నంద్యాల: తప్పిన ఘోర ప్రమాదం
ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు అదుపు తప్పింది. హైదరాబాదుకు చెందిన 12 మంది గాయపడ్డారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-25 07:36 GMT
సుదూర ప్రయాణంలో ఉన్న వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ఓల్వో బస్సు ఆదివారం వేకువజామున అదుపుతప్పి, పొలాల్లోకి దూసుకుపోయింది. ప్రయాణికుల అదృష్టం బాగుంది. సమీపంలోనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి ఉంటే, ప్రమాదం తీవ్రంగా ఉండేది.
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల వద్ద జాతీయ రహదారుల పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతో ఘోర ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన వెంటనే స్పందించారు. సకాలంలో గాయపడిన వారందరినీ నంద్యాల ఆసుపత్రికి తరలించారు.
బ్లాక్ స్పాట్ లోనే ప్రమాదం
కర్నూలు జిల్లా నంద్యాల వద్ద ఎన్ హెచ్ అధికారులు గుర్తించిన బ్లాక్ స్పాట్ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ కింద మీద పడ్డారు. తీవ్ర కుదుపుల వల్ల 12 మంది గాయపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ బృందం తో పాటు పారామెడికల్ సిబ్బంది కూడా వెంటనే స్పందించడంతో ప్రాణ నష్టం తప్పింది.
హైదరాబాద్ జాతీయ రహదారిపై గస్తీలో ఉన్న సిబ్బంది ప్రమాదానికి గురైన ప్రయాణికులను వెంటనే నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పాండిచ్చేరి నుంచి 40 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు హైదరాబాద్ కు బయలుదేరింది. నంద్యాల సమీపంలోని రైతు నగర్ సమీపంలో జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళుతున్న ఈ వోల్వో బస్సు అదుపుతప్పి పొలంలోకి దూసుకు వెళ్ళింది. బస్సు డ్రైవర్ కునికిపాటు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
"డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రైవేట్ వోల్వో బస్సు అదుపు తప్పింది" అని జాతీయ రహదారుల శాఖ అధికారులు ప్రకటించారు.
ఆరు నెలలతో ఉన్న ఈ జాతీయ రహదారిలో బస్సుకు అడ్డంగా ఇలాంటి జంతువు అడ్డం రాలేదు అని కూడా స్పష్టం చేశారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల్లో హైదరాబాద్ నగరం షేక్పేట్ ప్రాంతానికి చెందిన సి. దిలీప్, అనురాధ దంపతులను ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి పలకరించారు.
వారు చెప్పారంటే..
"హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళాం. దగ్గరే అని చెప్పడంతో పాండిచ్చేరికి వెళ్లి ఆ ప్రాంతాలను చూసాం" అని దిలీప్ చెప్పారు.
"పాండిచ్చేరిలో టికెట్ బుక్ చేసుకున్నాం. Py05U7579 నెంబర్ బస్సు పాండిచ్చేరిలో శనివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. రాత్రి 8 గంటలకు అరుణాచలం వద్ద భోజనం బ్రేక్ ఇచ్చారు. అక్కడి నుంచి బయలుదేరిన బస్సు ఎక్కడ ఆగలేదు.. డ్రైవర్ మారిన దాఖలాలు కూడా కనిపించలేదు" అని వివరించారు.
నంద్యాల దాటిన తర్వాత ఒకసారిగా రోడ్డుపై నుంచి కులాల్లోకి బస్సు దూసుకుపోతున్న కుదుపులకు ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు పెట్టారనీ ఆయన వివరించారు.
ప్రయాణికులు అందించిన సమాచారంతో జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే 108 అంబులెన్స్ కూడా సమాచారం అందించారు. ఆ తర్వాత సమీప పోలీస్ స్టేషన్ కూడా ఎన్ హెచ్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో కొందరిని అంబులెన్స్లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మొత్తం 28 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 12 మందికి స్వల్ప గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షులతో పాటు National Highway అధికారులు జారీ చేసిన పొలిటిన్లో స్పష్టం చేశారు. గాయపడిన వారిలో ఆరుగురు ప్రయాణికులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించినట్లు కూడా వివరించారు.
పాండిచ్చేరి నుంచి బయలుదేరిన ఈ బస్సులో ఉన్న వారందరూ హైదరాబాద్ కు చెందిన మహతి అంబర్ పేట, అభితాజ్ రెడ్డి, విద్యానగర్, రోహన్, ట్యాంక్ బజార్ ప్రాంతానికి చెందిన వారిని ఎన్.హెచ్ అధికారులు వెల్లడించారు.
నంద్యాల ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం ప్రైవేట్ ట్రావెల్స్ మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట వరకు బస్సు ఏర్పాటు చేసిందని ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన దిలీప్ దంపతులు చెప్పారు. అక్కడి నుంచి శ్రీవారి ట్రావెల్స్ ప్రతినిధులు తమ వాహనంలో హైదరాబాద్కు తరలిస్తున్నారని ఆయన వివరించారు.
తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వారి సంబంధికులు అంబులెన్స్ లో హైదరాబాదుకు తరలించారు. వారితో పాటు ప్రయాణించిన ప్రయాణికులు ఈ విషయం చెప్పారు. నంద్యాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పై ఇక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
గాలిలో ప్రయాణం.. తప్పన ప్రాణనష్టం
విద్యుత్ స్తంభానికి సమీపంలో ఆగిన ఓల్వో బస్సు
త్వరగా గమ్యం చేరాలని ప్రయాణికులు భావించడం. వారి అవసరాలను సొమ్ము చేసుకునే దిశగా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తున్నాయి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సుమారు 1200 కిలోమీటర్లు ప్రయాణించే బస్సు డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం ఒక కారణమైతే, వేగం ప్రయాణికుల ప్రాణాల మీదికి తీసుకువస్తుంది.
రవాణా శాఖ యంత్రాంగం ఈ విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని వరుసగా జరుగుతున్న ప్రమాదాలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత అయినా ఆర్టిఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాలి.