తిరుచానూరు బ్రహ్మోత్సవ చరిత్రలో ఓ రికార్డు.

1.50 లక్షల‌ మందికి అన్నప్రసాదాల పంపిణీ.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-25 12:57 GMT

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో పంచమీతీర్థానికి రికార్డు స్థాయిలో టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల చరిత్రలో ఓ పేజి దక్కింది. దాదాపు1.50 లక్షల మందికి మంగళవారం ఉదయం నుంచి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. దీనికోసం 13 బాయిలర్స్ ద్వారా వంటకాలు సిద్ధం చేశారు. అసాధారణ భద్రతా ఏర్పాట్ల తోపాటు విశేష సేవలు కూడా అందించారు. చక్రస్నానం నిర్వహించే సమయంలో పుణ్యస్నానం చేయడానికి వచ్చిన యాత్రికులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.


టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో 1.50 లక్షల‌ మంది భక్తులకు అన్నప్రసాదాలు, అల్పాహారం అందించినట్టు టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడిచారు. టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం పర్యవేక్షణలో అన్నప్రసాదం విభాగం అధికారులు యాత్రికులకు అన్నప్రసాదాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

160 కౌంటర్ల ద్వారా...

తిరుచానూరులో యాత్రికులకు అన్నప్రసాదాల పంపిణీకి 160 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
"తోళ్లప్ప గార్డెన్స్‌లో 50, జెడ్పీ హైస్కూల్ వ‌ద్ద 40, అయ్య‌ప్ప‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద 50, పూడి వ‌ద్ద 20 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేశాం" అని జేఈఓ వీరబ్రంహ్మం వివరించారు. 24వ తేదీ రాత్రి నుంచి 25వ తేదీ ఉదయం, మధ్యాహ్నం వరకు కదంబం, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర‌, ఉదయం ఉప్మా, పొంగలిని పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
తిరుచానూరులో పంచమి తీర్థం సందర్భంగా శ్రీపద్మావతీ అన్నప్రసాద కేంద్రం, శ్రీనివాసం కాంప్లెక్స్, టిటిడి పరిపాలనా భవనంలోని ఎంప్లాయిస్ క్యాంటిన్ల నుంచి 13 బాయిలర్స్ ద్వారా వంటలు సిద్ధం చేసి,హోల్డింగ్ పాయింట్లు, గ్యాలరీలు, క్యూలు, భక్తులు అధికంగా ఉండే కూడళ్ల వద్ద పంపిణీ చేశారు.
"వంటల్లో నాణ్యత, రుచి, శుచి మరింత మెరుగ్గా ఉండేందుకు జీడిపప్పు, నెయ్యిని అదనంగా ఉపయోగించాం" అని జేఈఓ వీరబ్రహ్మం చెప్పారు.
1.25 లక్షల మందికి బాదంపాలు

పంచమి తీర్థం సందర్భంగా అన్నప్రసాదాలతో పాటు 1.25 లక్షల మందికి బాదంపాలు, లక్ష మందికి బిస్కెట్ ప్యాకెట్లు, 30వేల మందికి మజ్జిగ, 30 వేల మందికి సుండలు అందించారు. యాత్రికులకు అన్నప్రసాదాల పంపిణీకి 900 మంది శ్రీవారి సేవకులు, వంద ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, 200 మంది అన్నప్రసాదం సిబ్బంది, 500 మంది ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది సేవలు అందించారు.
1.50 లక్షల తాగునీటి బాటిళ్ల పంపిణీ

పంచమితీర్థం సందర్భంగా విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 1.50 లక్షల తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఆలయం, పుష్కరిణి పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం 300 శాశ్వ‌త, తాత్కాలిక, మొబైల్‌ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. టిటిడి ఆరోగ్య‌శాఖ అధికారులు ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.
పంచమీతీర్థం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసు సిబ్బందిని నిత్యం పర్యవేక్షించామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించిన సంతృప్తి మిగిలిందని ఆయన వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News