కుంకీ ఏనుగులు..పవన్‌ కళ్యాణ్‌లపై లోకేష్‌ ఏమన్నారంటే

ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతుల పంటపొలాలను అడవి ఏనుగుల నుంచి కాపాడేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చారు.;

Update: 2025-05-22 06:11 GMT

కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్‌ ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు. పవన్‌ అన్నా అంటూ మరో సారి పవన్‌ కళ్యాణ్‌పై నారా లోకేష్‌ తన అభిమానాన్ని చాటుకున్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్‌కు కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన పవన్‌ అన్నకు అభినందనల తెలిపిన లోకేష్‌ ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైతే మరిన్ని కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు ఒప్పుకున్న కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

నారా లోకేష్‌ ఏమన్నారంటే..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతన్నల కష్టాలను, వారు కష్టపడి పండించుకుంటున్న పంటలను అడవి ఏనుగుల నుంచి కాపాడేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు. నా యువగళం పాద యాత్ర సందర్భంగా ఈ సమస్య నా దృష్టికి వచ్చింది. అడవి ఏనుగులు తమ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం. తాము కష్టపడిన పంటలను అడవి ఏనుగుల నుంచి రక్షించాలని ఉమ్మడి చిత్తూరు రైతు సోదరులు కోరారు. ప్రత్యేకించి పలమనేరు రైతు సోదరులు ఆ సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవనన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా సమస్యలను తొలగించేందుకు నడుం బిగించారు. పవనన్న చొరవ తీసుకొని కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి కుంకీ ఏనుగులను మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవనన్నకు నా అభినందనలు. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని ఒప్పుకొని హామీ ఇచ్చినందుకు కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అంటూ మంత్రి నారా లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Tags:    

Similar News