Exclusive | శేషాచలం అడవుల్లో అలిపిరి వద్ద ఆపరేషన్ చిరుత
బోను ఏర్పాటు చేసిన అటవీ శాఖ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-26 13:16 GMT
తిరుమల శేషాచలం అడవులకు కింది భాగంలో ఉన్న అలిపిరి బైపాస్ లో చిరుత సంచారం ఎక్కువైంది. చిరుతను బంధించడం ద్వారా ప్రజలు భయాందోళన గురికాకుండా అటవీశాఖ చర్యలకు దిగింది. అలిపిరి నుంచి తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూపార్క్ వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో క్యాన్సర్ ఆసుపత్రికి సమీపంలో చిరుతను బంధించడానికి శనివారం సాయంత్రం ఒక బోను ఏర్పాటు చేశారు.
అలిపిరి నుంచి జూ పార్కు వెళ్లే బైపాస్ రోడ్ లో శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. వేగంతో ఉన్న ఆ బైకిస్ట్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఇదే ప్రదేశంలో సరిగ్గా వారం కిందట ఓ చిరుత రోడ్డు పక్కన ఉన్న కల్వర్టుపై బైఠాయించి వాహన దారులను భయానికి గురి చేసింది. ఈ సంఘటనపై స్పందించిన తిరుపతి అటవీశాఖ అధికారులు గస్తీ పెంచారు.
"అలిపిరి నుంచి జూ(zoo )కు వెళ్లే మార్గంలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు కూడా ఉన్నాయి. దాదాపు 5 కిలోమీటర్ల వరకు అలిపిరి నుంచి వెళ్లే కుడిపక్క వ్యర్థపదార్థాలు పడవేయడం, అక్కడ కుక్కల సంసారం ఎక్కువగా ఉండటమే చిరుతల సంచారానికి కారణం" అని ఎఫ్ ఆర్ ఓ బి సుదర్శన్ రెడ్డి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధులకు చెప్పారు.
"ప్రస్తుతం చిరుత సంచరించిన ప్రాంతాల్లో పాదముద్రలు కూడా పరిశీలించాం. చిరుత జాడలు కనిపించడంతో బంధించడానికి బోను ఏర్పాటు చేస్తున్నాం" ఎఫ్ ఆర్ వో సుదర్శన్ రెడ్డి చెప్పారు.
చిరుతపులి పాదముద్రలు
"బోనులో చిక్కిన తర్వాత చిరుత మానసిక పరిస్థితి, ఆరోగ్యం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మళ్లీ శేషాచలం దట్టమైన అడవుల్లోనే వదిలిపెడతాం" అని ఎఫ్ ఆర్ ఓ సుదర్శన్ రెడ్డి వివరించారు.
"అలిపిరి బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, క్యాన్సర్ ఆసుపత్రి, పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిఘా ఉంచాం" అని కూడా వివరించారు.
శ్రీశైలం టైగర్ ఫారెస్ట్, శేషాచలం అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు, జంతువుల మానసిక, పరిస్థితి, సంచారం ఒకో ప్రాంతంలో ఒక విధంగా ఉంటుంది.
తిరుపతి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ వల్లూరు లక్ష్మీ సౌజన్య ఏమంటున్నారంటే.
చిరుతలు బ్రీడింగ్ కూడా ఇదే సీజన్లో ప్రారంభమవుతుంది. అని కూడా వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ లక్ష్మీసౌజన్య వివరించారు.
అడవుల్లో సంచరించే వన్యమృగాల మానసిక స్థితి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుందనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు.
"ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న నీటి వనరు, ఆహారం, ప్రదేశాలను చిరుతలు కూడా పరిశీలిస్తాయి" అనే లక్ష్మీ సౌజన్య వివరించారు.
"అలిపిరి నుంచి జూ పార్కు వెళ్లే మార్గంలో తరచూ తిరుగుతున్న చిరుతకు ఎలాంటి ప్రమాదం లేకుండా, మనుషుల ప్రాణాలకు కూడా నష్టం లేకుండా బంధించడానికి బోను ఏర్పాటు చేస్తున్నాం" అని లక్ష్మీ సౌజన్య తెలిపారు. " చిరుత పులి జాడలు కనుగొనడానికి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటుచేసి తిరుపతి అటవీ శాఖ కార్యాలయం నుంచి నిరంతరం నిఘా ఉంచుతాం" అని లక్ష్మీ సౌజన్య చెబుతున్నారు.
బోనులో చిక్కిన తర్వాత చిరుత మానసిక స్థితి, వివరాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ఆమె వివరించారు.
మొత్తం మీద ఈ అధికారుల మాటలను పరిశీలిస్తే చిరుతల సంచారానికి మానవ తప్పిదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి ప్రారంభిస్తే జూ పార్క్ వరకు ఉన్న సుమారు ఏడు కిలోమీటర్ల దూరం వరకు యూనివర్సిటీలు, ఆసుపత్రుల వ్యర్ధాలు పడవేస్తున్నారు. నగరంలోని వ్యాపార కేంద్రాలు, చిరు వ్యాపారులు, ఇతర మిగిలిన పదార్థాలను వాహనాల్లో తీసుకువచ్చి అలిపిరి పరిసర ప్రాంతాల్లో రోడ్డు పక్కన కాలవలో డంపింగ్ చేయడం వల్ల కుక్కల సంసారం వల్లనే చిరుతపులులు మైదాన ప్రాంతంలోకి రావడానికి ఆస్కారం కల్పించినట్లు స్పష్టమవుతుంది.