లిక్కర్ స్కాంలో మరో వైసీపీ నేత

తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామికి నోటీసులు;

Update: 2025-07-19 10:07 GMT
మాజీ మంత్రి నారాయణ స్వామి
ఏపీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఇప్పుడు ఈ వైసీపీ నాయకుణ్ణి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. జూలై 21 సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడ సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం 40 మందిని సిట్‌ నిందితులుగా చేర్చింది.
2019-2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్న హయాంలో సుమారు 3,500వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ) సిట్ విచారణకు ఆదేశించింది.
ప్రస్తుతం ఈ కేసులో నాలుగో నిందితునిగా ఉన్న వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి జూలై 19న సిట్ విచారణకు హాజరయ్యారు.
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. దుబాయ్ కేంద్రంగా లావాదేవీలు జరిగినట్టు సిట్ ఆరోపించింది. ఇది కేవలం రూ. 3,500 కోట్ల స్కామ్ కాదని 30 వేల మంది ప్రాణాలు బలిగొన్న స్కామ్ అని చెబుతున్నారు. ఈ స్కామ్ ను వైసీపీ నేతలు దేశ సరిహద్దులు దాటించారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఈడీ విచారణ జరుగుతోందని ఏపీలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ పై కూడా ఈడీ విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రూ. 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నానని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెడితే అది ఫేక్ అని కూడా తెలుసుకోకుండానే ఈడీ స్పందించిందని ఏపీ లిక్కర్ స్కామ్ పై కూడా ఈడీ అదే విధంగా స్పందించాలని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి కోరారు.
Tags:    

Similar News