పోలీసులకు అడ్డంతిరిగిన పట్నం
రిమాండురిపోర్టులో తాను చెప్పింది కాకుండా పోలీసులు ఏమనుకుంటే దాన్నే పెట్టినట్లు ఆరోపించారు.
తన పేరుతో ప్రచారంలో ఉన్న కన్ఫెషన్ రిపోర్టు పూర్తిగా తప్పని పట్నం నరేందరరెడ్డి(Patnam Narendar Reddy) చెప్పారు. లగచర్ల)Lagacharla) గ్రామసభలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Pratik Jain) పైన జరిగిన దాడిలో కేటీఆర్(KTR) వ్యూహం ప్రకారమే తాము నడుచుకున్నట్లు మాజీ ఎంఎల్ఏ పట్నం నరేందరరెడ్డి అంగీకరించినట్లు పోలీసులు రిమాండురిపోర్టు(Remand Report)లో స్పష్టంచేశారు. పట్నంకు సంబంధించిన రిమాండురిపోర్టును పోలీసులు బుధవారం రాత్రి కోర్టులో దాఖలుచేశారు. విచారణలో పట్నం చెప్పిన వివరాల ఆధారంగానే పోలీసులు రిమాండురిపోర్టు తయారుచేసి కోర్టులో దాఖలు చేశారనే ప్రచారం పెరిగిపోయింది. రిమాండురిపోర్టులో పట్నం వాగ్మూలం ఉంది కాబట్టి పోలీసులు ఏ నిముషంలో అయినా కేటీఆర్ ను అరెస్టు చేయచ్చనే ప్రచారం పెరిగిపోయింది. దాంతో కేటీఆర్ ఇంటి దగ్గరకు వందలసంఖ్యలో నేతలు, క్యాడర్ చేరుకున్నారు.
రిమాండురిపోర్టు ఆధారంగానే కేటీఆర్ కూడా తనను పోలీసులు ఎప్పుడైనా అరెస్టు చేయచ్చని మానసికంగా సిద్ధపడిపోయారు. సరిగ్గా ఈ సమయంలోనే పట్నం పేరుతో ఒక లేఖ బయటకు వచ్చింది. అందులో పోలీసుల విచారణలో తాను కేటీఆర్ గురించి ఏమీ చెప్పలేదని చెప్పారు. రిమాండురిపోర్టులో తాను చెప్పింది కాకుండా పోలీసులు ఏమనుకుంటే దాన్నే పెట్టినట్లు ఆరోపించారు. జరిగిన గొడవకు సంబంధించి కేటీఆర్ పాత్రను పోలీసులు ప్రస్తావించినా తాను మాత్రం ఏమీ చెప్పలేదని స్పష్టంచేశారు. కేటీఆర్ గురించి తాను ఏమీ మాట్లాడకపోయినా దాడికి సూత్రదారుడు కేటీఆరే అని తాను చెప్పినట్లుగా పోలీసులు ప్రచారంలోకి తీసుకురావటం అన్యాయమని పట్నం మొత్తుకున్నారు.
తాను రిమాండురిపోర్టును అడిగినా పోలీసులు ఇవ్వలేదని చివరకు తన లాయర్ ద్వారా రిమాండురిపోర్టు తెప్పించుకున్నట్లు చెప్పారు. రిమాండురిపోర్టులో ఏముందో చూసినపుడు దాడికి కేటీఆర్ సూత్రదారుడిగా తాను చెప్పినట్లుగా ఉందన్నారు. రిమాండురిపోర్టులోని చాలా అంశాలు పోలీసులు ఏకపక్షంగా రాసుకున్నవే అని పట్నం ఇపుడు అడ్డం తిరిగారు. పట్నం రాసిన లేఖ తన లాయర్ ద్వారా వెలుగుచూసింది. రిమాండురిపోర్టులో కేటీఆర్ గురించి ఉన్న అంశాలు తప్పని ఇపుడు పట్నం అడ్డం తిరగటంతో ఇపుడు పోలీసులు ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది.