విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇతర రాజకీయ నాయకులకంటే ఎక్కువగా స్పందించినట్టు కనిపించారు. అప్పటికి ఆయన అధికారంలో లేరు. వైసీపీకి పార్లమెంటులో 22 మంది ఎంపీల బలం ఉన్నప్పటికీ కేంద్రంపై పోరాడే సత్తా లేకపోవడం వల్లే ప్లాంట్ ప్రైవేటీకరణకు మార్గం సుగమం అయిందని దుమ్మెత్తిపోశారు. నాలుగేళ్ల క్రితం ఉక్కు కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఆయన ప్లాంట్‌లో బహిరంగ సభలో మాట్లాడినప్పుడు, ఆ తర్వాత ఎన్నికల వరకు జరిగిన వేర్వేరు సమావేశాల్లోనూ ఆయన అదే తీరు కొనసాగించారు. తనకు కేవలం ఒక్క ఎంపీ కూడా లేరని అందువల్ల తాను నిస్సహాయుడినని, కూటమి ప్రభుత్వాన్ని, ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే తాము ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని పలుమార్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఏపీలో కూటమి నుంచి 21 మంది ఎంపీలు గెలిచారు. దీంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణ వైపు అడుగులు మరింత వేగంగా పడుతున్నాయి. విశాఖ ఉక్కుకు కేవలం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడంతోనే ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నంత బిల్డప్ ఇచ్చారు కూటమి నేతలు. ప్రైవేటీకరణకు వీలుగా కీలక విభాగాలు ఒక్కొక్కటిగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. మరోపక్క కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనకడుగు వేయలేదని పార్లమెంటు సాక్షిగా కుండబద్దలు కొట్టారు. ఈ వరుస పరిణామాలపై ఉక్కు కార్మిక లోకం ఆందోళన చెందుతుంటే కూటమి నేతలు మాత్రం ప్రైవేటీకరణ ఆగిపోయిందంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సేనతో సేనాని పేరిట విశాఖలో మూడు రోజుల పాటు విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ‘నేను పారిపోను.. పారిపోను.. ఖచ్చితంగా ఉక్కు కోసం వస్తాను. అండగా ఉంటానని భరోసా ఇచ్చిన పవన్ విశాఖ వస్తున్నారని, ప్లాంట్‌కు వచ్చి ప్రైవేటీకరణపై మంచి కబురు చెబుతారని ఉక్కు కార్మికులు గంపెడాశలు పెట్టుకున్నారు.
స్టీల్ ప్లాంట్‌కన్నా రుషికొండే ముద్దు..
కానీ పవన్ కల్యాణ్ విశాఖలో ఉన్న మూడు రోజుల్లో ఒక్కరోజు కూడా స్టీల్ ప్లాంట్ గడప తొక్కలేదు. సేనతో సేనాని కార్యక్రమంలో రెండో రోజు రుషికొండ ప్యాలెస్‌కు వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ ప్యాలెస్ కోసం రూ.453 కోట్లు వృధాగా ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. దాదాపు మూడు గంటల సేపు అక్కడే గడిపారాయన. కానీ అంతకంటే ఎంతో కీలకమైన ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ఆందోళనలో ఉన్న కార్మికులను కలిసే ప్రయత్నమే చేయలేదు. స్టీల్ ప్లాంట్‌కు వెళ్తే కార్మిక నేతలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వెళ్లలేదని అంటున్నారు.
గతంలో పవన్ ఏమన్నారంటే?
‘విశాఖ ఉక్కు కర్మాగారం 32 మంది బలిదానాలు, 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీల రాజీనామాలు, 64 గ్రామాలకు చెందిన 22 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల త్యాగాల ఫలితంగా వచ్చింది. రెండు దశాబ్దాల కాలంలో రూ.6 వేల కోట్ల లాభాన్ని ఆర్జించింది. రూ. 40 వేల కోట్లు రాష్ట్రానికి, కేద్రానికి పన్నులు చెల్లించింది. 16 వేల మందికి శాశ్వత, 18 వేల మందికి కాంట్రాక్టు ఉద్యోగాలను ఇచ్చింది. మరో ఐదారు లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిస్తోంది. ఈరోజుకీ ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. దీంతో ఈ రైతులు అన్నం వండుకోలేక దేవాలయాల్లో ప్రసాదాలు తినే దుస్థితిలో ఉన్నారు. ప్లాంట్ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం ప్రకటించగానే అందరితో పాటు నాకూ బాధ కలిగింది. వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకి వినతిపత్రం ఇచ్చాం. వైసీపీకి 22 మంది ఎంపీలున్నారు. నాకు ఎంపీల్లేరు’ అంటూ దాదాపు నాలుగేళ్ల క్రితం 2021 అక్టోబర్ 31న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలను వీరిప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కూటమి ఎంపీలు 21 మంది గెలిచారు. ఆ బలంతో ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదు? అని వీరు పవన్‌ను ప్రశ్నిస్తున్నారు.
అఖిలపక్షానికి తొందరలేదు..
సేనతో సేనాని తొలిరోజు ముగిశాక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మీడియా ముందుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఢిల్లీకి అఖిపక్షాన్ని తీసుకెళ్లమని కోరితే తీసుకెళ్లలేదన్నారు. మీరు తీసుకెళ్లవచ్చు కదా? అని విలేకరులు అడిగితే ఇప్పుడంత తొందర లేదని చెప్పారు. అంతేకాకదు.. సేనతో సేనాని కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ తీర్మానం చేశారా? అని అడగ్గా ఆ అవసరం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తే అదెందుకూ పనికి రాదని కొట్టిపారేశారు. రెండో రోజు సదస్సులో పార్టీ శ్రేణులనుద్దేశించి పవన్ మాట్లాడుతూ ‘కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అడిగే లాజికల్ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు. వారి దగ్గర సమాధానం ఉంది. నష్టం వస్తే ఎన్నాల్లు భరిస్తాం అంటారు. వారికి సరిగా చెప్పాలి. ప్లాంట్ భావోద్వేగాలతో వచ్చింది. సొంత గనులు కేటాయించి పైప్‌లైన్ వేయండని చెప్పాం. ఎస్ నో చెప్పలేదు. చూస్తామన్నారు. అప్పట్నుంచి ముందుకెళ్లలేదు’ అని చెప్పారు.
సేనతో సేనాని ఆఖరి రోజు ఇలా..
సేనతో సేనాని ఆఖరి రోజు శనివారం సాయంత్రం జరిగిన సభలో పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన చేస్తారని చాలామంది అనుకున్నారు. కానీ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని ఏక వాక్య ప్రకటనతో సరిపెట్టారు. అంతకు మించి విశాఖ ఉక్కు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్నికల ముందువరకు ఉక్కుపై పోరాట పటిమను ప్రదర్శించిన పవన్.. కూటమి గెలిచాక తీరు మార్చుకున్నారంటూ ఉక్కు కార్మికులు నిట్టూరుస్తున్నారు.