TIRUPATI || తిరుపతి కపిలతీర్థం ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్..!

రెండు గంటలపాటు భద్రతా దళాలు ఈ మాక్ డ్రిల్ నిర్వహించాయి;

Update: 2025-05-03 00:20 GMT

తిరుపతిలోని కపిలతీర్థంలో కపిలేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు.ఆలయ ప్రాంగణంలోని కోనేరులో స్నానాలు చేస్తున్నారు. ఇంతలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి రివాల్వర్లు, మెషీన్ గన్లతో ఆక్టోపస్ కమాండోలు కపిలతీర్థం ప్రహారి గోడపై నుంచి కిందికి దిగారు. ఆలయం మొత్తం జల్లెడపట్టి ఇద్దరు వ్యక్తులను బంధించారు. వారిని ఆలయంలో నుంచి బయటికి తీసుకెళ్లారు.


ఈ సమయంలో అక్కడున్న భక్తులు ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డారు. కొందరు భయపడ్డారు. అయితే, ఆ తర్వాత ఇది మాక్ డ్రిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.జమ్మూ్కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.


పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే విపత్కర పరిస్థితులు తలెత్తితే ఏం చేయాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతిలోని కపిలతీర్థం దేవాలయంలో ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి.


ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడితే ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే అంశంపై అవగాహన కల్పించాయి. ఈ కార్యక్రమంలో ఆక్టోపస్, పోలీసు, టిటిడి విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



 



Tags:    

Similar News