మోoథా తుఫాను: కర్నూలు జిల్లా యంత్రాంగం సన్నద్ధం

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి

Update: 2025-10-28 05:37 GMT

-వడ్ల శ్రీకాంత్


బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం నేడు తీరం దాటి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి అన్న సమాచారంతో కర్నూలు జిల్లా యంత్రాంగం ఆప్రమత్తమైంది.

తుఫాను ప్రభావంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాను తీవ్ర రూపం దాల్చి భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉండటంతో దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది.

తుఫాను ప్రభావం కర్నూలు ఉమ్మడి జిల్లా మీద అంత తీవ్రంగా ఉండనప్పటికీ.. వర్షాల వల్ల వచ్చే వరదలను తట్టుకునే విధంగా ప్రజలను అధికారులు ఆప్రమత్తం చేస్తున్నారు.

అలాగే తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండబోతున్న నేపథ్యంలో అక్కడ జరగబోయేటువంటి నష్ట నివారణ చేపట్టేందుకు కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 

జిల్లా కలెక్టర్ డా. సిరి

అందుకు సంబంధించి తుఫాను అనంతరం ఆయా జిల్లాలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి నేతృత్వంలో సమీక్ష సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో ఆయా జిల్లాలో ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులు కూరగాయలు,పాలు, బ్రెడ్ లతో పాటు అక్కడి పశువులకు అవసరమైన పశుగ్రాసం, దానాలను తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు వరద ప్రభావిత ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులకు, విద్యుత్తు లైన్ల పునరుద్ధరణకు అవసరమైన స్తంభాలు అలాగే సిబ్బందిని కూడా పంపించేందుకు ఆయా శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటూనే రాష్ట్రంలో తుఫాన్ వల్ల నష్టం జరిగిన ఏ ప్రాంతంలోనైనా సహాయ సహకారాలు అందించేందుకు సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలని కలెక్టర్ డాక్టర్ సిరి అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News