ఏపీలో నామినేటెడ్ కొలువుల జాతర
16 టీడీపీకి, మూడు జనసేనకు, ఒకటి బీజేపీకి కేటాయించిన కూటమి ప్రభుత్వం అమరావతి కోసం పోరాటం చేసిన వారిలో ఇద్దరికి పోస్టులు కట్టబెట్టింది.;
By : The Federal
Update: 2025-05-12 05:28 GMT
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నాటినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. మహిళా కమీషన్‌తో పాటు, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, కీలకమైన ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్టులకు కూటమి ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. పార్టీకి విధేయులుగా ఉంటూ, గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేసిన వారికి పోస్టులను కేటాయించింది. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అమరావతి కోసం పోరాటం చేసి, కూటమి విజయవానికి కృషి చేసిన వారికి కూడా నామినేటెడ్ పోస్టులు కేటాయించారు.
మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు ఎస్సీ కమిషన్ చైర్మన్‌గాను, మరో మాజీ మంత్రి పీతల సుజాతకు మహిళా సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్‌గాను, అమరావతి పోరాటంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ రాయపాటి శైలజకు అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఇదే అమరావతి జేఏసీలో కీలకంగా వ్యవహరించిన ఆలపాటి సురేష్‌కు ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించారు. నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు డాక్టర్ శివప్రసాద్‌కు ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వాటరవేస్ అథారిటీ బోర్టు చైర్మన్‌గాను, కుప్పంకు చెందిన టీడీపీ నేత ఎస్ రాజశేఖర్‌కు ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్(ఏపీఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్‌గాను, గుంతకల్ టీడీపీకి చెందిన వెంకట శివుడు యాదవ్‌కు ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు, తాడేపల్లిగూడెంకు చెందిన టీడీపీ నేత వి బాబ్జీకి ఆంద్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు, నిడదవోలుకు చెందిన టీడీపీ నాయకుడు బూరుగుపల్లి శేషారావుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ)కు చైర్మన్‌గాను నియమించారు.
తిరుపతి టీడీపీ నాయకుడు దివాకర్‌రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అ«థారిటీ, ఏలూరుకు చెందిన టీడీపీ నాయకుడు పెన్నుబోయిన వాణి వెంకట శివప్రసాద్‌కు ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, తెనాలికి చెందిన టీడీపీ నాయకుడు డాక్టర్ వేమూరి రవికి ఏపీఎన్‌ఆర్‌టీఎస్, కావలికి చెందిన టీడీపీ నాయకుడు మలేపాటి సుబ్బానాయుడుకు ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండిస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, నరసాపురంకు చెందిన టీడీపీ నేత కొల్లు పెద్దిరాజుకు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌గా నియమించింది.
తిరుపతి జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్‌కు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గాను, ఒంగోలుకు చెందిన జనసేన పార్టీ నాయకుడు రియాజ్‌కు ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్‌గాను, రంపచోడవరం బీజేపీ నాయకుడు సోల్ల బోజ్జిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.