లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరైన మిథున్‌రెడ్డి

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు హాజరు కావాలని మిథున్‌రెడ్డికి నోటీసులిచ్చిన సిట్‌ అధికారులు.;

Update: 2025-04-19 05:31 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం మీద కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిని విచారణ చేపట్టే విధంగా చర్యలు చేపట్టింది. దీని కోసం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని(సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం సిట్‌ విచారణకు హాజరయ్యారు. రాజ్‌ కసిరెడ్డి తండ్రి, ఉపేందర్‌రెడ్డి కూడా శుక్రవారం సిట్‌ విచారణకు హాజరయ్యారు. తాజాగా రాజంపేట ఎంపీ, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శనివారం సిట్‌ విచారణకు హాజరయ్యారు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఉన్న సిట్‌ ఆఫీసులో మిథున్‌రెడ్డి విచారణ కొనసాగుతోంది. అయితే శుక్రవారం విజయసాయిరెడ్డి సిట్‌ అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్‌ అధికారులు మిథున్‌రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.

మద్యం కుంభకోణం విచారణకు హాజరు కాకుండా ఉండాలని ఎంపీ మిథున్‌రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా కోర్టులను ఆశ్రయించారు. ఈ కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టును ఆశ్రయించారు. అయితే మిథున్‌రెడ్డి పిటీషన్‌ను హైకోర్టు కోట్టేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ పోలీసులను ఆదేశించిన సుప్రీం కోర్టు.. విచారణకు సహకరించాలని ఎంపీ మిథున్‌రెడ్డిని ఆదేశించింది. అయితే మరో మారు మిథున్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు కావాలని సిట్‌ అధికారులు మిథున్‌రెడ్డికి నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో న్యాయవాదులను అనుమతించాలని, వీడియో రికార్డింగ్‌ చేసే విధంగా సిట్‌ అధికారులను ఆదేశించాలని హైకోర్టును కోరారు.
విచారణ సందర్భంగా సిట్‌ అధికారులు తనపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు తనపై చేయిచేసుకుని, దుర్భాషలాడే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో తాను ఆందోళనకు గురవుతున్నట్లు హైకోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. జవాబుదారీతనం, పారదర్శకత కోసం సీసీటీవీ కెమేరాలున్న ప్రదేశంలో మిథున్‌రెడ్డిని విచారణ చేపట్టాలని సిట్‌ అధికారులను ఆదేశించింది. మిథున్‌రెడ్డి తరఫున ఇద్దరు న్యాయవాదులను అనుమతించిన కోర్టు, ఇద్దరిలో ఒక్క న్యాయవాది మాత్రమే విచారణ సమయంలో లోనికి వెళ్లేందుకు అనుమతులిస్తూ.. పది అడుగుల దూరంలో ఉండాలని సూచించింది. అయితే విచారణ సమయంలో వాంగ్మూలం నమోదు చేస్తున్న సమయంలో న్యాయవాది జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డి శనివారం సిట్‌ విచారణకు హాజరయ్యారు.
Tags:    

Similar News