రాజమండ్రి జైలులో ఎంపీ మిథున్ కు ఇంటి భోజనమే..
ప్రత్యేక గది, వసతులు కల్పనకు అభ్యంతరాలు ఉన్నాయా? అని ఏసీబీ కోర్టు జైలు అధికారులను వివరణ కోరింది.;
By : SSV Bhaskar Rao
Update: 2025-07-22 07:12 GMT
ఏపీ లిక్కర్ స్కామ్ (AP liquor scam) లో కడప జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రాజమండ్రి కేంద్ర కార్యాలయంలో నెంబర్ 4196 రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు గదిలో ప్రత్యేక వసతులు కల్పించాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే మంగళవారం స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కూడా కోర్టు జడ్జి జైలు సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు
కోర్టు ఆదేశం ప్రకారం Ysrcp ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇంటి నుంచి భోజనం (పార్టీ నేతలు లేదా హోటల్) తెప్పించుకునే వెసులుబాటుతో పాటు మంచం, కొత్త పరువు, దిండ్లు, టేబుల్, కుర్చీ, రాసుకోవడానికి కాగితాలు, పెన్ను, చదువుకోవడానికి పత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ మేరకు
ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్ర కారాగారంలో ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టులో సోమవారం రెండు వేరువేరు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన న్యాయమూర్తి అభ్యంతరాలు తెలియజేయాలని దీనికోసం మంగళవారం స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ లిక్కర్ స్కామ్ లో నాలుగో నిందితుడిగా ఉన్న వైసిపి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారణ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఏసీబీ కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో మిథున్ రెడ్డికి ఈనెల 20వ తేదీ రిమాండ్ విధిస్తూ రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.
"రాజమండ్రి జైలులో అధికారులు ఎంపీ మిధున్ రెడ్డికి కనీస వసతులు కల్పించలేదు. దీంతో ఆయన నేలపైనే పడుకున్నారు" అని మిథున్ తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ చేస్తూ కనీస వసతులు కల్పించాలని అభ్యర్థించారు.
కోర్టు ఆదేశం
ఈ పిటిషన్ స్పందించిన ఏసీబీ కోర్టు జడ్జి ఈనెల 21వ తేదీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
రాజమండ్రి కేంద్రకరాగారంలో ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యేక గది తో పాటు అందులో కల్పించాల్సిన వసతులపై ఏసీబీ కోర్టు ఏమని ఆదేశాలు జారీ చేసింది అంటే..
1. వెస్ట్రన్ కమోడ్ తో కలిగిన ప్రత్యేక గది లో అన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి.
2. అల్పాహారంతో పాటు మూడు పూటలా ఇంటి భోజనం అనుమతించాలి.
3. రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డికి మందులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి. మల్టీ విటమిన్ మాత్రలు, సెల్లర్గాన్ (చేప నూనె మాత్రలు), గవిస్ కాన్ సిరప్, నోస్ డ్రాప్స్ (ముక్కులో వేసుకుని చుక్కల మందు) ప్రోటీన్ పౌడర్, వెన్ను నొప్పి కారణంగా బయటినుంచి దిండ్లు అనుమతించాలని, దోమతెర, యోగ మేట్, వాకింగ్ షూస్, మినరల్ వాటర్ కోసం సీసాలు అందుబాటులో ఉంచాలి
4. గదిలో మంచం, కొత్త
పరుపు దిండ్లు ఏర్పాటు చేయాలి
5. రోజువారి దినపత్రికలు మ్యాగజైన్లు అందుబాటులో ఉంచాలి
6. గదిలో టీవీతో పాటు కూర్చునేందుకు కుర్చీ టేబుల్ ఏర్పాటు చేసి తెల్లగాయితాలు కూడా అందుబాటులో ఉంచాలి
7. ఓ సహాయకుడిగా కేటాయించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా
న్యాయవాదులు టీ నాగార్జున రెడ్డి, చంద్రగిరి విష్ణువర్ధన్, నిర్మల్ రాజేష్ బాబు, ఎం మనోహర్ రెడ్డి వీరి పేర్లను సిఫారసు చేసిన ఏసీబీ కోర్టు వారానికి ఐదుసార్లు ఎంపీ మిథున్ రెడ్డిని కలవడానికి ఇద్దరిని అనుమతించండి అని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
లిక్కర్ స్కామ్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో న్యాయవాదులు ఇద్దరిని మాత్రమే అనుమతించి వారు మాట్లాడుకోవడానికి ప్రత్యేక గదిని కేటాయించాలని, ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వారి మాటల సందర్భంగా ప్రైవసీ లేకుంటే ఇబ్బంది లేదా అసౌకర్యానికి గురై అవకాశం ఉందని కూడా న్యాయస్థానం ఆదేశాల్లో ప్రస్తావించింది.