మాట మార్చిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి
ఏపీ సాంఘిక సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి మాట మార్చారు. గ్రామ వాలంటీర్లు ప్రభుత్వంలో లేరని స్పష్టం చేశారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-11-21 11:00 GMT
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సాంఘిక సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి అన్న మాటలు కాకరేపుతున్నాయి. ప్రభుత్వ లెక్కల్లో లేని వార్డు, గ్రామ వాలంటీర్ల గురించి ఏమి చెప్పాలని, ఎలా వారికి జీతాలు ఇవ్వాలని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో వాలంటీర్ వ్యవస్థ లేదు. వారి గురించిన సమాచారం లేనప్పుడు వారిని కొనసాగించడం, జీతాలు ఇవ్వడం అనే సమస్య ఎక్కడి నుంచి వస్తుందని ఆయన అన్నారు.
యూటర్న్ తీసుకోవడంలో వారికి వారే సాటి
తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చాలా మందికి యూటర్న్ తీసుకునే అలవాటు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి చాలా మంది నాయకులు పలు సందర్భాల్లో యూటర్న్‌లు తీసుకున్నారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దాదాపు మూడు సార్లు వాలంటీర్ల గురించి ప్రస్తావించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ల జీతం పదివేలు చేస్తామని, వారిని కొనసాగిస్తామని చెప్పారు. చట్టసభ సాక్షిగా వాలంటీర్ల వ్యవస్థే లేదని అంటున్నారంటే గత ఐదు సంవత్సరాల కాలం పనిచేసిన వాలంటీర్లను ప్రస్తుత పాలకులు చూడలేదు. ఇటీవల వరదలు వచ్చినప్పుడు విజయవాడలో రాజీనామా చేసిన వారు తప్ప మిగిలిన వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి సహకారంగా పనిచేశారు. గతంలో ఏ ఇంటికి ఏ అవసరం ఉందన్నా వారే సచివాలయ సిబ్బందితో మాట్లాడి పనులు చేయించారు. పించన్లు ఇంటింటికీ వెళ్లి పంచారు. ఏ పనినైనా ప్రజల వద్దకు వెళ్లి చేశారు. రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆ వ్యవస్థే ఇప్పుడు లేదనటం ఏమిటనే చర్చ మొదలైంది.
ఆద్యుడు పవన్ కళ్యాణ్
వాలంటీర్ల వ్యవస్థ రికార్డుల్లో లేదని మొదట ప్రకటించిన వారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రికార్డుల్లోనే లేనప్పుడు వాలంటర్లు ఎవరు? వారికి జీతాలు ఇవ్వడం ఏమిటి? వారిని కొనసాగించడం ఏమిటని ఒక సభలో పవన్ కళ్యాణ్ అనటంతో ప్రభుత్వంలోని సంబంధిత శాఖ మంత్రి కూడా యూటర్న్ తీసుకున్నారు.
వాలంటీర్లు రెండున్నర లక్షలు
సచివాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తరువాత 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ వంతున గత ప్రభుత్వం నియమించింది. 2019 ఆగస్టు నెలలో వీరి నియామకం జరిగింది. అప్పటి నుంచి గత ప్రభుత్వం దిగి పోయే వరకు కొనసారు. ఎన్నికలకు ముందు సుమారు 80 వేల మంది రాజీనామాలు చేశారు. ఈ లెక్కలు కూడా ప్రస్తుత మంత్రి గతంలో వివరించడం విశేషం. వీరికి గౌరవ వేతనంగా నెలకు రూ. 500లు చెల్లించారు. ఇంత పెద్ద మొత్తంలో సిబ్బంది ఉన్న వ్యవస్థను రాష్ట్రంలో లేదని చెబుతున్నారంటే ప్రజలు ఈ విషయంలో కనీస ఆలోచన చేయరా?అనే చర్చ కూడా జరుగుతోంది.
వాలంటీర్ల వ్యవస్థ రద్దయినట్లేనా?
ఈ విషయాన్ని ఆంధ్రా పాలకులు ఇప్పటి కూడా స్పష్టత ఇవ్వలేదు. వాలంటీర్ల వ్యవస్థ లేదు కాబట్టి అటువంటి వ్యవస్థ ఏదీ రాష్ట్రంలో ఉండే అవకాశం భవిష్యత్‌లో కూడా లేదనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఈ విషయంలో ముఖ్య మంత్రి నుంచి ఎటువంటి మాటా రాలేదు. కొందరు ఎమ్మెల్యేలు వాలంటీర్ల వ్యవస్థ వద్దని సీఎం వద్ద చెబితే మరికొందరు వారు ఉంటేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా ఎన్నికలకు ముందు పదివేలు జీతం ఇస్తామని ప్రకటించినందున రద్దు చేస్తున్నట్లు చెబితే నేరుగా వచ్చే ఎన్నికల్లో ఇండ్ల వద్దకు వెళ్లి వారికి సమాధానం చెప్పలేమని కొందరు టీడీపీ వారు చెప్పినట్లు సమాచారం. పైగా రాష్ట్రంలో మొత్తంగా రెండున్నర లక్షల మంది యువతీ యువకులు వాలంటీర్లుగా ఉన్నారు. వారంతా టీడీపీ అంటేనే అబద్ధాల కోరు అనే ప్రచారం చేస్తానే చర్చ కూడా టీడీపీలో జరుగుతోంది.
వాలంటీర్ల గురించి జగన్ ఏమన్నారు..
అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆగస్టు 2023లోనే మేము తీసేశామట. ప్రస్తుతం వాలంటీర్లు ఎవ్వరూ పనిచేయడం లేదు. 2023 ఆగస్టు ఉనంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదంటారు. ఆశ్చర్యం వేస్తుందని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రెండు రోజుల క్రితం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్ల గురించి ప్రభుత్వం చెప్పిన మాటలపై స్పందించారు. వాలంటర్ల గౌరవ తేతనం నిమిత్తం విడుదల నిధులు మొత్తం ఎంత అని అడిగితే రూ. 277 కోట్లని చెప్పారు. అంటే ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేశానంటారు. చంద్రబాబు ప్రభుత్వం రాకముందే ఏప్రిల్, మే నెలల్లో వారికి జీతాలు అందాయి. అంటే ఈ సంవత్సరం ఇచ్చినట్లే కదా. వాళ్ల అదృష్టం కొద్దీ అప్పటికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదని ఎద్దేవా చేశారు. వారి గౌరవ వేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే ప్రశ్నే లేదని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికలప్పుడు ఏమన్నారు, ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు. తమ హయాంలో వాలంటీర్లకు జీతాల కింద ఎంత ఇచ్చామన్నది ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు. ఈ సంవత్సరం కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు జీతాల కింద రూ. 277 కోట్లు ఇచ్చినట్లు జగన్ చెప్పారు. 2115 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటెయిల్డ్ హెడ్, 293 ఆబ్జెక్ట్ హెడ్... ఇవన్నీ వాలంటర్లకు సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్స్. లేవని ప్రభుత్వం ఎలా చెబుతుందని ప్రశ్నించారు.