పీఏ వాంగ్మూలం..ఎంపీ అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు
రాఘవరెడ్డి పోలీసుల విచారణ సంచలనంగా మారింది. ఎంత మంది వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అరెస్టు చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.;
కడప ఎంపీ వైఎస్ అవినాష్ పీఏ రాఘవరెడ్డి పోలీసుల విచారణ, విచారణలో రాఘవరెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది. పీఏ ఇచ్చిన వాంగ్మూలం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకునేందుకు మెండుగా అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంకా మరి కొంత మంది వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు కూడా అది చుట్టుకునే అవకాశం ఉందని, దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతల అరెస్టులు పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇది ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత మూడు రోజులుగా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి పోలీసుల విచారణ కొనసాగుతోంది. సోమవారం మొదలైన విచారణ బుధవారం కూడా కొనసాగుతోంది. సోమవారం, మంగళవారాల్లో రాఘవరెడ్డిని సుదీర్ఘంగా విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలపై కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. డీఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో కడప సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది. ఇది వరకు వర్రా రవీందరరెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఆ మేరకు రాఘవరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.