తుది శ్వాస విడిచే వరకు విలువలు వీడని ‘మానికొండ’

ప్రపంచానికి తెలియని గొప్ప జర్నలిస్టు మానికొండ చలపతిరావు. దేశ ప్రధానులు సైతం ఆయన సూచనల కోసం ఎదురు చూశారు.;

By :  Admin
Update: 2025-01-16 16:30 GMT

విలువలు, విశ్వసనీయత జర్నలిజానికి రెండు కళ్లు. అటువంటి జర్నలిజానికి బీజాలు వేసిన వ్యక్తి మానికొండ చలపతిరావు అని కుడా చైర్మన్‌ సోమిశెట్టీ వెంకటేశ్వర్లు అన్నారు. నేటి తరం జర్నలిస్టులు మానికొండ మార్గాన్ని కొంతైనా అనుసరించాలని కోరారు. గురువారం సాయంత్రం కర్నూలు నగరంలోని లలిత కళాసమితిలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రచయిత సీనియర్‌ జర్నలిస్టు ఆకుల అమరయ్య రాసిన ’భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన ‘ది ఫెడరల్‌’ ఆంగ్ల పత్రిక సంపాదకులు జింకా నాగరాజు మాట్లాడుతూ భారతీయ జర్నలిజంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర మానికొండ చలపతిరావుదని అన్నారు. మానికొండ చలపతిరావు చరిత్రను ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ నిర్మాణంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనదన్నారు. జర్నలిజంలో సరికొత్త పాఠం ఆయన చరిత్ర అన్నారు. పుస్తకాన్ని గాడిచర్ల ఫౌండేషన్‌ అధ్యక్షులు చంద్రశేఖర కల్కూర ఆవిష్కరించారు.

ముఖ్య అతిథిగా హాజరైన సోమిశెట్టి మాట్లాడుతూ సమాజనిర్మాణంలో జర్నలిస్టుల కృషి గొప్పదని, జర్నలిస్టులు లేని రాజకీయాలను ఊహించలేమన్నారు. కల్కూర మాట్లాడుతూ.. నాటి జర్నలిజం గొప్ప సమాజాన్ని నిర్మించిందన్నారు. ఆనాటి తరం జర్నలిస్టులు భారతీయ పత్రికా రంగానికి విశేష కృషి చేశారని అన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ ఈ పుస్తకం రూపకల్నన గొప్ప జర్నలిస్టును పరిచయం చేసిందన్నారు. రచయిత కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని అన్నారు. ఈ పుస్తకం జర్నలిజానికి దిక్సూచి లాంటిదని, నైతికతకు, మానవతకు మారుపేరైన మానికొండ జీవితాన్ని ప్రతి జర్నలిస్టు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ పుస్తకం పరిశోధకులకు మంచి గ్రంధంగా ఉపయోగపడుతుందని అన్నారు. రచయిత రచనా చాతుర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. రచయిత లోతైన విషయాలు చెప్పడం జరిగిందన్నారు.
సీనియర్‌ జర్నలిస్టు బి గోరంట్లప్ప మాట్లాడుతూ నేటితరం గుర్తించుకోవాల్సిన గొప్ప జర్నలిస్టు మానికొండ చలపతిరావు అని అన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ మానికొండ పుస్తకం జర్నలిజం లోని కొత్తకోణం తెలియజేసిందన్నారు. రచయిత, సీనియర్‌ జర్నలిస్టు ఆకుల అమరయ్య మాట్లాడుతూ వృత్తి పరమైన జీవితంలో ఎన్నో అవకాశాలొచ్చినా వదులుకున్న గొప్ప జర్నలిస్టు మానికొండ చలపతిరావు అని అన్నారు. ఆయన త్యాగం నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శమన్నారు. పద్మభూషణ్‌ ఇస్తామన్నా వద్దన్న మహనీయుడు మానికొండ అన్నారు. ఆయన పేరుపై ప్రభుత్వం అవార్డు ప్రవేశపెట్టాలని, లేదంటే అమరావతిలో స్మృతి చిహ్నంగా స్మారక భవనం నిర్మించి అందులో జర్నలిజానికి సంబంధించిన గొప్ప పుస్తకాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ భవనం నేటి జర్నలిస్టులకు గ్రంధాలయంగా ఉపయోగపడే విధంగా ప్రభుత్వం తీర్చి దిద్దాలని విజ్ఞప్తి చేశారు. సభలో మహమ్మద్‌ మియా పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కవులు ఇనాయతుల్లా, విజయులు, అజీజ్, ఆధ్య మెడికల్‌ అధినేత ఏవీ రెడ్డి, పీపీఎస్‌ఎస్‌ నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి పాల్గొన్నారు.
Tags:    

Similar News