Pawan Kalyan | అంచనాలు పెంచేసిన 'హరిహర వీరమల్లు'
తిరుపతిలో హోరెత్తిన జనసేన ర్యాలీలు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-22 16:01 GMT
చారిత్రాత్మక కథాంశం ఆధారంగా నిర్మించిన "హరిహర వీరమల్లు" సినిమా సిల్వర్ స్క్రీన్ పైకి రాకముందే భారీగా అంచనాలను పెంచేసింది.
పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విజయాన్ని ఆకాంక్షిస్తూ జనసైనికులు సంబరాలు ప్రారంభించారు. జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా భారీ విజయం అందుకోవాలని జనసేన శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
తిరుపతిలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పూజలు, ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. తమ అభిమాన నటుడు, నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ చేస్తున్నట్లుగా జనసేన పార్టీ శ్రేణులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ నుంచి గ్రూప్ థియేటర్స్ వరకు బైక్ ర్యాలీతో హోరెత్తించారు.
రెండు రోజుల కిందట జనసేన పార్టీ నాయకులు, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సారధ్యంలో అలిపిరి సమీపంలోని శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఆ తర్వాత ఆలయంలో పూజలు నిర్వహించారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షో వేయడానికి కూడా ఈపాటికే టిక్కెట్ల విక్రయం జరిగింది. సినిమా చూసేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు భారీగా టికెట్లు కోవడానికి పోటీ ఏర్పడింది. టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఇలా ఉంటే..
కథాంశం
చారిత్రక కథాంశంగా రూపొందిన హరిహర రాయలు చిత్రం వెనుక పెద్ద కథ ఉందని జనసేన నాయకులు చెప్పారు.
"హరిహర I (1306 – 20 నవంబర్ 1355), హక్క, వీర హరిహర అని కూడా పిలుస్తారు. కర్ణాటకలో విజయనగర సామ్రాజ్య స్థాపకుడు. 1336 నుంచి 1355 వరకు పరిపాలించాడు. ఆయన, ఆయన వారసులు సంగమ రాజవంశాన్ని స్థాపించారు. ఈ సామ్రాజ్యాన్ని పాలించిన నాలుగు రాజవంశాలలో మొదటిది" అని చరిత్ర చెబుతోంది.
ఈ కథను సారాంశం గా తీసుకొని నిర్మించిన సినిమా కావడం, అందరూ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
హోరెత్తిన ర్యాలీ..
జనసేన పార్టీ కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలు కూడా ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడం వల్ల పార్టీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రమోషన్ వర్క్ చేశారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ కార్యక్రమాలు పర్యవేక్షించారు.
జనసేన నగర పార్టీ అధ్యక్షులు రాజా రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎంగా ఉంటూ నటించిన తొలి చిత్రం హరిహర వీరమల్లు సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి తెలిపారు. ప్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రజలు పవన్ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. సినిమా విడుదలకు ముందే విజయం సాధించిందని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొందురు పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఖచ్చితంగా నిరాశక చెందక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.