‘విద్యార్థులకే నా సపోర్ట్’.. ఎంబీయూ యూనివర్సిటీ వివాదంపై మంచు మనోజ్

విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో మోహన్ బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)ను స్థాపించారు. అనతికాలంలో ఈ యూనివర్సిటీ మంచి పేరు సంపాదించుకుంది.

Update: 2024-09-15 07:53 GMT

విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో మోహన్ బాబు యూనివర్సిటీ(ఎంబీయూ)ను స్థాపించారు. అనతికాలంలో ఈ యూనివర్సిటీ మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఇప్పుడు ఇదే యూనివర్సిటీ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఈ యూనివర్సిటీ తీరుపై తల్లిదండ్రుల కమిటీ, విద్యార్థి సంఘాలు ఏఐసీటీయూని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. యూనివర్శిటీ తీరు వర్ణణాతీతంగా ఉందని గగ్గోలు పెడుతున్నాయి. ఇంతకీ ఈ సమస్య ఏంటంటారా.. అదే ఫీజుల రాద్దాంతం. యూనివర్సిటీ తనకు నచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తుందనేదే సమస్య. విద్యార్థుల నుంచి ఏదో ఒక పేరు చెప్పడం వేలకు వేల రూపాయలు ఫీజుల రూపంలో దండుకోవడమే యూనివర్సిటీ దినచర్యగా మారిపోయిందని, ఫీజుల రూపాన డబ్బులు దండుకోవడం కోసం ఎక్కడా లేని నిబంధనలను కూడా తీసుకొస్తోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు తమ సమస్యలను పేర్కొంటూ ఏఐసీటీయూకు లేఖ రాశారు. ‘‘కన్వీనర్ కోటాలో సీటు తీసుకున్న విద్యార్థుల చేత కూడా నిర్థీత ఫీజులకు మించి వసూలు చేస్తున్నారు. బలవంతపు ఫీజులు కూడా రుద్దుతున్నారు. బలవంతంగా యూనిఫాంలు కొనిపిస్తున్నారు. డే స్కాలర్స్ కూడా మెస్‌లోనే మధ్యాహ్న భోజనం చేయాలని కండిషన్ పెట్టారు. వారి మాట వినకుంటే బౌన్సర్లతో దాడులు చేయిస్తున్నారు’’ అని తల్లిదండ్రుల కమిటీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఈ వివాదంపై తాజాగా మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ స్పందించారు. మనోజ్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఈ వివాదాన్ని మరింత అధికం చేస్తున్నాయి. ఒకవైపు తన తండ్రి మంచి వాడంటూనే తన మద్దతు మాత్రం విద్యార్థులకు, తల్లిదండ్రులకు తప్పకుండా ఉంటుందని చెప్పారు. ఏఐఎస్‌ఎఫ్‌కు కూడా ఈ విషయంలో పూర్తి మద్దతు ఇస్తానని ఆయన తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.

‘మా నాన్న దృష్టికి తీసుకెళ్తా’

‘‘విద్యానికేతన్, ఎంబీయూలోని సమస్యలు నా దృష్టికి వచ్చాయి. అవి చాలా బాధించాయి. మా నాన్న, ఛాన్సలర్ మోహన్ బాబు ఎప్పుడూ కూడా విద్యార్థులు, రాయలసీమ కమ్యూనిటీ సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన శ్రమకు ఫలితం ఈ విద్యాసంస్థల విజయంలో ప్రతిబింబిస్తుంది. ఆయన ఆలోచనా తీరు, విజన్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ అంశంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఏఐఎస్ఎఫ్‌కు నా పూర్తి మద్దతు ఇస్తాను. ఈ విషయానికి సంబంధించి నేను ఇప్పటికే యూనివర్సిటీ చీఫ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ వినయ్‌ను సంప్రదించా.. ఆయన నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఎవరైనా తమకు ఉన్న సమస్యలను mm.mbu0419@gmail.com కు మెయిల్ చేయడం ద్వారా నాకు పంపొచ్చు. వాటన్నింటినీ నేను మా నాన్న దృష్టికి తీసుకెళ్తాను. మా విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం’’ అని మనోజ్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ మంచు ఫ్యామిలీలో వివాదాలకు దారి తీస్తుందని ప్రచారం కూడా మొదలైపోయింది.

కుటుంబ వివాదంగా ఎంబీయూ సమస్య

మోహన్ బాబు యూనివర్సిటీ సమస్య కాస్తా ఇప్పుడు కుటుంబ వివాదంగా మారే పరిణామాలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ, విద్యానికేతన్ సంస్థలను ప్రస్తుతం మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచి విష్ణు నిర్వహిస్తున్నారు. వాటిపై తీవ్ర ఆరోపణలు వస్తున్న క్రమంలో స్పందించిన మంచు మనోజ్.. వాటిని ఖండించాల్సింది పోయి ఆరోపణలు చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఏఐఎస్‌ఎఫ్‌కు తన పూర్తి మద్దతు ప్రకటించడం కీలకంగా మారింది. కుటుంబంలో ఇప్పటికే ఉన్న విభేదాల కారణంగానే మనోజ్ ఇలా చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై మంచు ఫ్యామిలీ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

ఎంబీయూలో కచ్చితంగా చెల్లించాల్సినవి

ఐటీ ఫీజు రూ. 8000

బస్సు ఫీజు రూ. 26,000

యూనిఫామ్ ఫీజు రూ. 10,500

డే స్కాలర్ మెస్ ఫీజు రూ. 20,000

ఏడాదికి మొత్తం రూ. 2,05,000

ఇదే పరిస్థితి అన్ని ప్రైవేటు యూనివర్సిటీ లు, కాలేజీల్లో ఉంది. ఇదెక్కడి న్యాయం? ఈ యూనివర్సిటీలకు యూజీసీ ఎలా అనుమతి ఇచ్చిందో సమాధానం చెప్పాలి అని కోరారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2023 -24లో గుర్తింపు పొందిన నాలుగు యూనివర్సిటీలకు ఒక రకమైన ఫీజు, పాత ప్రైవేట్ యూనివర్సిటీలో ఒకరకమైన ఫీజు ఏమిటని ప్రశ్నించారు.

ఒక్కో కాలేజీకీ ఒకో ఫీజా?

ఇంజనీరింగ్ కోర్సులకు ఫీజులు ఒక్కో కాలేజీకి ఒక్కో రకంగా వసూలు చేయడం ఏమిటో అర్థం కావడం లేదని ఆ లేఖలో ప్రస్తావించారు. కనిష్ట రుసుము రూ. 43 వేలు, గరిష్ఠంగా రూ. లక్ష సిఫార్సు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మెజారిటీ కాలేజీలు రూ. 43 వేల ఫీజు కేటగిరీ కిందకు వస్తాయి అని కూడా అందులో గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కన్వీనర్ కోట ద్వారా అనుమతి పొందిన కొత్త, ప్రైవేటు వర్సిటీలకు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల మధ్య ఫీజులు నిర్ణయం, భారీ వ్యత్యాసం ఉందనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

Tags:    

Similar News