా పెద్దది. రాయలసీమ నుంచి కూడా ఇక్కడకి స్వాబ్ పరీక్షలకు పంపిస్తుంటారు. రోజుకు కనీసంగా రెండు వేల నుంచి మూడు వేల మంది రోగ నిర్ధారణ పరీక్షలు చేయగలిగిన సామర్థ్యం ఉంది.
తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద మాస్కులు లేకుండానే సేదదీరుతున్న రోగుల సంబంధీకులు
తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద కూడా పరిస్థితి ప్రశాంతంగానే కనిపించింది. ప్రత్యేకంగా ఏర్పాట్లు అంటూ ఏమీ లేవు. వైద్య ఆరోగ్య శాఖ కేవలం సూచనలు మాత్రమే చేసింది. దీంతో ఆందోళన చెందాల్సిన పని లేదు. అని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
"కరోనా లక్షణాలు ప్రబలే అవకాశం ఉంటే మాత్రం యుద్ధప్రాతిపదికన ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయడం. అత్యసర చికిత్స సంసిద్ధంగా ఉన్నాం" రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా చెబుతున్నారు.