రుషికొండ ప్యాలెస్‌పై బడా బాబుల కన్ను!

ప్యాలెస్‌ను దక్కించుకోవాలని ఉబలాటం. వైసీపీ హయాంలో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మాణం. ఈ భవంతిపై నిర్ణయానికి కూటమి సర్కారు మీనమేషాలు.

By :  Admin
Update: 2024-10-07 03:00 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

ఆంధ్రప్రదేశ్లో అత్యంత విలాసవంతమైన రాజప్రాసాదంగా పేరుతెచ్చుకున్న రుషికొండ ప్యాలెస్ కొన్నాళ్లుగా ఎందుకూ కొరగాకుండా ఉంది. సాగరతీరంలోని రుషికొండపై యువరాణిని తలపించే సౌందర్యంతో కనువిందు చేస్తున్న ఈ భవంతిపై ఇప్పుడు బడాబాబుల కన్ను పడింది. మిలమిలా మెరిసిపోతున్న ఈ ప్యాలెస్ను ఎలాగైనా సొంతం చేసుకోవడానికి వీరు ఉబలాట పడుతున్నారు. ఇందుకోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చి విశాఖలో తిష్ట వేస్తున్నారు. తరచూ ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రుషికొండపై పర్యాటక శాఖకు చెందిన కాటేజీలు, సమావేశ మందిరాలు ఉండేవి. ఈ కొండపై నుంచి చూస్తే ఒకపక్క విశాఖ నగరం, మరోపక్క సాగరం, వాటికి అదనంగా పచ్చని పర్వత శ్రేణులు మనసును కట్టి పడేస్తాయి. అలాంటి

రుషికొండపై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా మనసు పారేసుకున్నారు. అక్కడ ఉన్న 9.88 ఎకరాల్లో ఓ విలాసవంతమైన రాజ భవనాన్ని నిర్మించాలని తలపెట్టారు. దీనిపై పర్యావరణవేత్తలు, అప్పటి ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొంతమంది కోర్టులకెక్కారు. అయితే రాజు తలచుకుంటే.. అన్నట్టు వాటినేమీ లెక్క చేయకుండా 1,41,438 చదరపు అడుగుల్లో ఏడు విలాసవంతమైన, విశాఖలమైన భవనాలను నిర్మించేశారు. కళ్లు చెదిరే అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఇందుకోసం రూ.సుమారు రూ.500 కోట్లు వెచ్చించారు. వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయితే రాజధానిగా విశాఖ నుంచే పాలన సాగిస్తానని పలుమార్లు ప్రకటించారు.

 

ఆయన మంత్రివర్గ సహచరులూ పదేపదే ఆదే చెబుతూ వచ్చారు. ఆయన తన పరిపాలనను ఈ రుషికొండ రాజభవనాల నుంచే చేస్తారని, అందుకోసం రూ. వందల కోట్లు ఖర్చుతో ఇంతటి విలాసవంతమైన భవనాలను నిర్మించారని ఊరూవాడా కోడై కూసింది. ఇంతలో ఆ కోరిక తీరకుండానే వైసీపీ ప్రభుత్వం పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు ఈ రుషికొండ ప్యాలెస్ గురించి బాహ్య ప్రపంచానికి తెలియలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భీమిలి (టీడీపీ) ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ ప్యాలెస్లోకి అడుగు పెట్టారు. వెంట మీడియాను తీసుకెళ్లారు. కళ్లు చెదిరే భవంతులు, వాటిలోని ఫర్నిచర్, నిర్మాణ శైలి నభూతో.. అనేలా ఉన్న తీరును బయట పెట్టారు. వాటిని చూసిన వారంతా ఔరా! అంటూ నోరెళ్లబెట్టారు.

కన్నేసిన బడాబాబులు..

ఇప్పటికే దేశమంతటా రుషికొండ ప్యాలెస్ గురించి మార్మోగిపోయింది. దీంతో దీనిపై బడాబాబుల కన్ను పడింది. కళ్లు చెదిరే ఈ భవంతిని కైవసం చేసుకోవాలన్న ఆలోచన కలిగింది. ఇలాంటి వారు కొందరు ప్రభుత్వ పెద్దలతో తమ మనసులో మాటను వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో దీనిని పబ్లిక్, ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ)/ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీవోటీ) పద్ధతిలో కేటాయించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై ఓ నిపుణుల కమిటీని నియమించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

దీనికనుగుణంగానే బడా పారిశ్రామికవేత్తలు ముందస్తుగా ఈ రుషికొండ భవనాలను సందర్శించేందుకు విశాఖ పర్యటన పేరిట వస్తున్నారని చెబుతున్నారు. అయితే ఎంతటి వారైనా రుషికొండలోకి అనుమతించవద్దని ఉన్నత స్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలుండడంతో ఇక్కడ పర్యాటక శాఖ అధికారులు ఎవరినీ అడుగు పెట్టనీయడం లేదు. దీంతో ఇలాంటి వారంతా అల్లంత దూరం నుంచే చూసి వెళ్లిపోతున్నారు. రుషికొండ భవనాలపై ఉన్నత స్థాయిలోనే నిర్ణయం తీసుకోవలసి ఉందని పర్యాటకాభివృద్ధి సంస్థ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

 

నిర్వహణ గాలికొదిలేశారా?

రూ.500 కోట్లు వెచ్చించి నిర్మించిన అత్యంత విలావంతమైన ఈ రుషికొండ భవనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటిపోయినా ఆయన ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. దీనిపై ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. పర్యాటకశాఖపై ఆయన సమీక్షలు జరిపినా 'రుషికొండ' ఊసెత్తడం లేదు. మంత్రులు సైతం తమ అధినేత చంద్రబాబుదే అంతిమ నిర్ణయం అని తప్పించుకుంటున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ మంత్రి లోకేష్ సైతం రుషికొండలోకి తొంగి చూడలేకపోతున్నారు. విచిత్రమేమిటంటే.. నాడు వైసీపీ పాలనలోను, నేడు కూటమి పాలనలోనూ ఎవరై ఈ రాజప్రాసాదంలోకి అడుగు పెట్టే సాహసం చేయలేక పోతున్నారు. ఈలోగా ఈ విలాస భవంతి నిర్లక్ష్యానికి గురవుతోంది. దీని

నిర్వహణను గాలికొదిలేశారు. రోజుకు కనీసం రూ.లక్ష వరకు నిర్వహణ ఖర్చవుతుందని తెలుస్తోంది. అయితే ఆ మేరకు అక్కడ నిర్వహణ జరగడం లేదు. ఇనుప వస్తువులు తుప్పు పడుతుండగా, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలు కూడా సరైన నిర్వహణ లేక పాడైపోతున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఈ భవంతి వినియోగంలో లేకపోయినా ఇప్పటివరకు రూ.85 లక్షల విద్యుత్ బకాయిలున్నాయి. వీటి చెల్లింపుపైనా జాప్యం జరుగుతోంది. ఇంతటి భవంతికి విద్యుత్, ప్లంబింగ్, నీటి సరఫరా, హార్టికల్చర్, హౌస్ కీపింగ్ వంటి పనులకు రోజుకు కనీసం వంద మంది సిబ్బందైనా అవసరమవుతుంది. కానీ అక్కడ ఈ రాజ భవనం ఖాళీగా, నిరుపయోగంగా పడి ఉండడంతో తూతూమంత్రంగానే పర్యవేక్షణ, నిర్వహణ జరుగుతోంది. ఈ ప్యాలెస్ను ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన డీఈసీ అనే సంస్థ నిర్మించింది. ఆ సంస్థ సిబ్బందే అక్కడ సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు.

 

అక్రమ కట్టడాలను ధ్వంసం చేయాల్సిందే..

'కేరళ తీరంలో మారాడు వద్ద సీఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన అపార్ట్మెంట్లను సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్చివేశారు. విశాఖ రుషికొండపై కూడా సీఆర్జేడ్ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని నిర్మాణాలు చేపట్టారు. పర్యాటక శాఖ అధీనంలో ఉన్న మేరకు నిర్మాణాలను కొనసాగించి, ఆపై కట్టిన వాటిని కూల్చేయాలి. మున్ముందు ఈ భవనాలు పర్యాటకశాఖ అధీనంలోనే కొనసాగాలి. ఇక్కడ అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులు, బాధ్యులైన ప్రజాప్రతినిధులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వారి నుంచి దీనికైన ఖర్చును వసూలు చేయాలి' అని భారత ప్రభుత్వ ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ స్పష్టం చేశారు.

కళ్లు చెదిరే సదుపాయాలు..

ఇంద్రభవనాన్ని తలపించే ఈ రుషికొండ భవంతిలో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన సౌకర్యాలు, సదుపాయాలున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చే సిన ఖరీదైన సోఫాలు, మంచాలు, షాండ్లియర్లు, ఫ్యాన్లు, సెంట్రలైజ్డ్ ఏసీలు, బాత్ టబ్, కమోడ్ లు, ఇటీలియన్ మార్బుల్ గోడలు, వంట గది సామగ్రి వస్తువులు, ఆటోమెటిక్ పరికరాలు, సామగ్రి ఇలా కళ్లు మిరుమిట్లు గొలిపేవి ఉన్నాయి. వీటన్నిటినీ టీవీలు, సోషల్ మీడియాలో చూసిన వారు అవాక్కయ్యారు. 

Tags:    

Similar News