సెల్పీ కలెక్టరే కాదు..చదివించే కలెక్టర్
పునరావస కేంద్రంలో బాధితుల కోసం వండిన అన్నాన్ని వారి మధ్యలో కూర్చుని భోంచేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను గడగడలాడించిన మొంథా తుపాన్ తీరం దాటక ముందు ప్రభుత్వం ముమ్మరంగా ముందస్తు చర్యలు చేపట్టింది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, అందులో లోతట్టు ప్రాంతాలు, వరద ప్రవాహానికి గురయ్యే ప్రాంతాలలో నివసించే ప్రజలను ఆ పునరావాస కేంద్రాలకు తరలించడం, తద్వారా తుపాన్ నుంచి వారిని రక్షించడం అనేది ఆ చర్యల్లో ఒకటి. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కరు కూడా తుపాన్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దు, జీరో నష్టం అనే మోడ్‌లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.
అందులో భాగంగా రెడ్ అలెర్డ్‌లో ఉన్న నెల్లూరు జిల్లాలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో వందాలది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెడ్‌అలెర్ట్ ప్రాంతాలలో ఇరవై నాలుగు గంటల మోనటరింగ్ సెల్ ఏర్పాటు నిత్యం పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. వేలాది మంది ప్రజలను ఆ కేంద్రాలకు తరలించి బస ఏర్పాటు చేయడంతో పాటు ఆహారం అందించడం వంటి సదుపాయాలు కల్పించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటి చర్యల్లో భాగంగా కొండ్లపూడిలో కూడా ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచిస్తూ నెల్లూరు లోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ వస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్లతో కలిసి కొండ్లపూడిలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అందులో ఆశ్రయం పొందుతున్న వారిని పలకరించి వారికి కల్పించిన సౌకర్యాలు గురించి ఆరా తీశారు. వారికి భోజనాలు కూడా దగ్గర ఉండి వడ్డించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఇద్దరు సామాన్యులుగా మారిపోయారు. పునరావాస కేంద్రాలలో తల దాచుకుంటున్న ప్రజలకు పెడుతున్న భోజనాన్నే తమకు పెట్టమని, ప్లేట్‌లో వేయించుకుని ఇద్దరు ఒక టేబుల్ మీద కూర్చుని తిన్నారు.
ఇదంతా చూస్తున్న సిబ్బంది, పునరావాసంలో ఉంటున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలాంటి భేషజాలు లేకుండా సామాన్య వ్యక్తులుగా వారిద్దరు మారిపోయారు. అంతేకాకుండా అక్కడ ఉన్న చిన్నారులతో కలిసిపోయారు. తమ హోదాలను పక్కన పెట్టి వారితో సరదాగా గడిపారు. జోక్‌లు వేసి వారిని నవ్వించే ప్రయత్నం చేశారు. వారితో సెల్ఫీలు దిగారు. వారి చదువుల గురించి తెలుసుకుంటూ, వారి తరగతి పుస్తకాలను అందించి, పాఠాలు చెప్పి వారి చేత చదివించారు. హోదాలు పక్కన పెట్టి బాధితులతో వారు మమేకమైపోయిన విధానం, సామాన్య ప్రజల పట్ల వారు చూపిన ప్రేమ, ఆప్యాయత, ఆదరణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రజల కలెక్టర్ అంటే ఇలానే ఉంటారు అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
హిమాన్షు శుక్లా 2013వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు. 27 ఏళ్లకే ఆయన ఐఏఎస్ సాధించారు. 2012లోఆలిండియా 94 ర్యాంకర్‌గా నిలిచారు. విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. తర్వాత తిరుపతి సబ్‌కలెక్టర్‌గాను, టూరిజమ్ శాఖ డైరెక్టర్‌గాను, గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు.
అనంతరం హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్ట్స్‌టైల్స్ డైరెక్టర్‌గాను, ఏపీ హ్యాండిక్రాప్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగాను, తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా జేసీగాను పని చేసిన శుక్లా తర్వాత కోనసీమ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. అనంతరం ఐ అండ్ పీఆర్ డైరెక్టర్‌గా, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగాను పని చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఇటీవలె పదవీ బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ అజిత వేజెండ్ల కూడా ఇటీవలె నెల్లూరు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.