ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయండి

ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఏడుగురు కేంద్ర మంత్రులను తాను కలుస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;

Update: 2025-05-23 16:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని పునర్విభజన చట్టంలో చేర్చి నోటిఫై చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. తాను ఢిల్లీ పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఏడుగురు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అధికంగా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వచ్చాయన్నారు. గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా రూ. 1.20లక్షల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిపోయిందని మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చామని, దీని ప్రకారం ఏపీలో 72 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయాల్సి ఉందని, రూ. 28,346 కోట్ల విలువైన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను ఏపీకి ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషిని కోరామని, దీనికి ఆయన సానుకూలంగానే స్పందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జగ్గయ్యపేట–డోలకొండ క్లస్టర్‌లో దాదాపు ఆరువేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, మిసైల్‌ అండ్‌ అమ్యూనేషన్‌ ప్రొటెక్షన్‌ సెంటర్‌గా దీనిని తయారు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
ఎయిర్‌ క్రాఫ్ట్‌ పరిశ్రమలతో పాటు ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి–మడకశిర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అదేవిధంగా విశాఖపట్నం–అనకాపల్లి ప్రాంతంలో నేషనల్‌ ఎక్స్‌ఫర్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కర్నూలు–ఓర్వకల్లు ప్రాంతంలో మిలటరీకి సంబంధించిన డ్రోన్లు, రోబోటిక్స్, అడ్వాన్డ్స్‌ డిఫెన్స్‌ కాంపోనెంట్స్‌ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తిరుపతి ఐఐటీలో డీఆర్‌డీవో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే తాము కోరిన అన్ని ప్రతిపాదనలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారని, ఇతర కేంద్ర మంత్రులు కూడా సానుకూలంగానే స్పందించాని చంద్రబాబు తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముందు ఏపీలో కంటోన్మెంట్‌ ఏర్పాటు చేయాలని మరో ప్రతిపాదనలు పెట్టామని, దీనిపైన సానుకూలంగా స్పందించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ పరిశీలిస్తామని చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. ఆపరేషన్‌ సింధూర్‌ సక్సెస్‌ అయిన సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌కు అభినందనలు తెలిపినట్లు చెప్పారు.
అయితే కుసుమ్‌ కింద 2వేల మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. పవర్‌కు సంబంధించినవన్నీ అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా మారబోతోందని .. తద్వారా 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేసేందుకు వీలుంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు రూ. 80వేల కోట్లు ఖర్చు అవుతుందని, దీని ద్వారా 200 టీఎంసీల నీటిని దారి మళ్లించొచ్చని, సముద్రంలో కలిసే నీళ్లనే ఈ ప్రాజెక్టు ద్వారా తరలిస్తామని, ఈ ప్రాజెక్టుకు నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరామని, కేంద్రం నిధులు ఇవ్వగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు.
Tags:    

Similar News