మండలిలో దుమారం రేపిన ‘గాలి’ వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మండలిలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.;
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో మండలిలో కొద్ది సేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తన మీద వ్యక్తి గతంగా కూడా మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ లేని పోని వ్యాఖ్యలు చేశారని, తాను ఏదో విధంగా గెలిచి పోయానని, మంత్రి అయిపోయానని మాట్లాడారని, నేను నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తినని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తినని, మీలా గాలొస్తే గెలవడం, గాలి లేక పోతే ఓడి పోయే వ్యక్తిని కాదని అలా ఎప్పుడూ నా లైఫ్‌లోనే లేదని, గాలొచ్చినా.. గాలి లేక పోయినా.. క్లిష్ట సమయంలోనైనా సరే గెలిచే వ్యక్తినని వ్యాఖ్యానించారు. ఇంకా తన స్పీచ్‌ను కొనసాగిస్తూ.. తాను ఎప్పుడూ పదవులు మీద వ్యామోహం లేదని, పదవి ఉన్నా.. పదవి లేక పోయినా నిరంతరం ప్రజల గురించి పని చేసిన తత్వం తనదని వ్యాఖ్యలు చేశారు.