పండమేరు పొంగింది.. అనంతపురం మునిగింది
ఎప్పుడూ వర్షా భావంతో, తాగు నీరు, సాగు నీరు సమస్యతో ఇబ్బంది పడే అనంతపురంలో పండమేరు వరద బీభత్సం సృష్టించింది.
Byline : Vijayakumar Garika
Update: 2024-10-22 06:03 GMT
సోమవారం రాత్రి కురిసి భారీ వర్షాలకు అనంతపురం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శివారు ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. పండమేరుకు భారీ స్థాయిలో వరద వచ్చి పడింది. దీంతో ఉధృతి మరింతగా పెరిగింది. పలు కాలనీలు నీట మునిగాయి. నీటిలో చిక్కుకొని పోయిన కాలనీ వాసులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
సోమవారం కురిసిన అతి భారీ వర్షాలకు నగరానికి ఆనుకొని ఉన్న పండమేరు ఉగ్రరూపం దాల్చింది. భారీ స్థాయిలో వర్షం పడటంతో వాగు పొంగి ప్రవహిస్తోంది. దీనికి ఇరువైపుల ఉన్న కాలనీలు నీట మునిగాయి. బైకులు, ఆటోలు కొట్టుకొని పోయాయి. ఇంకా వరద పెరుగుతోంది. దీంతో ఆ చుట్టు పక్కల కాలనీలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని కాలనీలు మునిగాయి. పెనుకొండలోను గుట్టూరు, వెంకటగిరి పాలెం చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటిలోనే బస్సులు, లారీలు, కార్లు నిలిచిపోయాయి. హైదరా బాద్–బెంగుళూరు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. వరద నీటిలో చిక్కుకొని పోయిన బస్సులను పోలీసులు జేసీబీల సాయంతో బయటకు తీసీ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించారు. కనగానపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో పండమేరుకు భారీగా వరద వచ్చిపడింది.