ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రంలోని ఆలయాల్లో ఎన్నో దుర్ఘటనలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన నిర్లక్ష్యం వల్లే తరచూ భక్తులు మరణిస్తున్నారని ధ్వజమెత్తారు. నాడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి, నేడు సింహాచలం చందనోత్సవంలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించిన నేపథ్యంలో బుధవారం వారి కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?
సాఫ్ట్‌వేర్ దంపతుల కుటుంబాన్ని ఓదారుస్తున్న వైఎస్ జగన్
వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది? చందనోత్సవం ఏరోజు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా? అయినా తగు జాగ్రత్తలు తీసుకుకోకుండా భక్తులను పొట్టన పెట్టుకుంటున్నారు. తిరుమలలో ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయడం వల్ల తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులను బలిగొన్నారు. ఇప్పుడు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది వస్తారని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. కూలిన గోడ ఆరు రోజుల క్రితం మొదలు పెట్టి నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. 70 అడుగుల పొడవు గోడ 10 అడుగుల ఎత్తున కట్టిన ఈ గోడలో ఎక్కడా కాలమ్స్ లేవు. రీఇన్‌ఫోర్స్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట ఫ్లై యాష్ ఇటుకలతో కట్టారు. టెండర్లు కూడా పిలవకుండా కట్టేశారు. చందనోత్సవం జరుగుతుందని తెలిసినపపుడు ముందే ఎందుకు గోడ కట్టించలేదు? రెండు రోజుల క్రితమే గోడ పూర్తయిందని తెలుసు.. వర్షం కురుస్తుందని తెలుసు. భక్తులు ఈ గోడ పక్కనే క్యూలో నిలబడేలా ఎలా చేశారు.
బాబు ఏడాది పరిపాలనలోనే ఎంతటి దారుణమైన పరిస్థితిని చూస్తున్నాం. తిరుమలను రాజకీయాల కోసం లడ్డూ వివాదాన్ని తెచ్చారు. వైకుంఠ ఏకాదశి నాడు ఆరుగురు భక్తులు చనిపోవడానికి కారణమయ్యారు. చందనోత్సవం తెలిసి తెలిసి నిర్లక్ష్యంతో ఏడుగురిని బలి తీసుకున్నారు. ఇటీవల శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు చనిపోయాయి. తిరుమలలో గోశాలలో గోవులు చనిపోవడం చూశాం. కడపలో కాశీ నాయన ఆశ్రమంలో బుల్డోజర్లతో గుడిని ధ్వంసం చేశారు. గతంలో రాజమండ్రిలో జరిగిన పుష్కరాల్లో 29 మందిని ఎలా బలిగొన్నాడో చూశాం. ఘటనలు జరిగాక కమిటీ వేసి విచారణ అంటాడు. ఒక్క ఘటనలోనైనా ఎవరిపైనైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు.
ఎందుకంటే వాటికి బాధ్యుడు ఆయనే కాబట్టి. తిరుమల ఘటనలో ఎస్పీని సిట్‌కు బదిలీచేసి అంతకంటే మంచి పోస్టింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగితే ఉద్యోగాలు ఊడతాయన్న భయం ఉంటే మళ్లీ మళ్లీ జరగవు. కానీ చంద్రబాబు తీసుకునేవి కంటి తుడుపు చర్యలే కాబట్టి పునరావృతం అవుతున్నాయి. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు. సింహాచలంలో గోడ కూలిన ఘటనపై తొలుత మాట్లాడుతూ ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో చూడాలన్నాడు. అదీ మరోకరిపై నెట్టేయాలని. తీరా వారం రోజుల క్రితమే గోడ కట్టారని తెలియగానే ఎలా కట్టారో తెలియదన్నాడు. చంద్రబాబుకు తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఉండదు.
సింహాచలం ఘటనలో మరణించిన వారిని పరామర్శించడానికి జగన్ వస్తున్నాడని తెలిసి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాడు. గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.కోటి పరిహారం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాడు జగన్. గోడ కూలిన దుర్ఘటనలో చనిపోయిన ఈ కుటుంబాలకు మేం అధికారంలోకి వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ సొమ్ము నేనే స్వయంగా తెచ్చి ఇస్తాను. చంద్రబాబు మానవతా ధృక్పథంతో ఆలోచించి జగన్ ఇచ్చే లోగా రూ.కోటి పరిహారం ఇవ్వాలి. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు తదితరులున్నారు.