పరకామణి కేసు..హైకోర్టు సీరియస్
తిరుమల తిరుపతి పరకామణి కేసు మీద విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 27కు వాయిదా వేసింది.
తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయ పరకామణి చోరీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీఐడీ అధికారులు ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీజ్ చేసిన ఫైళ్లతో సహా కోర్టుకు సమర్పించారు. అయితే, టీటీడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ఏపీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింద. టీటీడీ ఈవో తీరుపై ఆగ్రహం వెలిబుచ్చిన ధర్మాసనం, అక్టోబరు 27న టీటీడీ ఈవోను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఆదేశాలు పాటించకపోతే 20 వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. కౌంటర్ సమర్పణకు అదనపు సమయం కావాలని టీటీడీ అభ్యర్థించడంతో, కోర్టు ఆ అవకాశం కల్పిస్తూ తదుపరి విచారణను అక్టోబరు 27కు వాయిదా వేసింది.
2023లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి పరకామణి చోరీ కేసు బయటపడిన సంగతి తెలిసిందే. టీటీడీ విజిలెన్స్ విభాగానికి అప్పట్లోనే దీనిపైన ఫిర్యాదులు అందాయి. రవికుమార్ అనే సిబ్బంది పెద్ద మొత్తంలో పరకామణిని దొంగిలించారని ఆరోపణలు రాగా, అప్పటి అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టకుండానే లోకాయుక్త ద్వారా రాజీ చేయించారు. దీనిపైన మాచర్ల శ్రీనివాసులు అనే వ్యక్తి దాఖల చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చోరీ ఆరోపణలపై సీఐడీ దర్యాప్తుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సీఐడీ బృందం తిరుమల పరకామణి దస్త్రాలను స్వాధీనం చేసుకుంది.
అయితే ఈ కేసులో సీఐడీ విచారణ సరిపోదని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ శ్రీనివాసులు కోరారు. శుక్రవారం విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తదుపరి విచారణ అక్టోబరు 27కు వాయిదా పడిందని, కౌంటర్ దాఖలు చేయని ఈవోపై 20 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. రవికుమార్ 15 సంవత్సరాలుగా పెద్ద జీయర్ మఠం నుంచి పరకామణి డ్యూటీకి రెగ్యులర్‌గా వచ్చేవారని, 2023 ఏప్రిల్ 29న సీసీటీవీ ఫుటేజ్‌లో చోరీ బయటపడిందని వివరించారు. ఆ సమయంలో ఈవో ధర్మారెడ్డి ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా కాపాడారని ఆరోపించారు. సీఐడీ బదులు సీబీఐ విచారణ జరిగినా ధర్మారెడ్డి మాయమాటలతో ప్రభావితం చేయగలరని, ఆయన వెనుక మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేయి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవారి కానుకలను రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నానని శ్రీనివాసులు పేర్కొన్నారు.