Leopard's commotion | తిరుపతి వర్శిటీలో చిరుత సంచారంతో కలకలం

తిరుపతి వర్సిటీలో ఓ చిరుత సంచారం కలకలకం రేపింది. దీని కదలికలపై అటవీశాఖ రంగంలోకి దిగింది.;

Update: 2024-12-17 05:12 GMT

తిరుపతి నగర శివారు శేషాచలం అటవీప్రాంతం వరకు విస్తరించింది. ఈ అటవీప్రాంతం నుంచి జనారణ్యంలోకి వస్తున్న వన్యమృగాల సంచారం ఎక్కువైంది. దీంతో తరచూ స్థానికులే కాదు. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కూడా భయాందోళన చెందుతున్నారు. తాజాగా..

తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో ఓ చిరుత సంచరించడం కలకలం రేపింది. మంగళవారం వేకువజామున చిరుత పులి సంచారం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడానికి ముఖద్వారంగా ఉన్న అలిపిరి నుంచి శేషాచలం కొండలకు దిగువన దట్టమైన అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అడవికి మధ్యలో బైపాస్ రోడ్డు దీనికి సమీపంలోనే అనేక విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వాస్పత్రులు కూడా ఉన్నాయి. అందులో..
ప్రధానంగా తిరుపతి రుయా ఆస్పత్రి, స్విమ్స్, బర్డ్స్ ఆస్పత్రులతో పాటు వేద విశ్వవిద్యాలయం, భారతీయ విద్యా భవన్ తోపాటు కొన్ని శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం కూడా ప్రధానమైనది. కాగా,
వేద విశ్వవిద్యాలయం కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం కూడా అడవిని తలపిస్తుంటుంది. దీంతో తిరుమల శేషాచలం అటవీప్రాంతం నుంచి దిగువ ప్రదేశంలోని విద్యా సంస్థల్లోకి తరచూ చిరుతల సంచారం పెరుగుతోంది. మంగళవారం వేకువజామున ఓ చిరత సంచరించడం కొందరు విద్యార్థులు, గమనించడంతో పాటు, ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిఘా సిబ్బంది చూశారు. దీంతో వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో చిరుత సంచారంపై అటవీశాఖ సిబ్బంది దృష్టి పెట్టారు. ఈ చిరుత వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా, బంధించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
తిరుపతి జూ పార్కులో ఉన్న బోను తీసుకుని వచ్చి, వేదవిశ్వవిద్యాలయంలో అమర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే,
తిరుమల కాలిబాటలో గత ఏడాది ఇద్దరు పిల్లలపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. వారిలో ఓ బాలిక చిరుత దాడిలో బలైంది. ఓ పిల్లవాడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ తరహా సంఘటలకు ఆస్కారం లేకుండా అటవీశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై తిరుపతి ఎఫ్ఆర్ఓ సుదర్శన్ ( forest Range Officer - Fro) 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ, "వేద విశ్వవిద్యాలయంలో చిరుత సంచారంపై సమాచారం అందింది" అని ధృవీకరించారు. సోమవారం అర్ధరాత్రి సంచారం ఉన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది నుంచి మరో ఎఫ్ఆర్ఓ మాధవికి అందిందని ఆయన చెప్పారు. ఆమె నుంచి మాకు సమాచారం వచ్చిందని సుదర్శన్ చెప్పారు. "వేకువజామునే మా సిబ్బంది చిరుత సంచారంపై ఆనవాళ్ల పరిశీలకు టీం పంపించాం" అని సుదర్ఢన్ వివరించారు.
Tags:    

Similar News