తల్లి వద్దునుకుంది.. డాక్టర్లు కాపాడారు.. ఆ శిశువుకు అభయం ఇచ్చారు

62 రోజుల తరువాత అనంతపురం శిశుగృహం ఒడిలోకి నవజాత శిశువు.

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-25 10:07 GMT

అప్పుడు పుట్టిన ఓ ఆడబిడ్డను ఓ తల్లి వద్దనుకుంది. అనాథగా వదిలేసి వెళ్లిపోయింది. అధికారులు ఆదరించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల పాటు నవజాత కేంద్రంలో ఆ బిడ్డను డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ కంటికి రెప్పలా కాపాడారు. ఇప్పుడు ఆ ఆడబిడ్డ బోసి నవ్వులు చిందిస్తోంది. సంపూర్థ ఆరోగ్యంగా ఉంది.

అనంతపురం జిల్లా ఐసీడీఎస్ అధికారుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇన్ని రోజులు సేవలు చేసిన అనంతపురం జనరల్ ఆస్పత్రి వైద్యులు భావోద్వేగానికి గురయ్యారు. అనంతపురం పట్టణం సాయినగర్ ప్రాంత స్థానికుల సమాచారంతో ఆడబిడ్డను ఆదరించిన అధికారులు రెండు నెలల ఆస్పత్రిలో చికిత్స చేయించి, కాపాడారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే... రెండు నెలలు వెనక్కు వెళ్లాలి....


సాయినగర్ లో ఏమి జరిగింది?

సెప్టెంబర్ 25 తేదీ తెల్లవారింది. అనంతపురం సాయినగర్ ఏడో క్రాస్ వీధిలో జనం బయటికి వస్తున్నారు. రోడ్డు పక్కన పాలిథిన్ కవర్లో అప్పుడే పుట్టిన ఓ అడబిడ్డ కేరింతలు వినిపించాయి. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆడ పసికందును కవర్లో చుట్టి ఓ తల్లి విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న సచివాలయ మహిళా పోలీసులు, ఐసీడీఎస్, ఐసీపీఎస్, చైల్డ్ లైన్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి నవజాత శిశువును చేరదీశారు. అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి (Anantapur Government General Hospital )కి తరలించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దోమలు కుట్టి తీవ్ర అనారోగ్యంతో ఉన్న పసికందును సుమారు రెండు నెలల పాటు జీజీహెచ్ లోని నవజాత శిశుకేంద్రంలో ఉంచి కంటికి రెప్పలా చూసుకున్నారు. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా కోలుకుంది. రెండు కిలోల బరువుతో పుట్టిన బిడ్డ ఇప్పుడు 3.2 కిలోల బరువు పెరిగింది.
ఆకలి తీర్చిన మదర్స్ మిల్క్ బ్యాంక్
ఏ తల్లికి ఆ ఆడబిడ్డ బారమైందో తెలియదు. అనాథగా పడి ఉన్న బిడ్డను ఆస్పత్రికి తరలించారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డను అనంతపురం ప్రభుత్వాస్పత్రి ఆస్పత్రి సిబ్బంది కంటికి రెప్పలా కాపాడాలని శ్రద్ధ తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ ( Anantapur Mother's Milk Bank ) నుంచి రోజూ  పాలు తెప్పించి నవజాతాశిశువుకు తాపించారు. ఆ విధంగా బిడ్డ కోలుకొని ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది.
"ఆ ఆడపసికందును కాపాడడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. మాకంటే నర్సింగ్ స్టాఫ్ అపురూపంగా చూశారు" అని
నవజాత శిశుకేంద్రంలోని డాక్టర్లు చెప్పారు. 
"రోజూ దశలవారీగా విధులకు వచ్చే డాక్టర్లు రవికుమార్, డాక్టర్ మురళి, డాక్టర్ హరిణి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ దినకర్ డాక్టర్ నవీన్, సిబ్బంది పసికందు ఆలనాపాలనా చూశారని" ఆర్ఎంఓ డాక్టర్ హేమలత చెప్పారు. సుమారు రెండు నెలల తరువాత ఆ బిడ్డ ఆరోగ్యంగా కోలుకునే వరకు దగ్గరుండి సపర్యలు చేయడం మా వృత్తి ధర్మంలో భాగమైనా, ఇది మా వైద్య సిబ్బందికి మరింత సంతృప్తి ఇచ్చిందని ఆర్ఎంఓ డాక్టర్ హేమలత వ్యాఖ్యానించారు. నవజాతా శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించే సమయంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ కూడా వారికే తెలియని స్థితిలో భావోద్వోగానికి లోనయ్యారు.
ఐసీడీఎస్ అధికారులకు అప్పగింత

తీవ్ర అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వచ్చిన ఆడ పసికందును అనంతపురం ప్రభుత్వాస్పత్రి వైద్యులు కాపాడారు. ఆ పసికందు ఆరోగ్యంగా ఉండడంతో ఐసీడీఎస్ ( ICDS )అనుబంధ ఐసీపీఎస్ జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్ మంజునాథను పిలిపించారు. నవజాత శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ బిడ్డను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని ఆర్ఎంఓ డాక్టర్ హేమలత ఐసీడీఎస్ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. అధ్వర్యంలో ఆస్పత్రి అధికారులు సోమవారం అప్పగించారు. అనంతరం శిశుగృహానికి తరలించారు. ఇన్నాళ్లు బిడ్డను కంటికి రెప్పలా చూసుకున్న ఆర్ఎంవో డాక్టర్ హేమలత, నవజాత శిశు వైద్యులు, అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ సిబ్బందికి డీసీపీఓ మంజునాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
Tags:    

Similar News