నా రికార్డులు బద్దలు కొట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు

ఎస్సీలలో వర్గీకరణ జరగాలని ఇప్పుడు కాదని, 30 ఏళ్ల క్రితమే నిర్ణయించామని సీఎం చంద్రబాబు అన్నారు.;

By :  Admin
Update: 2025-04-05 11:14 GMT
నా రికార్డులు బద్దలు కొట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు
  • whatsapp icon

ముఖ్యమంత్రిగా కానీ, ఎమ్మెల్యేగా కానీ తన రికార్టును బద్దలు కొట్టడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదని, ఆ రికార్టులు సృష్టించడం తనకు మాత్రమే సాధ్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తన రాజకీయ చరిత్రలో 8 సార్లు ఎమ్మెల్యేగాను, 15 ఏళ్లు ముఖ్యమంత్రిగాను పని చేశానని వెల్లడించారు. ఎస్సీలలో వర్గీకరణ జరగాలని ఇప్పుడు కాదని, 30 ఏళ్ల క్రితమే నిర్ణయించామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటించారు. బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ముప్పాళ్లలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. బాబు జగ్జీవన్‌రామ్‌ స్పూర్తితో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. తానెప్పుడు భవిష్యత్‌ గురించి ఆలోచనలు చేస్తుంటానని, రాబోయే 20–30 ఏళ్ల గురించి ముందుగానే తాను ఆలోచనలు చేస్తుంటానన్నారు. అందులో భాగంగా మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. జన్మభూమి నాడు అందరు ఆహ్వానించారన్నారు. దేశంలో పుట్టిన ఏ వ్యక్తీ పేదరికంలో ఉండటానికి వీల్లేదని, వారి డెవలప్‌మెంట్‌ కోసం పని చేస్తామన్నారు. అందులో భాగంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పీ–4 విధానాన్ని తెచ్చామన్నారు. పేదల అభివృద్ధికి పీ–4 ఎంతో ఉపయోగపడుతుందన్నారు. డబ్బు, హోదాల వల్ల సమాజంలో గుర్తింపు రాదని, మంచి పనులు చేసినప్పుడే నిజమైన గౌరవం వస్తుందన్నారు.
పేదలు ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానని, బాబు జగ్జీవన్‌రామ్‌ ఆశయాల కోసం పని చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ‘బాబు జగ్జీవన్‌రామ్‌’ పథకం కింద ఎస్సీలకు 2 కిలోవాట్స్‌ సోలార్‌ విద్యుత్‌ను అందిస్తామన్నారు. ఎస్సీ, బీసీ పిల్లల కోసం వంద శాతం గురుకుల విద్యను అందిస్తామని, నైపుణ్య శిక్షణ కూడా అందిస్తామన్నారు. వేదాద్రి–కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ కోసం రూ. 15 కోట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పీ–4 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల కుటుంబాలను ఎంపిక చేశామన్నారు. అంతకు ముందు ముప్పాళ్ల పర్యటను వెళ్లిన సీఎం చంద్రబాబుకు హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌ యాదవ్, ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని నాని, ఇతర నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నందిగామ నియోజక వర్గం ముప్పాళ్లలో బాలికల గురుకుల పాఠశాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీ–4లో మార్గదర్శి–బంగారు కుటుంబం కింద ఎంపికైన వారిని సీఎం చంద్రబాబు సత్కరించారు.
Tags:    

Similar News